ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి



Wed,September 13, 2017 04:25 AM

-వచ్చే ఏడాది నుంచి ఒక సబ్జెక్టుగా అమలు
-ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ బోర్డులు తెలుగులో రాయాలి
-ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
-వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు
-డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహణ
-ప్రారంభ, ముగింపు వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి
-బాధ్యతలు సాహిత్య అకాడమీకి.. నిర్వహణకు రూ.50 కోట్లు
-మహాసభల ఔచిత్యం వివరించేందుకు ప్రపంచవ్యాప్తంగా సమావేశాలు
-హైదరాబాద్‌లో డాక్టర్ సినారె స్మారక మందిరం
-మూడ్రోజుల్లో స్థలం ఎంపిక చేసి.. నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు భాష పరిరక్షణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాదినుంచి అన్ని విద్యాసంస్థలు ఒకటో తరగతి మొదలుకుని 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు తెలుగును కచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని స్పష్టంచేశారు. అటువంటి విద్యాసంస్థలకే రాష్ట్రంలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మరో కీలక నిర్ణయంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ బోర్డులను తెలుగులో రాయాలని ఆదేశించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ మహాసభలను హైదరాబాద్‌లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు జరుపాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా జరిగే ఈ మహాసభల ప్రారంభ, ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను ఆహ్వానించాలని నిర్ణయించారు. మహాసభల సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
kcr

తెలుగు బోధించే విద్యాసంస్థలకే అనుమతి


వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని సీఎం కేసీఆర్ విద్యాసంస్థలను కోరారు. తెలుగును తప్పనిసరిగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని స్పష్టంచేశారు. ఉర్దూ కోరుకునే విద్యా
ర్థులకు ఉర్దూ భాషను కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉంచాలని నిర్ణయించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగుసబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ రూపొందించే బాధ్యతను తెలంగాణ సాహిత్య అకాడమీకి సీఎం అప్పగించారు. వెంటనే సిలబస్ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలని ఆదేశించారు. సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదురదని కూడా సీఎం స్పష్టంచేశారు. పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధన, అదికూడా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌నే బోధించడం విషయంలో అత్యంత కఠినంగా, కచ్చితంగావ్యవహరిస్తామని సీఎం తేల్చిచెప్పారు.

అన్ని సంస్థల బోర్డులపై తెలుగులో పేర్లు


రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై తమ అన్ని రకాల బోర్డులను కచ్చితంగా తెలుగులో రాయాలని సీఎం పిలుపునిచ్చారు. ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమని స్పష్టంచేశారు. ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాలని సీఎం నిర్ణయించారు.

వైభవంగా తెలుగు మహాసభలు


తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలు, కళాకారులను మహాసభలకు ప్రభుత్వం తరఫున ఆహ్వానించాలని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. సాహిత్య అకాడమీకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్లు నిర్వహణ ఖర్చుల కింద మంజూరుచేశారు. మహాసభల నిర్వహణ సంస్థ (నోడల్ ఏజెన్సీ)గా సాహిత్య అకాడమీ పనిచేస్తుందని తెలిపారు. అలాగే హైదరాబాద్ నగరంలో డాక్టర్ సీ నారాయణరెడ్డి స్మారక మందిరం నిర్మించాలని చెప్పారు. ఈ మేరకు మూడ్రోజుల్లో స్థలం ఎంపికచేసి, నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

పర్యాటక సదస్సు నేపథ్యంలో మారిన తేదీలు


వాస్తవానికి అక్టోబర్ నెలలోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. అయితే అక్టోబర్ 5 నుంచి 9 వరకు దాదాపు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ టూరిజం సదస్సు హైదరాబాద్‌లోనే జరుగుతున్నది. దాదాపు 170 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నవంబర్ 28 నుంచి హైదరాబాద్‌లోనే జరుగబోతున్నది. ఈ రెండు కార్యక్రమాల్లో అధికార యంత్రాంగమంతా తలమునకలై ఉంది. అదే సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే, అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని ప్రభుత్వం భావించింది. కాబట్టి పై రెండు ప్రపంచ సదస్సులు ముగిసిన తర్వాత డిసెంబర్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి సత్యనారాయణ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.
telugu-mahasabha

సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు :


-తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగిన ప్రయత్నంపై ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా చర్చాగోష్ఠులు నిర్వహించాలి. తెలంగాణలో వర్థిల్లిన తెలుగును ప్రపంచం నలుమూలలకూ తెలిపేలా కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి. గోల్కొండ నుంచి వెలువడిన తెలుగు సాహిత్యాన్ని పరిచయంచేయాలి. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి.
-ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి. రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కళాశాల మైదానం, భారతీయ విద్యాభవన్, పింగళి వెంకట్రామారెడ్డి హాల్, శిల్ప కళావేదిక తదితర వేదికల్లో కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు.
-మహాసభలో జరిగే సమయంలో ప్రతి రోజూ ఉదయం సాహిత్య గోష్ఠులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి, ఆటలు, కలుపుపాట, నాటు పాట, బతుకమ్మ లాంటి పాటలు, ఇతర వినోద ప్రక్రియలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉంటాయి. తానీషా-రామదాసు సంబంధం, రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, శారదకారులు, హరికథ ప్రక్రియ తదితర అంశాలను ప్రదర్శించాలి. పద్యగానం, సినీ పాటల విభావరి నిర్వహించాలి. చుక్క పొడుపు నుంచి పొద్దు గూకే వరకు గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే నాట్ల పాటలు, కోత పాటలు, దుక్కి పాటలు, జానపద గేయాలు వంటివి ప్రదర్శించాలి.
-ఆదివాసీ, గిరిజన, శాస్త్రీయ, జానపద నృత్యాలు లాంటివి ప్రదర్శించాలి.
-మహిళలు పాడే పాటలు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక తరం నుంచి మరో తరానికి ఎలా అందుతూ వచ్చాయో కండ్లకు కట్టినట్లు చూపించాలి.
-దేశవిదేశాల్లోని తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలు, కళాకారులను ఆ మహాసభలకు ప్రభుత్వం తరుఫున ఆహ్వానించాలి.
-దేశవిదేశాల్లోని అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలతోపాటు మారిషన్, సింగపూర్, మలేషియాలాంటి దేశాల్లో అక్కడున్న తెలుగువారి కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాలతోపాటు ఆంధ్రప్రదేశ్, దేశం నలుమూలల్లో తెలుగువారు నివసించే ప్రాంతాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహించాలి.
-కేవలం తెలుగువారినే కాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్‌లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందిన ప్రముఖులను కూడా ఈ మహాసభలకు ఆహ్వానించాలి.
-ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగుభాషా ప్రక్రియలకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి.
-తెలుగు భాషాభివృద్ధికి, వైభవానికి కృషిచేసిన కవులు, పండితులు, సాహితీవేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానించాలి.
-అతిథులందరికీ ప్రభుత్వ ఖర్చులతో బస, భోజనం, రవాణా.
-మహాసభలకు ముందే తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే పుస్తకాలు ముద్రించాలి.
-అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపించాలి.
-అతిథులకు తెలంగాణను పరిచయం చేయడం కోసం తెలంగాణ దర్శిని పేరుతో ప్రత్యేక డాక్యుమెంటరీ తయారు చేయాలి.
-తెలంగాణ జీవనచిత్రాన్ని, మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించే బతుకమ్మ నేపథ్యాన్ని వివరిస్తూ కళారూపాలు.
-మహాసభలకు తెలంగాణ సాహిత్య అకాడమీ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అధికార భాషా సంఘం, సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం, గ్రంథాలయ పరిషత్ తదితర సంస్థలు కీలక భూమిక నిర్వహించాలి.
-పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయ స్థాయిల్లో వ్యాసరచన, వక్తృత్వ, కవితా రచన, కథా రచన, నాటకాలు తదితరాలపై పోటీలు నిర్వహించాలి.
-మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని అలంకరించాలి. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేయాలి. జిల్లాల్లో కూడా అలంకరణలు ఉండాలి. రాష్ట్రమంతా పండుగ వాతావరణ నెలకొనాలి.

3598

More News

VIRAL NEWS