18 నుంచి అసెంబ్లీ


Fri,July 12, 2019 02:46 AM

Telangana Assembly to conduct special session on July 18 and 19 to pass New Municipal Act

-రెండురోజులపాటు నిర్వహణ
-19న మండలి సమావేశం
-నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసమే ప్రత్యేక సమావేశాలు
ప్రకటించిన సీఎం కార్యాలయం
-కొత్త చట్టం వచ్చాకే పుర ఎన్నికలు
-ఆగస్టు మొదటివారంలో నిర్వహణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ఈ నెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 18న కొత్త మున్సిపాలిటీ చట్టం బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలకు అందించనున్నారు. బిల్లుపై 19న చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఈ నెల 19వ తేదీన మండలి కూడా సమావేశం కానున్నది. అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్దేశించినవని, ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఉండవని సీఎం కార్యాలయం గురువారం ప్రకటించింది. రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ఆగస్టు మొదటివారంలో పుర ఎన్నికలు జరుపనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి ముసాయిదా చట్టాన్ని ఇప్పటికే న్యాయశాఖకు పంపించినట్టు ఆయన చెప్పారు.

మూడు లేదా నాలుగోవారంలో నోటిఫికేషన్!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే వేగవంతమైంది. మున్సిపాలిటీల్లో వార్డులవారీగా ఓటరు జాబితా ముసాయిదాను విడుదలచేశారు. పోలింగ్ కేంద్రాల జాబితా కూడా సిద్ధమైంది. బీసీ ఓటరు జాబితాను సైతం ఫైనల్ చేశారు. ఈ నెలాఖరుకే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వానికి వివరించింది. ఈ నేపథ్యంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల మూడోవారం లేదా నాలుగోవారం ప్రారంభంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రక్రియ కొంత ఆలస్యం కానున్నది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం.. బీసీ రిజర్వేషన్ల జాబితాను అందించిన వెంటనే ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 129 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్న విషయం తెలిసిందే.

3012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles