పరిపూర్ణానంద కాకినాడకు


Thu,July 12, 2018 02:58 AM

Swami Paripoornananda exiled from Hyderabad police escort him to Kakinada

-ఆర్నెల్లపాటు హైదరాబాద్ ప్రవేశంపై నిషేధం
-అభ్యంతరకర వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు
-సమాధానం చెప్పకపోవడంతో నిషేధాజ్ఞలు జారీ-
-15 రోజుల్లోగా ట్రిబ్యునల్‌కు వెళ్లొచ్చు: బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్‌రావు
-పరిపూర్ణానందకు నగర బహిష్కరణ
-ఉద్రిక్తత మధ్య కాకినాడకు స్వామి తరలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ పోలీసులు శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద సరస్వతిపై ఆరునెలల నగర బహిష్కరణ వేటు వేశారు. రాజధాని నగరంలో ప్రశాంతతకు భంగం కలుగకుండా ఉండేందుకు ఈ చర్యను తీసుకున్నట్టు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. నగర బహిష్కరణ చేయడానికి గల కారణాలను తెలుపుతూ బుధవారం తెల్లవారుజామున స్వామికి బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు నోటీసులు అందజేశారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయన స్వస్థలమైన కాకినాడకు ఎస్కార్ట్‌తో పంపించివేశారు. పరిపూర్ణానందపై బహిష్కరణ వేటు వేసేందుకు గల కారణాలను పోలీసులు ఆయనకు ఇచ్చిన నోటీసులో వివరించారు. కత్తి మహేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద బోడుప్పల్ నుంచి యాదాద్రికి పాదయాత్ర తలపెట్టారు. దీనికి రాచకొండ పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి లేకుండా ర్యాలీకి వెళ్లవద్దంటూ పోలీసులు ఆయనను సోమవారం హౌస్‌అరెస్ట్ చేసి సముదాయించారు. పోలీసులు ఎంత సర్దిచెప్పినా వినకుండా ఆయన తన వైఖరినే కొనసాగించారు.

ఆయన వ్యవహారశైలి నగరంలో ప్రశాంతతకు భంగం కల్గించేవిధంగా ఉందని, నగర బహిష్కరణ ఎందుకు చేయకూడదో తెలుపాలని తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీసోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ (1980) కింద పోలీసులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులకు స్వామిజీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయనపై నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీచేసినట్టు బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. 2017 నవంబరు 1వ తేదీన మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో జరిగిన సభలో రాష్ట్రీయ హిందూ సేవ ఆవిర్భావాన్ని ప్రకటించే సందర్భంలో స్వామిజీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఇటీవల కూడా అదే తరహాలో మాట్లాడారని పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అభ్యంతరాలు వ్యక్తంచేశారు. నిషేధాజ్ఞల వల్ల ఆయన మళ్లీ హైదరాబాద్‌లోకి ప్రవేశించాలంటే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, తాను నివసించే చిరునామాను కూడా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ ఆంక్షలపై పరిపూర్ణానందకు ఏవైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లో ట్రిబ్యునల్‌కు వెళ్లవచ్చని పోలీసులు తెలిపారు.

paripoornananda-swami2

ఎన్‌ఐఏ ద్వారా కాకినాడకు తరలింపు

నగర బహిష్కారానికి గురైన పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా ద్వారా ఉద్రిక్తత పరిస్థితుల్లో బుధవారం నేషనల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు కాకినాడకు తరలించారు. పరిపూర్ణానందను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సోమవారం వరకు గృహ నిర్భంధంలో ఉంచిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పరిపూర్ణానందస్వామిని ఎన్‌ఐఏ సభ్యులు కాకినాడకు కాన్వాయిలో తరలించేందుకు బయల్దేరారు. సుమారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఎన్‌ఐఏ బృందం సభ్యులు వైరా మండలంలోని స్టేజి పినపాకలో 8వ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఓ హోటల్ దగ్గర ఉదయం 9గంటల సమయంలో ఆగారు. సిబ్బంది అల్పాహారం తీసుకున్నారు. కాగా వారితోపాటు అక్కడ అల్పాహారం చేసేందుకు పరిపూర్ణానందస్వామి నిరాకరించారు. అనంతరం సుమారు గంట పైగా స్టేజి పినపాకలో హైడ్రామా నడిచింది.

పరిపూర్ణానందస్వామి తనను భద్రాచలం తీసుకెళ్లి సీతారాముల దర్శనం చేయించాలని ఐపీఎస్ అధికారిణితో పాటు ఎన్‌ఐఏ బృంద సభ్యులను కోరారు. ఎన్‌ఐఏ అధికారులు మాత్రం నేరుగా పరిపూర్ణానందస్వామిని కాకినాడకు తరలిస్తామని స్పష్టంచేశారు. దీంతో ఆయన కారు దిగి సుమారు గంటసేపు ఎన్‌ఐఏ బృందంలోని ఓ ఐపీఎస్ అధికారితో పాటు కొంతమంది సభ్యులతో సంవాదానికి దిగారు. తనను భద్రాచలం తీసుకెళ్లి రామాయలంలో దర్శనం చేయించాలని, లేకుంటే ఇక్కడ నుంచి తాను రానని పట్టుపట్టారు. ఉదయం 9.15 నుంచి 10.15 గంటల వరకు ఎన్‌ఐఏ అధికారులకు, పరిపూర్ణానందస్వామికి మధ్య చర్చలు జరిగాయి. చివరకు ఎన్‌ఐఏ అధికారులు పరిపూర్ణానందస్వామికి నచ్చజెప్పి కారులో ఎక్కించారు. అనంతరం నాలుగు కార్ల కాన్వాయితో పరిపూర్ణానందస్వామిని తల్లాడ వైపు తీసుకెళ్లారు. ఎన్‌ఐఏలకు సంబంధించిన ఓ ఐపీఎస్ అధికారితో పాటు సమారు 25 మంది సిబ్బంది పరిపూర్ణానందస్వామికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు

శ్రీపీఠాధిపతి పరిపుర్ణానందపై బహిష్కరణ వేటు ఎత్తేయాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్షనేత జీ కిషన్‌రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ప్రభాకర్ ఎమ్మెల్సీ రామచంద్రారావు తదితరులు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. పరిపుర్ణానంద శాంతికోసం పాటుపడుతున్నారని.. ఏనాడు శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని గవర్నర్‌కు వివరించారు.

ఖమ్మం జిల్లాలో ఆందోళనలు

పరిపూర్ణానందస్వామిని ఖమ్మం జిల్లా ద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించడంతో జిల్లాలో విశ్వహిందూ పరిషత్, బీజెపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంతోపాటు భద్రాచలం తదితర ప్రాంతాల్లో వారు ఆందోళన చేశారు. పీఠాధిపతి అయిన పరిపూర్ణానందను రహస్యంగా ఎన్‌ఐఏ బృందంతో కాకినాడకు తరలించడాన్ని వారు ఖండించారు.

ఎన్‌ఐఏ పోలీసులతో పక్కా వ్యూహం

పరిపూర్ణానందను ఏపీలోని కాకినాడలో ఆయన నిర్వ హిస్తున్న ఆశ్రమానికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్‌శాఖ కట్టుదిట్టంగా, వ్యూహాత్మకంగా ఏర్పాట్లు చేశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లోని తన నివాసం నుంచి పరిపూర్ణానందను కాకినాడలో ఉన్న ఆశ్రమానికి తరలించారు. తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్తే ఇబ్బందులు ఉంటాయన్న ఆలోచనతో రాష్ట్ర పోలీస్ అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీని రంగంలోకి దించి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ బృంద సభ్యులతో పరిపూర్ణానందను కాకినాడలోని ఆయన ఆశ్రమానికి తరలించారు. జాతీయస్థాయికి సంబంధించిన ఎన్‌ఐఏను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకునే అవకాశం లేనందున ఆ ఏజెన్సీ బృందంతో పరిపూర్ణానందస్వామిని వాహనాల్లో కాకినాడకు తరలించారు.

5056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles