ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత


Thu,April 26, 2018 02:31 AM

TDP leader Anam Vivekananda Reddy passes away

-నేడు నెల్లూరులో అంత్యక్రియలు
-పలువురి సంతాపం
anam-vivekananda-reddy
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి (67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వివేకానందరెడ్డి అంత్యక్రియలు గురువారం నెల్లూరులో నిర్వహించనున్నట్లు ఆనం కుటుంబసభ్యులు తెలిపారు. వివేకానందరెడ్డి మృతితో సింహపురి ప్రజలు విషాదంలో మునిగిపోయారు. 1950 డిసెంబర్ 25న నెల్లూరులో జన్మించిన వివేకానందరెడ్డి స్థానిక వీఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. 1999 నుంచి వరుసగా మూడుసార్లు నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు మున్సిపల్ చైర్మన్‌గా రాజకీయజీవితాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఈయన 2015 డిసెంబర్‌లో సోదరుడు రామనారాయణరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మూడుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొంది రికార్డు తన పేరిట రాసుకున్న వివేకానందరెడ్డి రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తర్వాత జిల్లా రాజకీయాలపై పట్టు సాధించారు. వైఎస్సార్ మంత్రిపదవి ఇవ్వజూపినా తిరస్కరించి తన తమ్ముడు రామనారాయణరెడ్డికి ఇప్పించారు. హెయిర్ ైస్టెల్‌తో పాటు మొబైల్ ఫోన్ల వినియోగంలోనూ వివేకా తనదైన ముద్రవేశారు.

పలువురు నేతల దిగ్భ్రాంతి

ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. పలువురు ఏపీ మంత్రులు సంతాపం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వివేకానందరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

2680

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles