గుజరాతీ గల్లీలో హవాలా దందా!


Fri,February 23, 2018 01:52 AM

Task Force Police Busted Fake Credit Card Gang in Hyderabad

-ఢిల్లీలో చెల్లించేందుకు ఇక్కడి ఏజెంట్‌కు నగదు
-నిర్మాణ సంస్థకు చెందిన రూ.27.9 లక్షలు స్వాధీనం
-సంస్థ సీనియర్ మేనేజర్, ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్
- పరారీలో ప్రధాన సూత్రధారి

hawala
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కోఠీలోని గుజరాతీ గల్లీ అడ్డాగా సాగుతున్న హవాలా దందాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. గురువారం ఓ నిర్మాణ సంస్థకు చెందిన భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రావు వివరాలు వెల్లడించారు. హవాలా ద్వారా డబ్బు మార్పిడి చేస్తున్నారని హైదరాబాద్ మధ్యమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం ప్రకా రం కోఠి గుజరాతీ గల్లీలోని కృష్ణా మొబైల్ దుకాణం లో సోదాలు జరిపారు. రూ.27.90 లక్షల నగదు ఉన్న ట్టు గుర్తించి సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న డీ మధుసుదన్ ప్రసాద్, కిషోర్‌కుమార్, సోహన్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా హవాలా దందా బయటికి వచ్చింది. మాదాపూర్ కావూరి హిల్స్‌లోని కేఎన్‌ఆర్ నిర్మాణ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న మధుసుదన్ ప్రసాద్ నగదును హవాలా రూపంలో ఢిల్లీకి పంపేందుకు ఏజెంట్స్ సోహన్‌లాల్, కిషోర్‌కుమార్‌ను సంప్రదించినట్టు గుర్తించారు. లక్షకు 0.6 నుంచి 0.8 శాతం కమీషన్ మీద దందా చేస్తున్నట్టు నిందితులు తెలిపారు.

ఈ మేరకు నగదును తదుపరి విచారణ కోసం ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్టు సీపీ వివరించారు. కేఎన్‌ఆర్ నిర్మాణ సంస్థ నిర్వాహకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ హవాలా దందా ప్రధాన సూత్రధారిని బల్వంత్ సింగ్‌గా గుర్తించినట్టు చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన బల్వంత్ సింగ్ హైదరాబాద్‌కు వలస వచ్చి అశోక్‌బజార్‌లో ఉంటున్నాడు. గాజుల దుకాణం పెట్టి నష్టపోయాడు. తర్వాత ఢిల్లీకి చెందిన విక్రమ్, ముంబై కి చెందిన శంకర్, కమల్‌తో పరిచయం ఏర్పడగా వారి నుంచి హవాలా దందా గురించి తెలుసుకున్నాడు. స్వయంగా కోఠి, గుజరాతీ గల్లీ, అశోక్ బజార్, గౌలిగూడ ప్రాంతాల్లో ఏజెంట్లను పెట్టుకొని హవాలా దందాను ప్రారంభించాడు. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్న ఇతర ఏజెంట్లతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని దందాను విస్తరించాడు. దేశంలోని ఎక్కడికైనా ఐదు నిమిషాల్లో డబ్బు పంపగలడని, వాట్సప్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles