తాసిల్దార్‌ ఇష్టారాజ్యం!


Thu,April 18, 2019 10:34 AM

Tasildar who has taken RDOs powers into his hand

-22 కుటుంబాలకు చెందిన53 ఎకరాల భూమి పరాధీనం
-ఇనాం చట్టానికి పాతర.. సీలింగ్‌ చట్టం బేఖాతర్‌
-వీఆర్వో, ఆర్‌ఐల పంచనామా నివేదికలు మూలకు
-గ్రామసభల తీర్మానాన్నీ లెక్కచేయని వైనం
-అడ్డగోలుగా సర్వేనంబర్లలో మార్పులు
-ఆర్డీవో అధికారాలను తన చేతిలోకి తీసుకున్న తాసిల్దార్‌
-సర్వస్వం కోల్పోయి విలవిలలాడుతున్న 22 కుటుంబాలు
-లంచాలివ్వడం కోసం అడ్డాకూలీలుగా మారిన విషాదం
-మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఉదంతం
-ఇది ఐదు తరాల బతికిచెడ్డ కుటుంబాల వ్యథ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముగ్గురు రైతులు ఓ దేశ్‌ముఖ్‌ దగ్గర 53 ఎకరాల భూమిని కొన్నారు.. ఆయన అప్పుడు స్టాంప్‌ పేపర్‌ మీద సాదా బైనామా రాసిచ్చాడు.. అప్పటినుంచి ఆ రైతులు ఆ భూమిని సాగుచేసుకుంటూ ఏటా శిస్తులు చెల్లించేవారు. ఇది 1950ల నాటి కథ.. దశాబ్దాలు గడిచిపోయాయి. తరాలు మారిపోతున్నాయి. ఆ మూడు కుటుంబాలు 22 కుటుంబాలయ్యాయి. ఇంతకాలానికి తమ భూమిని మరో వ్యక్తికి పట్టా చేశారని తెలుసుకున్న రైతు కుటుంబాలు బిత్తరపోయాయి. ఇదేం అన్యాయమంటూ కిందటేడాది అధికారుల దగ్గరకు వెళ్ళి తమకు న్యాయం చేయాలని కోరాయి. కానీ రకరకాల విద్యల్లో ఆరితేరిన అధికార యంత్రాంగం ముందు వారి అమాయకత్వం పనిచేయడం లేదు. ఒక్కోసారి ఒక్కో రకంగా అన్యాయానికి అండగా నిలుచుంటున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో ఓ తాసిల్దార్‌ ఏకపక్షంగా చెలరేగిపోయారు. ఇనాం చట్టానికి పాతరేశారు.. సీలింగ్‌ చట్టాన్ని బేఖాతర్‌ చేశారు. వీఆర్వో, ఆర్‌ఐల పంచనామా నివేదికలను మూలకు నెట్టేశారు. గ్రామసభల తీర్మానాన్నీ లెక్కచేయలేదు. ఆర్డీవో అధికారాలను తన చేతుల్లోకి తీసేసుకున్నారు. ఆ అధికారి వ్యవహారానికి 22 కుటుంబాలు సమిధలవుతున్నాయి. సర్వస్వం కోల్పోయి విలవిలలాడుతున్నాయి. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామ ఉదంతమిది. లంచాలివ్వడం కోసం అడ్డాకూలీలుగా మారిన విషాదమిది. ఇది ఐదు తరాల బతికిచెడ్డ కుటుంబాల వ్యథ. మూడుతరాల కాలంలో పూర్తికాని పనికోసం ప్రస్తుతం నాలుగో తరం, ఐదో తరం అష్టకష్టాలు పడుతున్నాయి.

ఈ భూమిపై పూ ర్తిస్థాయి హక్కుల కోసం పోరాటాన్ని కూడా వారసత్వంగా చేపట్టాయి. ఆరు దశాబ్దాల కిం దట దేశ్‌ముఖ్‌ దగ్గర కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో తాజాగా రియల్‌ మాఫియా ప్రవేశించి కాజేసే ప్రయత్నం చేస్తున్నది. అన్ని సాక్ష్యాధారాలను కాలదన్ని 22 కుటుంబాలకు చెందిన 53 ఎకరాల భూమినికి ఎలాంటి సీలింగ్‌పరిధి కూడా చూడకుండా రాత్రికి రా త్రే దేశ్‌ముఖ్‌ల వారసుడి పేరిట పట్టా చేశారు. పూర్తి వివరాలలోకి వెళితే..మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలంలోని దేవులపల్లికి చెందిన మాసుల రామయ్య, మాసుల రంగయ్య, మాసుల వెంకయ్య 1956, 1957లో దేశ్‌ముఖ్‌ ఆర్‌ కిషన్‌రావు వద్ద సర్వేనంబర్‌ 117/2లోని 53 ఎకరాలు కొనుగోలు చేశారు. స్టాంప్‌పేపర్‌పై కిషన్‌రావు సాదాబైనామా రాసిచ్చారు. అప్పటినుంచి ఏటా భూమి శిస్తు చెల్లించారు. 1967-1968 రసీదులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ మూడు కుటుంబాలు నేడు 22 కుటుంబాలయ్యాయి. వీరంతా ఈ భూమిలోనే నివసిస్తున్నారు.

ఇనాం రద్దు చట్టం-1955 ప్రకారం ఈ రైతుల భూములను సెటిల్‌చేయాలి. కానీ నాటినుంచి నేటివరకు వీరి గోడును ఏ రెవెన్యూ అధికారీ పట్టించుకోలేదు. వాస్తవంగా చట్టం ప్రకారం ఇనాందారుడి భూమి ఎవరి కబ్జాలో ఉందనేది 1954-55 ఖాస్రా పహానీ, 1973-1974 పహానీ ప్రకారం పరిశీలించాలి. ఈ ఆధారాలతోపాటు క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తు చేసిన సంవత్సరంలో ఆ భూమి ఎవరి కబ్జాలో ఉందనేది పరిశీలించి ఆ మేరకు పట్టా ఇవ్వాలి. కానీ ఏ కారణంవల్లనో ఆ పనిచేయలేదు. ఇనాం భూములను కొనుగోలు చేసినవారినే ఇనాందారులుగా గుర్తించి, ఓఆర్సీ (ఆక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికెట్‌) ఇచ్చి పట్టా ఇవ్వాలి. అలా చేయలేదు. సాదాబైనామా వచ్చాక తమ భూమిని క్రమబద్ధీకరణ చేయాలని రైతులు దరఖాస్తు చేసుకున్నారు. దానిపై అధికార యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇనాం భూములపై నిర్ణయాధికారం ఆర్డీవోకు ఉండగా, తాసిల్దార్‌ ఏకపక్షంగా వ్యవహరించారు. కబ్జాలో 62 ఏండ్లుగా ఉన్నవారి అభ్యంతరాలను తోసిపుచ్చి కిషన్‌రావు వారసులు రాధామనోహర్‌రావు పేరుతో ప్రొసీడింగ్‌ ఇచ్చి 1 బీ, పట్టాదార్‌ పాస్‌పుస్తకం జారీచేశారు. ఆయన భూమిని విక్రయించడానికి ఎన్వోసీ దరఖాస్తు చేసుకున్నారు.
Own-land

మాటిమాటికీ సర్వే నంబర్లు మార్చిన వైనం

కిషన్‌రావు వద్ద కొనుగోలుచేసిన ఇనాం భూమిని తమ పేరుపై పట్టా చేయించుకోవడానికి రైతులు చేయని ప్రయత్నం లేదు. వీరి దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 12-01-1970లో ఫైల్‌ నంబర్‌ ఎ8/5740/69 పేరుతో ఫామ్‌-2 నోటీసులిచ్చారు. కానీ తరువాత ఓఆర్సీ ఇచ్చారా..లేదా? అన్నదానిపై స్పష్టతలేదు. ఈ 53 ఎకరాల భూమి సర్వే నంబర్‌ 117/2 అయితే ఆ తరువాత దీనిని మార్చి 117/14 అని రాశారు. ఎందుకు రాశారో తెలియదు. ఎందుకు రాశారని అడిగితే పట్వారి సమాధానం చెప్పడు. తాసిల్దార్‌ విసుక్కుంటాడు. దీన్ని మార్చి మరోసారి 117/ఠ అని చేశారు. ఇప్పుడు 117/2 అని మార్చి ఆర్‌ కిషన్‌రావు కొడుకు ఆర్‌ సీతారామారావు అని 1993లో పేరు ఎక్కిందని, 2017లో ఆర్‌ రాధామనోహర్‌రావు పేరుతో ఫౌతికి దరఖాస్తు వచ్చిందనేది అధికార కథనం. కానీ గ్రామంలో ఫాం 8 నోటీసులో ఆయన పేరులేదు. రైతుల పేర్లే ఉన్నాయి. దీంతో కావాలనే రాత్రికి రాత్రే రికార్డులన్నీ మార్చారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామసభల తీర్మానం, వీఆర్వో,ఆర్‌ఐ నివేదికలు బుట్టదాఖలు

భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో మాసుల కుటుంబీకులు 53 ఎకరాల భూమిని 60 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారని, కిషన్‌రావు వద్ద కొనుగోలు వాస్తవమేనని స్థానికులు చెప్పారు. పట్టాలు ఇవ్వాలని గ్రామ రైతులంతా తీర్మానం చేశారు. గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), రెవెన్యూ అధికారి (ఆర్‌ఐ) కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 117/2 సర్వే నంబర్‌ భూమిపై దేవులపల్లి గ్రామానికి చెందిన మాసుల కుటుంబాలు, లంబాడి కుటుంబాలవారు కాస్తు చేస్తున్నారని, ఈ పట్టాదారులను గుర్తించి కాస్తు కాలంలో నమోదు చేయాలని సిఫారసు చేశారు. ఇది ఇనాం పట్టా భూమి అని ప్రత్యేక నోట్‌పాయింట్‌లో తెలిపారు. వీటిని తాసిల్దార్‌ బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆర్‌ రాధామనోహర్‌రావు పేరుతో పట్టా, పట్టాదార్‌ పాస్‌పుస్తకం ఇచ్చారు. తమ భూమిని రాధామనోహర్‌రావు అనే వ్యక్తికి పట్టా చేశారని తెలుసుకున్న రైతు కుటుంబాల సభ్యులు.. తాము ఈ భూ మిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశామని, తమకు ఓఆర్సీ ఇచ్చి రైత్వారి పట్టా అమలుచేయాలని 2018 ఫిబ్రవరి 2వ తేదీన దరఖాస్తు చేశారు.

మీ వద్ద ఉన్న కాగితాలు తీసుకురమ్మని 2018 ఫిబ్రవరి 8వ తేదీన అధికారుల నుంచి నోటీస్‌ రావడంతో వారు ఆధారాలను ఐదు సెట్ల కలర్‌ జిరాక్స్‌లు అందించారు. ఈ కాగితాలు తీసుకున్న తాసిల్దార్‌.. రెవెన్యూ కోర్టుకు వెళ్లాలని, లాయర్‌ను తెచ్చుకోవాలని చెప్పారు. వీరు న్యాయవాదిని తీసుకువెళితే అవసరం లేదని.. తాము ఈ భూమిని పార్ట్‌ బీలో పెడుతున్నామనిచెప్పి, రాధామనోహర్‌రావు పేరుతో వచ్చిన అడ్వకేట్‌ పిటిషన్‌ను 2018 మార్చి 19వ తేదీన అంగీకరించారు. అక్రమమార్గాన రాధామనోహర్‌రావుకు పాస్‌ పుస్తకం ఇచ్చారు. తాజాగా ఈ భూమిని తన పేరున ఎక్కించుకున్న రాధామనోహర్‌రావు అమ్ముకోవడానికి ఎన్వోసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు స్పందించిన రెవెన్యూ యంత్రాంగం ఎన్వోసీ ఇవ్వడానికి లెటర్‌ నంబర్‌ బీ/1121/2019 సిద్ధంచేయగా.. రైతులంతా అన్యాయం జరిగిందని వివరించడంతో రాధామనోహర్‌రావుకు ఇచ్చిన పట్టా ను తాత్కాలికంగా 2019 ఏప్రిల్‌ 15వ తేదీన అన్‌సైడ్‌ చేశారు (పెండింగ్‌లో పెట్టారు). కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్నందున అని తాసిల్దార్‌ రాశారు.

ఈ పెండింగ్‌ ఉత్తర్వులపై ఉన్న పలు తేదీలు కొట్టివేతలతో ఉండటం సందేహాలకు తావిస్తున్నది. ఒకే వ్యక్తికి 53 ఎకరాల పట్టా చేయాలంటే ముందుగా సీలింగ్‌ డిక్లరేషన్‌ అయితేనే పట్టాచేయాలి. ఒక వ్యక్తికి మెట్ట భూమి 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండటానికి వీలులేదు. అలా ఉంటే సీలింగ్‌లోకి వెళుతుంది. దీంతో సదరు వ్యక్తికి 53 ఎకరాల భూమిని పట్టా చేయాలంటే ముందుగా అతనికి ఉన్న ఇతర భూములు ఎన్ని ఎకరాలు అని పరిశీలించి, డిక్లరేషన్‌ అయిన తరువాత పట్టా చేయాలి. కానీ ఇక్కడ ఈ నిబంధనలను ఏ కోశానా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. రెవెన్యూ అధికారుల పనిని గ్రామస్థులు జీర్ణించుకోవడం లేదు. రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విచారణ చేసినిర్ణయం తీసుకుంటాం

రాధామనోహర్‌రావు ఫిజికల్‌ పొజిషన్‌లో లేడని వచ్చిన సమాచారం మేరకు ఆయనకు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను అన్‌సైడ్‌లో పెట్టాము. ఫీల్డ్‌లో విచారణ చేసి రికార్డులు ఎవ్వరిపేరున ఉన్నాయో పరిశీలించి ఓఆర్సీ ఇస్తాము.1974, 1975 లలో పొజిషన్‌లో ఎవరున్నారో పరిశీలించి వారి వారసుల పేర్లు చేరుస్తాము.
- మాలతి మాధురి,తాసిల్దార్‌, కౌడిపల్లి

కచ్చితంగా వ్యవహరిస్తాం

మొత్తం రికార్డులు కాల్‌ఫర్‌ చేశా ను. ఫీల్డ్‌ రిపోర్ట్‌ అడిగాను. రిపోర్టులో ఏమైనా తేడాలు వస్తే నేనే స్వయంగా ఫీల్డ్‌కు వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకుంటాను.
- అరుణారెడ్డి, ఆర్డీవో, నర్సాపూర్‌

117/2 సర్వేనంబర్‌లోని 53 ఎకరాల భూమి అంతా మాసు ల కుటుంబమే కాస్తు చేస్తున్నది. కిషన్‌రావు ఎవరో కూడా తెలియ దు. గ్రామంలో తీర్మా నం కూడా జరిగింది. ఈ విషయాన్ని జాయింట్‌ కలెక్టర్‌కు కూడా చెప్పినం.
- ఎం ప్రమీల, దేవులపల్లి గ్రామ సర్పంచ్‌

అంతా అన్యాయమే..

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాసులవాళ్లే ఈ భూమిని దున్నుకొని జీవిస్తున్నారు. ఈ మేరకు గ్రామసభలో తీర్మానం చేసినం. గ్రామరైతులంతా సంతకాలు పెట్టారు. తాసిల్దార్‌ దగ్గరికి పోతే చూద్దామని పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు భూమిని పట్టా చేయించుకున్నవాళ్లు ఎవరో ఎవరికీ తెలియదు. వాళ్లు మా ఊరివాళ్లే కాదు. ఈ భూమిని మాసులవాళ్ల పేరున పట్టా చేయండని నేను గ్రామ ఉప సర్పంచ్‌గా అడిగితే రూ.30 వేలు అడిగారు. ఈ విషయం చెప్పాను. వీళ్లు రూ.30వేలు ఇస్తే ఎకరానికి రూ.30 వేలు అడిగాను.. మీరు కేవలం రూ.30వేలే తెచ్చారేమిటని ప్రశ్నించాడు. చివరకు రూ.3లక్షలు ఇవ్వడానికి రైతులు అంగీకరించారు. ఇందుకు రైతులు భార్యల పుస్తెల తాళ్లు తాకట్టు పెట్టారు. కానీ పనిచేయలేదు. అవతలి వైపునుంచి భారీగా ముట్టాయి.

మేమంతా ఈ రైతులను తీసుకొని తాసిల్దార్‌ దగ్గరికి పోయినం. రెవెన్యూ సదస్సులో తీర్మానం చేసినం. అందరికీ న్యాయంచేద్దామని చెప్పిన తాసిల్దార్‌ డిమాండ్‌ చేసిన మేరకు డబ్బులు ఇవ్వలేదని పెం డింగ్‌ పెట్టి, కొద్దిరోజులకు వేరేవాళ్లకు పాస్‌పుస్తకం ఇచ్చాడు. దొరల భూమికి వతన్‌దారులుగా ఉన్న మాసుల కుటుంబసభ్యులు ఎంత ఇబ్బంది అయినా నేటికీ ప్రతి పండుగకు, చావుకు అన్నింటికీ వీళ్లే ముందు నడువాలి. అలాంటి కుటుంబాలకు తాసిల్దార్‌ తీరని అన్యాయం చేశాడు.
- ఎం బాలరాజు, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు

మా మామల కాన్నుంచీ పట్వారికి ప్రతి యాడాది రికార్డులో పేరు ఎక్కించడంకోసం డబ్బులు అడిగితే ఇచ్చేవాళ్లు. డబ్బులు తీసుకోవడమేగానీ మాకు పూర్తి పట్టా ఇవ్వలేదు. కాస్తుల పేరు ఎక్కించామని చెప్పిపోయేవాళ్లు. మా మామలు, మా ఆయనవాళ్లే ఆ రోజుల్లో రూ.60.. 70 వేలు లంచాలు ఇచ్చి ఉంటారు. ఇవికాక పొట్టేళ్లు, కోళ్లకు లెక్కలేదు. ఇప్పుడు మేము ఎక్కువ లంచం ఇవ్వకుంటే వేరెవరికో రాసిచ్చిండ్రు. ఈ భూమి దక్కించుకోవడానికి పుస్తెలతాళ్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.
- మాసుల కలమ్మ, భూమి పట్టాకోసం ఎదురుచూస్తున్న రైతు

నేను మాసుల కుటుంబంలో మూడో తరం వారసుడిని. ఇప్పటికే ఈ భూమి కోసం రూ.లక్షలు ఖర్చు అయ్యాయి. ఇంకా లక్షలకు లక్షలు కావాలని అడిగితే ఇచ్చే స్థితి కాదు మాది. ఎమ్మార్వోకు, ఆర్డీవోకు, జాయింట్‌ కలెక్టర్లకు అప్లికేషన్లు ఇచ్చినా న్యాయం చేయలేదు. మా భూమి మా పేరున లేకపోవడంతో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన రైతుబంధు రాలేదు. మా పాలామె రైతు నర్సమ్మ చనిపోతే రైతుబీమా రాలేదు. భూమి పట్టా ఇస్తే మాకు మంచి జరిగేది.. పథకాలు అమలయ్యేవి. 2007లో ఉన్న వీఆర్వో ఆత్మహత్య చేసుకున్న తర్వాత రికార్డులు ఉల్టా పల్టా అయ్యాయి. సోమరాజు అనే వీఆర్వో గతంలో ఓఆర్సీ ఇనామ్‌ తఖ్తా తీసుకొని ఓఆర్సీ ఇవ్వలేదు.
- మాసుల రాములు, గ్రామ మాజీ ఉపసర్పంచ్‌ (భూమి పట్టాకోసం ఎదురుచూస్తున్న రైతు)

1976 నుంచి అధికారులంతా వచ్చి చేస్తామని లంచాలు తీసుకున్నారుకానీ ఏనాడూ పనిచేయలేదు. మాకు పట్టాలు ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఇప్పుడు మా భూమి మాకు కాకుండా పోయే పరిస్థితి వచ్చింది.
- మాసుల సామయ్య, భూమి పట్టాకోసం ఎదురుచూస్తున్న రైతు

6522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles