కాంగ్రెస్ గూండాగిరీTue,March 13, 2018 05:05 AM

-అసెంబ్లీలో బరితెగించిన జాతీయపార్టీ
-ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన నేతలు
-బస్సుయాత్ర విఫలమవ్వడంతో అసహనం
-గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ఆద్యంతం విఫలయత్నం
-మైకులు విరిచి, హెడ్‌ఫోన్లు ఊడబీకి గవర్నర్‌పైకి విసిరిన కాంగ్రెస్ సభ్యులు
-కోమటిరెడ్డి విసిరిన హెడ్‌ఫోన్ తగిలి మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం
-కార్నియా దెబ్బతిన్నదన్న వైద్యులు
-మార్షల్‌ను నెత్తురొచ్చేలా కొట్టిన పరిగి ఎమ్మెల్యే
-మరికొందరు మార్షల్స్‌కూ గాయాలు
-మద్యం తాగి సభకు వచ్చిన కోమటిరెడ్డి!
assembly
గవర్నర్ ప్రసంగపాఠం ప్రతులు చించి, వాటిని ఆయనపైకే విసిరేసింది కొందరు! మైకులు విరగ్గొట్టి, వాటికి ఉన్న హెడ్‌ఫోన్లను ఊడబెరికి.. వాటిని గవర్నర్‌పైకి కసిగా విసిరి అసహనం చాటుకున్నది మరికొందరు! వెల్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న మార్షల్స్‌ను రక్తం వచ్చేలా కొట్టింది మరొకరు! వెకిలి నవ్వులు.. పిచ్చి చేష్టలు.. వెరసి.. నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైంది! తెలంగాణ శాసనసభలో మునుపెన్నడూ లేని రీతిలో సాక్షాత్తూ మండలి చైర్మన్ కంటికి గాయమయ్యింది! తమ బస్సుయాత్ర విఫలమైందన్న నిస్పృహ.. ప్రభుత్వం అమలుచేస్తున్న విశేష పథకాలను గవర్నర్ వివరిస్తుంటే వినడానికి మనసురాని ఓర్వలేనితనం.. రానున్న ఎన్నికల్లోనూ తమకు అధికారం దక్కదనే నిరాశ!! ఫలితం.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు.. కాంగ్రెస్ సభ్యుల గూండాగిరీతో బ్లాక్‌డేగా మిగిలింది!

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ:రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజు కాంగ్రెస్ శాసనసభ్యులు వీధిరౌడీల్లా వ్యవహరించారు. ఉభయసభల సంయుక్త సమావేశం సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని పరిహసించారు. విచక్షణ మరిచి, గూండాగిరీకి దిగి వీరంగంవేశారు. రాజ్యాంగపరంగా రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న గవర్నర్‌పైకి దాడికి తెగబడ్డారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతోపాటు ప్రసంగపాఠం ప్రతులను చిత్తుచిత్తుగా చింపి గవర్నర్‌పైకి విసిరేశారు. దీనికి పరాకాష్టగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ సభ్యులు బెంచీలకు ఉన్న మైకులను విరగ్గొట్టారు. వాటికి ఉన్న హెడ్‌ఫోన్లను ఊడబీకి గవర్నర్ పైకి విసిరారు. కోమటిరెడ్డి నాలుగు హెడ్‌ఫోన్లను గవర్నర్ వైపు కసిగా విసిరారు. అందులో ఒకటి గురితప్పి గవర్నర్ పక్కనే కుడివైపున నిల్చున్న శాసనమండలి చైర్మన్ కే స్వామిగౌడ్ కంటికి తాకడంతో ఆయనకు తీవ్రగాయమైంది. గవర్నర్ ప్రసంగం పూర్తవుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత స్వామిగౌడ్‌ను సరోజినీదేవి నేత్రవైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స చేసి, కట్టుకట్టారు. ఆయన కార్నియాకు దెబ్బతగిలిందని వెల్లడించారు.

గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే

శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే కాంగ్రెస్ సభ్యులు కొందరు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేస్తూ పోడియం వద్ద గుమిగూడేందుకు ప్రయత్నించారు. తమ సభ్యులందరూ వెల్‌లోకి వెళ్లేలా ఆ పార్టీ ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెచ్చగొట్టారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ, రామ్మోహన్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, ఇతర సభ్యులు వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెకిలినవ్వులు నవ్వుతూ గవర్నర్ ప్రసంగాన్ని అపహాస్యం చేశారు. వెల్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న మార్షల్స్‌పైనా కొందరు కాంగ్రెస్ సభ్యులు దౌర్జన్యం చేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఓ మార్షల్ ముఖంపై దాడిచేశారు. మార్షల్ నోట్లోంచి రక్తంకారుతున్నా రామ్మోహన్‌రెడ్డి పట్టించుకోలేదు. కాంగ్రెస్ సభ్యుల దాడిలో మరికొందరు మార్షల్స్ స్వల్పంగా గాయపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మార్షల్స్‌పై దాడులకు తెగబడుతూనే అసహనంతో ఊగిపోయారు. మరోవైపు బడ్జెట్ ప్రసంగపాఠాన్ని చించి, గవర్నర్‌పై విసిరేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మైక్‌లను విరిచారు.

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్ది కళ్లద్దాలను సైతం ఆయన గవర్నర్ పైకి విసరడం కనిపించింది. నాలుగు హెడ్‌సెట్‌లను విరిచి గవర్నర్ వైపు విసిరారు. ప్రసంగం పూర్తవుతున్న క్రమంలో కోమటిరెడ్డి గవర్నర్‌వైపు విసిరిన హెడ్‌ఫోన్.. వేగంగా దూసుకుపోయి, ఆయన పక్కనే నిల్చున్న స్వామిగౌడ్ కంటిపైన తాకింది. నేరుగా తాకడంతో కార్నియా దెబ్బతిన్నది. అయినప్పటికీ నొప్పిని భరించిన స్వామిగౌడ్ జాతీయగీతాలాపన అనంతరం స్పీకర్ మధుసూదనాచారితో కలిసి గవర్నర్‌కు సభనుంచి ప్రోటోకాల్ ప్రకారం వీడ్కోలు పలికారు. ఆ తర్వాత అసెంబ్లీలోని డిస్పెన్సరీలో వైద్యులు మండలి స్వామిగౌడ్ కంటికి ప్రాథమిక చికిత్స చేసి, సరోజినీదేవి నేత్రవైద్యశాలకు తీసుకువెళ్లాలని సూచించారు. మెహిదీపట్నంలోని సరోజినీదేవి హాస్పిటల్‌లో సూపరింటెండెంట్ రవీందర్‌గౌడ్ పర్యవేక్షణలో వైద్యుల బృందం స్వామిగౌడ్‌కు చికిత్స చేసింది. హెడ్‌ఫోన్ తగలడంవల్ల సున్నితమైన కార్నియా కొంత దెబ్బతిన్నదని డాక్టర్ రవీందర్‌గౌడ్ తెలిపారు. స్వామిగౌడ్‌ను 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచుతున్నట్టు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నానికి దవాఖాననుంచి డిశ్చార్జిచేసే అవకాశముందని తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు సభలో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా భౌతికదాడులకు పాల్పడటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.

chairman-swamy-goud

దాడికి ప్రయత్నిస్తూ.. పడిపోయి.. లేవలేక!

శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెచ్చిపోయి గవర్నర్ లక్ష్యంగా వీరంగం వేశారు. మైకులు విరిచి, హెడ్‌ఫోన్లను ఊడబీకి వాటిని గవర్నర్‌పైకి విసిరారు. చేతికి అందుబాటులో ఉన్న వస్తువులను విసిరేక్రమంలో సభలో సభ్యుల కుర్చీల ముందుండే బెంచ్‌పైకి ఎక్కారు. హెడ్‌ఫోన్‌ను బలంగా విసిరిన ఆయన పట్టుతప్పి కిందపడిపోయారు. ఒక నిమిషంవరకు పైకి లేవలేకపోయారు. చివరకు ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేయి అందించి పైకిలేపారు. పట్టుతప్పి పడిపోయిన కోమటిరెడ్డి పైకి లేవలేకపోవడం సొంతపార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. ఆయన మద్యం తాగి సభకు వచ్చారన్న ఆరోపణలు కూడా వినిపించాయి.

టీఆర్‌ఎస్ సభ్యుల సంయమనం

సభలో కాంగ్రెస్ సభ్యులు అకారణంగా రెచ్చిపోయి ప్రవర్తించినా, దౌర్జన్యంగా వ్యవహరించినా టీఆర్‌ఎస్ సభ్యులు సహనంతో సంయమనం పాటించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులు రెచ్చిపోయేలా ప్రవర్తించే అవకాశముందని, సభ్యులంతా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారంనాటి టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ముందుగానే అప్రమత్తంచేశారు. సభానాయకుడి సూచనను అనుసరించి టీఆర్‌ఎస్ సభ్యులు సహనంతో ఉన్నారు.

హేయమైన చర్య

ఉద్యమసమయంలో ఘటనకు, ఇప్పటి ఘటనకు దేశభక్తికి, దేశద్రోహనికి ఉన్నంత తేడా ఉన్నది. స్వాతంత్య్రోద్యమంలో భగత్‌సింగ్ పార్లమెంట్‌పైచేసిన దాడికి, కొన్నేండ్లక్రితం ఉగ్రవాదులు పార్లమెంటుపైచేసిన దాడికి ఉన్న తేడానే అప్పుడూ ఇప్పుడూ ఉన్నది.
- శాసనసభ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీశ్‌రావు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలది చీప్ క్రాష్, కల్చర్‌లెస్ యాక్టివిటీ. కాంగ్రెస్ ప్రతినిధులు అనాగరికంగా వ్యవహరించటం ప్రజాస్వామ్యం అవుతుందా?
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్

కొందరు కాంగ్రెస్ సభ్యులు మద్యం తాగి వచ్చారు. ఒక సభ్యుడు మత్తుతో తూలి జానారెడ్డిపై పడగా ఆయన సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇలాంటివారిని మిగిలిన ఏడాదిపాటు సస్పెండ్ చేయాలి.
- శాసనమండలిలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

2615

More News

VIRAL NEWS