విత్తనరంగంలో తెలంగాణ టాప్


Sat,September 14, 2019 02:24 AM

Swaminathan praises the Telangana government

- రాష్ట్ర ప్రభుత్వానికి స్వామినాథన్ ప్రశంసలు
- జాతీయ విత్తన సదస్సు నిర్వహించాలని సూచన


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం విత్తనరంగంలో చేపడుతున్న విప్లవాత్మక విధానాలను ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రజ్ఞుడు, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ స్వామినాథన్ ప్రశంసించారు. రాష్ట్ర విత్తనసంస్థల ఎండీ, అంతర్జాతీయ విత్తనసంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ కేశవులు.. స్వామినాథన్ ఫౌండేషన్ ఆహ్వానంపై శుక్రవారం చెన్నై చేరుకుని స్వామినాథన్‌ను కలుసుకున్నారు. ఇస్టా ఉపాధ్యక్షుడిగా ఆసియాలోనే తొలిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేశవులుతో విత్తనరంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు, సమస్యల గురించి స్వామినాథన్ చర్చించారు. కేశవులు వంటి వ్యక్తి అంతర్జాతీయ సంస్థకు ఎన్నిక కావడం దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు గర్వకారణమన్నారు.

ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ

విత్తనరంగంలో భారతదేశంలో అన్నిరాష్ట్రాల కంటే తెలంగాణ ముందుండి, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటూ అనతికాలంలో ప్రపంచ విత్తన భాండాగారంగా అవతరించబోతున్నదని స్వామినాథన్ ప్రశంసించారు. అన్ని రాష్ట్రాలను సమన్వయపరుస్తూ ఒక జాతీయ సదస్సును తెలంగాణ నిర్వహించాలని సూచించారు. తాను ప్రయాణం చేయడానికి ఆరోగ్యం సహకరించనందున తమ ఫౌండేషన్‌లోనే సదస్సును నిర్వహిస్తే.. పూర్తిసహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. విత్తనరంగంలో లోటుపాట్లను సవరించి, సమగ్ర కార్యాచరణ, సరైన దిశానిర్దేశానికి ఈ సదస్సు అవసరం చాలా ఉన్నదని చెప్పారు.

విత్తనాన్ని నిర్లక్ష్యం చేస్తే.. వ్యవసాయరంగ అసంపూర్ణ పురోభివృద్ధి

వ్యవసాయ పరిశోధనల్లో కేంద్రం, వివిధ రాష్ట్రప్రభుత్వాలు విత్తనరంగానికి ప్రాధాన్యం ఇవ్వకపోవటం దురదృష్టకరమని స్వామినాథన్ అవేదన వ్యక్తంచేశారు. రైతుకు కావాల్సిన విత్తనాన్ని నిర్లక్ష్యంచేస్తే వ్యవసాయరంగం పురోభివృద్ధి అసంపూర్ణంగానే మిగిలిపోతుందని అన్నారు. భారత జాతీయ విత్తనసంస్థ, రాష్ట్రాల విత్తనసంస్థలు తన నాయకత్వంలోనే స్థాపించినా, వాటి పనితీరు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ విత్తన ఎగుమతులు మరింతగా పెంచుకునే అవకాశం ఉన్నదన్నారు. ఈ అంశాన్ని రైతులకు, సంబంధిత అధికారులకు, నిపుణులకు విస్తృతంగా, నిరంతర అవగాహన సదస్సుల ద్వారా తెలియచెప్పాలని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని ఆయన కేశవులుకు సూచించారు.

175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles