ఇంజినీర్ల కృషికి వెలకట్టలేం


Thu,July 12, 2018 02:07 AM

Telangana Engineers day celebrations at Jalasoudha

-ప్రాజెక్టుల నిర్మాణంలో వారి కృషి అమోఘం
-కాళేశ్వరం డిజైన్ చూసి సీడబ్ల్యూసీ ఇంజినీర్లు అబ్బురపడ్డారు
-ఇంజినీర్స్ డేలో మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రతి ఇంజినీర్ రాష్ర్టాభివృద్ధికి పునరంకితం కావాలని ఇంజినీర్స్‌డే సందర్భంగా రాష్ట్ర ఇంజినీర్లకు నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పిలుపునిచ్చారు. జలసౌధలో ఇంజినీర్స్‌డే సందర్భంగా బుధవారం నవాబ్ అలీనవాజ్‌జంగ్ బహదూర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నాటి హైదరాబాద్ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, అద్భుత కట్టడాల రూపకర్త, వైతాళికుడు అయిన నవాజ్ జంగ్ ఉమ్మడి రాష్ట్రంలో విస్మరణకు గురయ్యారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలిరోజుల్లోనే ఆయన జన్మదినాన్ని ఇంజినీర్స్‌డేగా ప్రకటించుకున్నామని చెప్పారు. అదే స్ఫూర్తిని రాష్ట్రం వచ్చాక విద్యుత్‌శాఖ, నీటిపారుదల, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ శాఖల ఇంజినీర్లు కొనసాగిస్తూ రాష్ర్టాభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు.

మన ఇంజినీర్లు డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును చూసి కేంద్ర జలసంఘం ఇంజినీర్లు అబ్బురపడుతున్నారని ప్రశంసించారు. ప్రతి ప్రాజెక్టులోనూ మహిళా ఇంజినీర్లు రాత్రింబవళ్లు పనిచేస్తూ, తమ ఇంజినీరింగ్ ప్రతిభను చాటుతున్నారని మంత్రి అన్నారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, ఇంజినీర్స్ జేఏసీ చైర్మన్ వెంకటేశం, ఈఎన్సీ హరిరాం, చీఫ్ ఇంజినీర్లు వెంకటేశ్వర్లు, ఖగేందర్, వెంకటేశ్వర్లు, సునీల్, శ్రీనివాస్, డిప్యూటీ ఈఎన్సీ అనిత, ట్రీ అధ్యక్షుడు చంద్రమౌళి తదితర ఇంజినీర్లు పాల్గొన్నారు.


UMAKAR-RAO

ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో..

ఎర్రమంజిల్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో జరిగిన ఇంజినీర్స్‌డే వేడుకల్లో నవాజ్‌జంగ్ చిత్రపటానికి ఈఎన్సీ సురేందర్‌రెడ్డి పూలమాల వేశారు. కార్యాలయంలోని హౌస్ కీపింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్‌కు గ్రామీణ తాగునీటిశాఖ ఇంజినీర్స్ అసోసియేషన్ తరపున నూతనవస్త్రాలను అందజేశారు. సీఈ కృపాకర్‌రెడ్డి, కన్సల్టెంటు నందారావు, ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

నవాబ్ స్ఫూర్తితో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు

నవాబ్ అలీ జంగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రభు త్వం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపడుతున్నదని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్ రావు తెలిపారు. బుధవారం ఖైరతాబాద్‌లోని ఇంజినీర్స్ భవన్‌లో జరిగిన నవాబ్ అలీ జంగ్ బహదూర్ 141వ జయంతి ఉత్సవాల్లో ఆయన నవాబ్ అలీ చేసిన విశిష్ట సేవలను ప్రస్తావించారు. తెలంగాణకే తలమానికమైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈ ఏడాది డిసెంబరులోపు పూర్తి చేస్తామని ఈఎన్సీ గణపతిరెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే అన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఇంజినీర్లయిన ఉమాకర్‌రావు, మహ్మద్ గౌసియొద్దీన్, వి జంబుల్‌రెడ్డి, జీ ప్రభాకర్‌లకు ప్రత్యేకంగా నవాబ్ అలీజంగ్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను అందజేశారు.

825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS