ఇదేమి ధర్మం?


Thu,April 18, 2019 02:55 AM

Telangana Electricity Workers Societies Meet  justice dharmadhikari

-విద్యుత్‌ ఉద్యోగులందరికీ ఆప్షన్లు
-జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ మార్గదర్శకాలు
-మే 26లోగా ఆప్షన్‌ తీసుకోవాలంటూ నిర్ణయం
-మండిపడుతున్న తెలంగాణ విద్యుత్‌ సంఘాలు
-ఆంధ్రా ఉద్యోగులను జాయిన్‌ కానివ్వమంటూ హెచ్చరిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రెండురాష్ర్టాల మధ్య వివాదం సృష్టిస్తున్న విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యను సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ సానుకూలం గా, సామరస్యంగా పరిష్కరిస్తుందనుకుంటే.. వివాదాన్ని మరింత జటిలం చేస్తున్నదని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగసంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. తెలంగాణ, ఏపీ విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు, ఉద్యోగసంఘాల ప్రతినిధులు, అధికారులతో పలుమార్లు సమావేశమైన జస్టిస్‌ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ తీసుకున్న నిర్ణయం ఆంధ్రా విద్యుత్‌ ఉద్యోగులకు అనుకూలంగా.. తమ ఉద్యోగాలు కొల్లగొట్టేలా ఉన్నదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రెండు రాష్ర్టా ల విద్యుత్‌ ఉద్యోగుల సంఘాలు, అధికారులతో సమావేశమయింది. ఇరురాష్ర్టాల ప్రతినిధుల వాదనలు వినడంతోపాటు, విజ్ఞాపనలు తీసుకున్నది.

అయితే, జస్టిస్‌ ధర్మాధికారి అ ప్పటికే రూపొందించిన మార్గదర్శకాలను వారికి అందించి వాటి ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. స్టేట్‌క్యాడర్‌కు చెందిన విద్యుత్‌ ఉద్యోగులందరికీ ఆప్షన్‌ ఇవ్వాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ విద్యుత్‌ సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆ గ్రహం వ్యక్తంచేశారు. దశాబ్దాలుగా సమైక్యరాష్ట్రంలో తెలంగాణకు అన్యా యం జరిగిందని, ప్రత్యేకరాష్ట్రం వచ్చాక కూడా ఆంధ్రా ఉద్యోగులకే లబ్ధికలిగేలా అప్షన్‌ ఇవ్వడం ఎలా ధర్మమంటూ మండిపడ్డారు. ఈ మార్గదర్శకాలపై వందల సంఖ్యలో తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు తమ అభ్యంతరాలను ఈమెయిల్‌ ద్వారా పంపించారు. ఈ విషయాన్నికూడా కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్‌ సంఘాల నాయకులు శివాజీ, అంజయ్య మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి ఐదేండ్లు గడిచినప్పటికీ ఆంధ్రా ఉద్యోగులు.. మెడికల్‌ రూపంలోనో.. స్పౌజ్‌ కేసుల రూపంలోనే తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో చేరి.. ఇక్కడి ఉద్యోగుల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. మరో భారీ ఉద్యమం చేసైనా.. తెలంగాణ విద్యుత్‌ సంస్థలను ఆంధ్రా ఉద్యోగుల నుంచి కాపాడుకుంటామని తెలిపారు. ఆంధ్రా ఉద్యోగులు ఒక్కరిని కూడా తెలంగాణలో జాయిన్‌ కానీయమని హెచ్చరించారు. జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ ముందు తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఆంధ్రా విద్యుత్‌ సంస్థల తరఫున సీఎండీ విజయానంద్‌ ఇతర డైరెక్టర్లు, తెలంగాణ ఇంజినీర్ల సంఘం, తెలంగాణ విద్యుత్‌ అకౌంట్స్‌ అధికారుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.

జస్టిస్‌ ధర్మాధికారి మార్గదర్శకాలు- తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగ సంఘాల వివరణ

-తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రిలీవ్‌ చేసిన 1157 మంది ఆంధ్రా ఉద్యోగుల అంశం కోర్టు పరిధిలోకి సంబంధించినది అయినప్పటికీ.. కమిటీ అందరు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు అడగడం ద్వారా వివాదం పరిధిని పెంచి.. సమస్యను మరింత జటిలం.
-60 ఏండ్లుగా విద్యుత్‌రంగ ఉద్యోగాల్లో లోకల్‌ రిజర్వేషన్లు పాటించకపోవడంతో తెలంగాణకు భారీగా నష్టం జరిగిందని, అందుకే కమల్‌నాథన్‌ గైడ్‌లైన్స్‌ను వర్తింపజేయడం చెల్లదని, అనేక సమావేశాల్లో అంగీకరించిన తరువాత కూడా జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ ఇంచుమించుగా అవే గైడ్‌లైన్స్‌ ఇవ్వడం అన్యాయం.
-కంపెనీ చట్టం కింద ఏర్పడిన విద్యుత్‌ సంస్థల్లోని అన్ని ఉద్యోగాలు ఒక క్యాడర్‌ నుంచి మరొక క్యాడర్‌కు సర్దుబాటు చేసుకోదగినవి. దీని ప్రకారం.. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు, తెలంగాణ ఉద్యోగులను సర్దుబాటు చేసుకోవడానికి ముందుకొచ్చాయి. అదేవిధంగా ఆంధ్రా విద్యుత్‌ సంస్థలు కూడా ముందుకురావాలి. కానీ కమిటీ ఈ వాస్తవాలను పరిశీలించకపోవడం శోచనీయం.
-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనలోనూ కేంద్ర ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల భార్యాభర్తల కేసులను పరిగణనలోకి తీసుకోలేదు.. కానీ, జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ అన్నిరకాలైన సంస్థల భార్యాభర్తల కేసులకు ఆస్కారమిచ్చి.. కొత్త సమస్యలకు తెరలేపింది.
-ఉద్యోగులైన భార్యాభర్తల కేసుల పేరుమీద, వందలాది ఆంధ్రాఉద్యోగులు అక్రమమార్గాల్లో తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో చొరబడేందుకు ఈ మార్గదర్శకాలు అవకాశం కల్పిస్తున్నాయి.
-ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల విషయంలో వివాదాలకు ఆస్కారం లేకుండా.. ఉద్యోగంలో చేరే సమయంలో ఏ జిల్లా నుంచి కుల ద్రువీకరణ పత్రం సమర్పిస్తే.. ఆ జిల్లా ఉన్న రాష్ర్టానికే కేటాయించాలి.
-ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇచ్చి.. అన్ని పోస్టులను సర్దడమంటే.. 60 ఏండ్లుగా విద్యుత్‌రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలకు జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ చట్టబద్ధత కల్పించినట్టే అవుతుంది.
-ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ర్టానికి పంపించి.. వారి జన్మభూమికి సేవచేసుకునే అవకాశం కల్పించడమే విద్యుత్‌ ఉద్యోగుల విభజనకు ఏకైక శాశ్వత పరిష్కారం.

3357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles