వివాదాలకు వీఆర్వోనే మూలం!

Sat,November 9, 2019 02:02 AM

-తాసిల్దార్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం
-పదేండ్లు పనిచేసిన వీఆర్వో పాత్రపై ఆరా
-కారులోని వ్యక్తులను గుర్తించిన పోలీసులు?
-ఆత్మహత్యాయత్నంతో భయపెట్టాలనుకున్నాడు: సురేశ్ భార్య లత

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తాసిల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు, సీసీ టీవీ పుటేజీలు, నిందితుడు, తాసిల్దార్ కుటుంబసభ్యులు చెప్పిన వివరాలతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. ఇక్కడ పదేండ్లపాటు పనిచేసిన వీఆర్వో పాత్రపై ఆరా తీస్తున్నారు. ఘటన జరిగాక కాలుతున్న గాయాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళుతున్న క్రమంలో నిందితుడు మాట్లాడినట్టుగా భావిస్తున్న వైన్‌షాప్ వద్ద నిలిపిఉన్న కారులోని వ్యక్తులను గుర్తించినట్టు తెలిసింది. వీఆర్వోతోపాటు, కారులో ఉన్నవ్యక్తులను విచారించడం ద్వారా పోలీసులకు మరింత సమాచారం లభించే అవకాశాలున్నాయి. మరోపక్క మేజిస్ట్రేట్ అనుమతితో సురేశ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా పరిశీలించనున్నారు. తాసిల్దార్ భర్త సుభాశ్‌రెడ్డి, నిందితుడు సురేశ్ కుటుంబసభ్యులు శుక్రవారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.

అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో దశాబ్దకాలానికిపైగా పనిచేసిన వీఆర్వో బాచారం పరిధిలోని భూముల వివాదాల్లో కేంద్రబిందువుగా వ్యవహరించాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భూ వివాదాలను సృష్టించడం, వాటిని పరిష్కరించేందుకు రైతుల నుంచి డబ్బులు తీసుకోవడంలో అతడు కీలకంగా వ్యవహరించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడునెలల క్రితమే బదిలీ అయిన ఈ వీఆర్వోకు ఇక్కడి భూవివాదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలిసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తాసిల్దార్ హత్య ఘటన, దానిని ప్రోత్సహించిన వారెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తాజాగా నిందితుడి భార్య కొన్ని సంచలనాత్మకమైన విషయాలను బయటపెట్టింది. దీంతో ఈ వీఆర్వో పాత్ర ఇప్పుడు చర్చనీయాంశమయింది.

లంచాలు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు

VIJAYA-husb
ఓ వ్యక్తి అనాలోచిత చర్య వల్ల.. చేయని పొరపాటుకు మా కుటుంబ బలయింది. కోర్టు ఆదేశాల మేరకు స్టేటస్‌కో ఉన్న స్థలం పై తాసిల్దార్ పట్టా ఇవ్వలేదు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో వందలమందికి ఎమ్మార్వో హోదాలో నా భార్య పాస్‌బుక్‌లు అందించింది, ఎక్కడా అవకతవకలకు పాల్పడలేదు. మాది ఉన్నత కుటుంబం, ఆర్థికంగా బలంగా ఉన్నాం, లంచాలు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. 91 నుంచి 102 వరకు ఉన్న సర్వేనంబర్లలోని భూముల్లో వివాదాలున్నాయనే విషయం నాతో విజయ చెప్పింది. నెలక్రితం టెనెంట్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది, కానీ తాను బదిలీ అవుతున్న సమయంలో దానిలో జోక్యం చేసుకోనని తెలిపింది. ఆమెపై రాజకీయ ఒత్తిళ్లు లేవు. పరిణతిలేని వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకొంటే బాగుంటుంది, విజయారెడ్డి హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి.
- విజయారెడ్డి భర్త సుభాశ్‌రెడ్డి

లక్షలు ఇచ్చాడు.. అవి ఎవరికిచ్చాడో: సురేశ్ భార్య లత

suresh-wife-lata
ఎమ్మార్వోపై దాడిచేయాలని వెళ్లలేదని నా భర్త నాతో చెప్పాడు. ఆత్మహత్యాయత్నం చేసి భయపెట్టాలనుకున్నానని.. వినకపోవడంతోనే ఆమెను చంపాలనుకున్నానని దవాఖానలో చెప్పాడు. నా భర్త లాంటి చావు మరే రైతుకు కూడా రావొద్దు. ఇప్పటికే అప్పుచేసి లక్షల రూపాయలు కట్టాడు. అవి ఎవరికిచ్చాడో తెలియదు. కానీ ఈ భూముల వ్యవహారంలోనే ఎవరికో ఇచ్చినట్టు మాత్రం తెలుస్తున్నది.

సమస్య అధికారులు సృష్టించిందే: సురేశ్ తండ్రి

మా భూముల సమస్య అధికారులు సృష్టించిందే. గతంలో మా తండ్రి కూర వెంకయ్య పేరుపై పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్నాయి. అవి 2016లో ఎలా రద్దయ్యాయి? ఈ భూమిని 1950 నుంచి సాగుచేసుకుంటున్నాం.. అప్పటినుంచి లేనిసమస్య ఇప్పడే ఎందుకు వచ్చిం ది? మా భూముల లెక్క తేల్చండి అని అధికారులను కోరుతున్న.

62560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles