కట్టుకథల ఆంధ్రజ్యోతి


Wed,May 22, 2019 02:50 AM

Telangana Government Fires On Andhra Jyothi News Paper Project Fake News

-కండ్లల్లో నిప్పులు.. కడుపులో కత్తులు
-తెలంగాణ అభివృద్ధిని తట్టుకోలేక ద్రోహచింతనతో చెత్త రాతలు
-అపనమ్మకాలు నాటే కుటిలయత్నం
-దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ
-చూసి గుండెలు బాదుకుంటున్న రాధాకృష్ణ
-మండిపడుతున్న తెలంగాణవాదులు
-ఆంధ్రజ్యోతి రాతలపై సర్కార్ సీరియస్!
-చట్టపరంగా చర్యలకు సీఎం కేసీఆర్ ఆదేశం?
-ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్న అధికారులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ అభివృద్ధి వేగాన్ని తట్టుకోలేని ఆంధ్రజ్యోతి అజీర్తి.. ప్రస్తుతం వాంతులు చేసుకునే దశకు చేరుకుంది! ఇది తదుపరి ఏ దశకు చేరుతుందోగానీ.. అబద్ధాలకు తాలింపు వేసి.. అక్షరాలకు మసాలా దట్టించి.. కట్టుకథలు.. పిట్టకథలతో తెలంగాణ సమాజంలో అపనమ్మకాల విత్తనాలు నాటేందుకు ఇప్పుడు రాధాకృష్ణ నిద్రమానేసి మరీ ఆసనాలు ప్రాక్టీస్ చేస్తున్నారు! తెలంగాణ చల్లగా సుభిక్షంగా ఆత్మగౌరవంతో అడుగులువేయడం ఆయనకు అస్సలు నచ్చడం లేదు. కండ్లల్లో నిప్పులు, కడుపులో కత్తులు పెట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని నాట్యంచేస్తున్నారు. తెలంగాణ ఖజానా ఖాళీ అయిందట. బిల్లులు చెల్లించడం లేదని ఎవరో లబలబలాడుతున్నారట! ఎక్కడో ఒక పనికిమాలిన ముక్క పట్టుకుని.. ముక్కిముక్కి తట్టెడు వార్తగా వదిలి.. పైశాచికానందాన్ని అనుభవిస్తున్నాడని తెలంగాణవాదులు నిప్పులు చెరుగుతున్నారు.

ఇది రాధాకృష్ణ బాధ. రాధాకృష్ణ లబలబ. ఒకప్పుడు ఆంధ్రజ్యోతి, దాని అంతేవాసులు శాపనార్థాలు పెట్టినట్టు తెలంగాణ చీకటిమయం కాలేదు. తెలంగాణలో అల్లకల్లోలం పుట్టలేదు. తెలంగాణలో తీవ్రవాదులో ఉగ్రవాదులో చెలరేగలేదు. వారు ఆశించినట్టు తెలంగాణ అడుక్కుతినడంలేదు. తెలంగాణ ఆగంకాలేదు. తెలంగాణ ఎవరిమీదా ఆధారపడటం లేదు. తెలంగాణ ఆత్మగౌరవంతో బతుకుతున్నది. తెలంగాణ అన్నిరంగాల్లో రికార్డులు సృష్టిస్తున్నది. సంక్షేమం, వ్యవసాయం, నీటిపారుదల, తాగునీరు, కుటుంబ సంక్షేమం ఇలా అన్నిరంగాల్లో కొత్తపుంతలు తొక్కుతున్నది. ఒక కుటుంబానికి ఎన్ని రకాల సహకారాలు అందాలో అన్ని సహకారాలను వివిధ సామాజిక సంక్షేమ పథకాల ద్వారా సబ్బండవర్ణాలకు అందిస్తున్నది. అందుకే ఇప్పుడు కేసీఆర్.. తెలంగాణలోని ప్రతి ఇంటికీ పెద్దకొడుకు.

ప్రతి ఆడబిడ్డకు మేనమామ. ప్రతి పాపాయికి తాత. బడుగు బలహీనవర్గాలకు కొండంత ధీమా. ఇప్పుడు తెలంగాణ ఒక దేదీప్యమానమైన శక్తి. ప్రగతిబాటకు వెలుగు దివిటీ. అది తట్టుకోలేకనే రాధాకృష్ణ తెలంగాణపై అబద్ధాల దాడికి దిగా రు అని టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడొకరు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకోసం ఆరుదశాబ్దాలలో ఏనాడూ ఏ ప్రభుత్వమూ ఇన్ని వేలకోట్ల నిధులు ఖర్చుచేయలేదు. తెలంగాణ ఆదాయం చాలా ఉత్పాదక, సేవారంగాల్లో రెట్టింపు అయింది. అక్కడ చం ద్రబాబు అలోలక్ష్మణా అని రోజూ అరుస్తూ ఉంటే ఇక్కడ కేసీఆర్ గంభీరంగా తన పని తాను చేసుకుపోతున్నారు. సత్వర ఫలితాలపై దృష్టితో ప్రాజెక్టులను, పథకాలను, పనులను పరుగులు పెట్టిస్తున్నారు. తెలంగాణ సర్వనాశనం అవుతుందని పిల్లిశాపనార్థాలు పెట్టిన మూకకు ఈ పరిణామాలు ఎలా జీర్ణమవుతాయి? అందుకే అసత్యాలు, అర్ధసత్యాలు, చెత్త సుత్తిరాతలు పత్రిక నిండా కుమ్మరించి పైశాచికానందం పొందడానికి రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నారు అని విమర్శించారు.

ఆంధ్రజ్యోతిది ద్రోహబుద్ధి

ఆంధ్రజ్యోతి తెలంగాణకు వ్యతిరేకంగా రాస్తున్న ద్రోహపూరిత రాతలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. ఆంధ్రజ్యోతిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ద్రోహపూరిత రాతలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలని కూడా ఆయన అధికారులను కోరారని తెలిసింది. తెలంగాణ ఆర్థిక నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు, అభివృద్ధిపథం నుంచి పక్కదారి పట్టించేందుకు పనిగట్టుకుని ఆంధ్రజ్యోతిలో ఈ రాతలు రాస్తున్నారని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు సమాచారం. తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను సాగనివ్వబోమని ఆయన అన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

13180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles