జాదవ్‌సాబ్ ఇకలేరు


Sun,June 17, 2018 02:46 AM

Telangana activist Professor Keshav Rao Jadhav passes away

-తొలితరం తెలంగాణ ఉద్యమయోధుడి కన్నుమూత
-శ్వాస సంబంధమైన ఇబ్బందితో దవాఖానలో మృతి
- సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం.. పలువురి నివాళి

అలుపెరుగని తెలంగాణ యోధుడు విశ్రమించారు. తెలంగాణే ఊపిరిగా జీవనప్రస్థానాన్ని సాగించిన మానవతామూర్తి అంతిమశ్వాస విడిచారు. తెలంగాణ అస్తిత్వ పోరాటం ప్రతి మలుపులో తన గొంతు వినిపించిన పోరుగడ్డ ముద్దుబిడ్డ కన్నుమూశారు. తెలంగాణ తెహజీబ్‌కు ప్రతీకలాంటి కేశవరావు జాదవ్ సారు ఇక లేరు. స్వరాష్ట్ర స్వప్నం సాకారమై.. బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నవేళ సుదీర్ఘ అస్వస్థతతో ఇక సెలవంటూ వెళ్లిపోయారు.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ అస్తిత్వం కోసం జీవితాన్ని ధారపోసిన ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్ (85) శనివారం ఉదయం కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన తొలితరం నేతలలలో అగ్రగణ్యుడైన జాదవ్ సుదీర్ఘ అస్వస్థతతో ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. గత ఐదేండ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కుటుంబసభ్యులు ఆయనను శుక్రవారం దవాఖానలో చేర్చారు. బర్కత్‌పురాలోని బ్రిస్టిల్‌కెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కేశవరావ్ జాదవ్ శనివారం ఉదయం 11.30 గంటలకు మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం భార్య కూడా తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరైన జాదవ్ ఆరునెలలుగా అస్వస్థతకు గురై ఇంటికే పరిమితమయ్యారు. చిన్నకూతురు నీలిమ ముందు నడువగా ఆయన భౌతికకాయానికి అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని జాదవ్ నివాసం నుంచి మొదలైన అంతిమయాత్రలో తెలంగాణ నాయకులు, విద్యార్థులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. జాదవ్ మరణవార్త తెలియగానే వేలసంఖ్యలో తెలంగాణ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ యోధుడు జాదవ్ మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో ఆయన సేవలను స్మరించుకొన్నారు. జాదవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రముఖుల ఘన నివాళులు

కేశవరావ్ జాదవ్ మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు డీడీకాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిశ్రీప్రసాద్, ఓయూ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ శిరందాసు రామచంద్రం, సీఎంవో కార్యాలయం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీలు ఇంద్రసేనారెడ్డి, దిలీప్‌కుమార్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, విరసం నేత వరవరరావు, గద్దర్, విమలక్క, అందెశ్రీ, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, బూర్గుల నర్సింగ్‌రావు, జూలూరి గౌరీశంకర్, వేదకుమార్, పల్లె రవికుమార్, పాశం యాదగిరి తదితరులతో పాటు పలువురు ఉద్యమకారులు, నాయకులు జాదవ్ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.

పోరాటాలన్నింటా తనవంతు పాత్ర

తనను తాను ఎల్లప్పుడూ మిస్టర్ తెలంగాణగా చెప్పుకొన్న కేశవరావ్ జాదవ్.. 1933 జనవరి 27న హైదరాబాద్ నగరంలోని హుస్సేనీఆలంలో శంకర్‌రావు, అమృత దంపతులకు జన్మించారు. తెలంగాణ సాయుధపోరాటం నుంచి మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు ఈ పోరుగడ్డ జరిపిన అస్తిత్వ పోరాటాలన్నిటా ఆయన తన వంతుపాత్రను పోషించారు. హక్కుల పోరాటాలకు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన కొన్నేండ్లపాటు చిరునామాగా నిలిచారు. ఎమర్జెన్సీ కాలంలో 18 నెలలపాటు జైల్లో ఉన్నారు. 1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోను, మలిదశ ఉద్యమంలోను క్రీయాశీలంగా పాల్గొన్నారు. జీవితమంతా సోషలిస్ట్‌గానే జీవించారు. భారతదేశంలో సోషలిస్ట్ ఉద్యమాన్ని నిర్మించడానికి కృషి చేశారు. హక్కుల కోసం ఉద్యమించిన నేతగా ఆయనకు గొప్ప పేరుంది. పీయూసీఎల్‌కు ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షునిగా వ్యవహరించారు. గతంలో నక్సల్స్‌కు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలలో కీలక భూమిక పోషించారు. ఇంగ్లిష్, హిందీ భాషలలో ఆయన వాగ్ధాటి అమోఘం. తన అభిప్రాయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పి ఎదుటివారిని ప్రభావితం చేసి, మెప్పించేశక్తి ఆయన సొంతం. రామ్‌మనోహర్ లోహియా విచార్‌మంచ్ వ్యవస్థాపక సభ్యుడు. లోహియా ఆలోచనాధారను దేశమంతటా ప్రచారం చేశారు.
George-Fernandes2
ఆయన మ్యాన్‌కైండ్ పేరుతో నడిపిన పత్రికకు దేశవ్యాప్తంగా లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో ఈ పత్రికను నిర్వహించారు. ఎండపల్లి నారాయణతో కలిసి యువపోరాటం పత్రికను నిర్వహించారు. స్త్రీపురుష సమానత్వంకోసం, అసమానతల నిర్మూలనకు, ప్రజాస్వామిక హక్కులు తదితర ఉద్యమాలలో తనతరంతో కలిసి నడిచారు. యూనియన్ పబ్లిక్‌సర్వీస్ కమిషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. దేశంలోని వివిధ రాష్ర్టాలలో వివిధ హోదాలలో ఉద్యోగబాధ్యతలను నిర్వహించారు. 1952లో ముల్కీ ఉద్యమంలో, 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోలీసు కాల్పులలో మరణించడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆ సంఘటనలను గుర్తుచేసుకుని ఆయన కన్నీటిపర్యంతమయ్యేవారు. భాషా సమస్య (సురమౌళితోకలిసి), మార్క్స్-గాంధీ- సోషలిజం (ఇంగ్లిష్), లోహియా ఇన్ పార్లమెంట్ పుస్తకాలను ఆయన వెలువరించారు. జార్జి ఫెర్నాండెజ్, మధుదండవతే, కాళోజీ, సురేంద్రమోహన్ వంటి అగ్రగణ్యులతో కలిసి నడిచారు. జయప్రకాశ్ వంటి మహామహులతో కలిసి జనతాపార్టీ రూపకల్పనలో భాగస్వాములయ్యారు. తెలంగాణ జన పరిషత్‌కు కన్వీనర్‌గానూ పనిచేశారు.

1955లో ఫజల్‌అలీ సారథ్యంలో రూపొందించిన స్టేట్ రీ ఆర్గనైజైషన్ కమిటీకి తెలంగాణ రాష్ట్రం కొనసాగింపుపై మిత్రులతో కలిసి విజ్ఞప్తిని అందజేశారు. అప్పటికే తెలంగాణేతరులు 40 వేల మంది తెలంగాణలో ఉద్యోగాలలో చేరిపోయారని, న్యాయంగా ఈ ఉద్యోగాలన్నీ తెలంగాణకే చెందుతాయని ఆయన వాదించారు. 1953 నుంచి తుదిశ్వాస వరకు తెలంగాణ ఉద్యమంతో సహా అనేక అంశాలపై వేలసంఖ్యలో పత్రికావ్యాసాలను రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అంగీకారం లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారని ఆయన ఆరుదశాబ్దాలుగా తన శక్తినంతా ధారపోసి ప్రజలకు వివరించారు. 1968 డిసెంబర్‌లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యోగాల నియామకాలలో తెలంగాణ విద్యావంతులకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీకి నాయకత్వం వహించారు.

తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటులో ఉన్నారు. చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో చాలా బాధపడ్డారు. ఆయినప్పటికీ తన తెలంగాణ జెండా, ఎజెండాల నుంచి మడమ తిప్పలేదు. 1989లో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజైషన్‌కు సారథ్యం వహించారు. కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్‌కు సలహాదారుగా ఉన్నారు. 1997లో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటులో ముందున్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో ఉద్యమనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండదండలు అందించారు. భోపాల్ విషాదం, గుజరాత్ ైబ్లెండింగ్స్, కారంచేడు సంఘటన, నక్సలైట్ల సమస్య, పాతబస్తీ అల్లర్ల సమస్యలపై పోరాటం చేశారు. పక్కా రిజర్వేషన్ల పక్షపాతి. ప్రాంతీయ భాషలంటే ఇష్టం. నలభై సంవత్సరాలు ఒలింపస్ అనే ఇంగ్లిషు మ్యాగజైన్‌ను కూడా నడిపారు. తనకు పేరు రావాలని ఏనాడూ అనుకోని నిగర్వి, నిరాడంబరుడు ప్రొఫెసర్ కేశవ్‌రావ్ జాదవ్.

గొప్ప సోషలిస్ట్ నాయకుడిని కోల్పోయాం: నాయిని నర్సింహారెడ్డి

George-Fernandes1
డాక్టర్ లోహియా సిద్ధాంతాలను నమ్మి ఉద్యమాలు చేసిన గొప్ప సోషలిస్ట్ నాయకుడు కేశవరావ్ జాదవ్‌ను కోల్పోయామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సోషలిస్ట్ పార్టీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని లోహియా విచార్ మంచ్‌ను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి అని, ఎమర్జెన్సీలో 18 నెలలు జైల్లో ఉన్నారని, ఆయన వెంబడే తాము కూడా ఉన్నామని గుర్తుచేశారు. గట్టి నాయకుడని, చాలా విషయాల్లో ఎవరిని లెక్కచేయకుండా సిద్ధాంతాలనే నమ్మేవాడన్నారు. అకేలే చలో అనే నినాదంతో ముందుకు వెళ్లేవాడని చెప్పారు. ఆయన మరణం బాధాకరమని, ఆయన లోటును తీర్చలేమని తెలిపారు. కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కేశవరావ్ ఎన్నో ప్రజా ఉద్యమాలకు ముందువరుసలో నిలిచారని శాసనమండలి చైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్ కొనియాడారు. జాదవ్ భౌతికకాయాన్ని దర్శించి నివాళులు అర్పించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన శ్రేణులకు నిరంతరం సలహాలను అందించి కేశవరావ్‌జాదవ్ ప్రోత్సహించారని, ఆయన మరణం తెలంగాణకు తీరనిలోటని బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ జీ దేవీప్రసాద్ నివాళులర్పించారు.

తెలంగాణకోసం జాదవ్ చేసిన సేవలను టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ గుర్తుచేసుకున్నారు. తమతోపాటు ఓయూలో ప్రొఫెసర్‌గా పనిచేసిన జాదవ్ హక్కుల ఉద్యమంలో ఎప్పుడూ ముందుండేవారని, ప్రజా సమస్యలపై పోరాడేవారని తోటి ప్రొఫెసర్లు ముత్యంరెడ్డి, తిప్పారెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి అని, తెలంగాణ రాష్ర్టాన్ని చూడాలనే కలను నెరవేర్చుకున్న వ్యక్తి అని పేర్కొన్నారు. కేశవరావ్ జాదవ్ సామాజిక సమస్యలపై పోరాటం జరిపారని ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది విద్యార్థులను తెలంగాణ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల్లో ప్రభావితం చేశారని తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ గుర్తుచేశారు.

2756
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles