సీపీగెట్ ఫలితాలు విడుదల

Sat,August 10, 2019 02:46 AM

-95.88 శాతం ఉత్తీర్ణత నమోదు
-13 నుంచి కౌన్సెలింగ్, సెప్టెంబర్ 3 నుంచి తరగతులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఎల్‌ఐసీ, ఎంఎడ్) కోర్సులకు జూలై 8 నుంచి 20 వరకు నిర్వహించిన కామన్ పీజీ ప్రవేశపరీక్ష (సీపీగెట్-2019) ఫలితాల్లో విద్యార్థినులు పైచేయి సాధించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఓయూ, కేయూ, ఎస్‌యూ, టీయూ, ఎంజీయూ, పీయూ, జేఎన్టీయూహెచ్‌లో 60 రకాల పీజీ కోర్సులకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు ఏడు యూనివర్సిటీల నుంచి మొత్తం 90,354 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో విద్యార్థులు 35,616 మంది, విద్యార్థినులు 54,728 మంది ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో 78,032 మంది పరీక్షలకు హాజరవగా 74,815 మంది అర్హత సాధించారు. 95.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

కామర్స్ సబ్జెక్టుకే అధిక డిమాండ్

డిగ్రీలో బీకాం మాదిరిగానే పీజీలో కూడా విద్యార్థులు ఎంకాంకు ఎక్కువ మొగ్గుచూపారని, పీజీ ప్రవేశపరీక్షలకు హాజరైనవారిలో కామర్స్ విద్యార్థులు 20,632 మంది ఉన్నారని పాపిరెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత కెమిస్ట్రీకి 8,179 మంది, గణితానికి 7,940 మంది పరీక్షలు రాశారని వివరించారు. ఎంఏ తెలుగుకు 4,454 మంది, ఎంఏ ఇంగ్లీష్‌కు 3,748 మంది, ఎంఏ పొలిటికల్‌సైన్స్‌కు 3,290 మంది పరీక్షలు రాసినట్టు పాపిరెడ్డి తెలిపారు.

13 నుంచి అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం

ఈ ఏడు యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సులకు కామన్ అడ్మిషన్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించామని, రాష్ట్రంలోని అన్ని పీజీ కాలేజీల్లో ఈ నెల 13 నుంచి ప్రవేశాల ప్రక్రియ (అడ్మిషన్ కౌన్సెలింగ్) ప్రారంభమవుతుందని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 16 నుంచి 24 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, ఈ నెల 18 నుంచి 26 వరకు వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా ఆప్షన్లు నమోదు చేసుకునే ప్రక్రియ ఉంటుందన్నారు. ఈ నెల 29న సీట్ల కేటాయింపు పూర్తిచేసి, సెప్టెంబర్ 3 నుంచి పీజీ కాలేజీల్లో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించామని, రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటాలో మొత్తం 29,600 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సీపీగెట్‌ను సమర్థంగా నిర్వహించిన కన్వీనర్‌కు, అడ్మిషన్ కౌన్సెలింగ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఓయూ ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
CPGET-20191

676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles