కాంగ్రెస్ సిగపట్లు

Fri,September 20, 2019 02:32 AM

-హుజూర్‌నగర్ అభ్యర్థిపై ముదురుతున్న వివాదం
-ముందే ప్రకటించి ఇరుక్కున్న ఉత్తమ్
-రేవంత్ వ్యాఖ్యలతో వీధికెక్కిన రచ్చ
-జిల్లా రాజకీయాల్లో వేలుపెడితే సహించేదిలేదన్న ఎంపీ కోమటిరెడ్డి
-హుజూర్‌నగర్‌లో రేవంత్ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ సూర్యాపేట సిటీ: కాంగ్రెస్‌లో హుజూర్‌నగర్ అభ్యర్థి వివాదం ముదురుపాకాన పడుతున్నది. తన భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దింపుతున్నట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడం వివాదాన్ని రాజేసింది. ఉత్తమ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి.. తన మద్దతుదారుడు కిరణ్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్ఠానంపై ఒత్తిడితెస్తున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏకపక్షం గా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియాకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ చర్య.. కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలను రచ్చకీడ్చింది. రేవంత్‌పై తీవ్రంగా మండిపడిన పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. హుజూర్‌నగర్ అంశంలో రేవంత్‌రెడ్డికి ఏం సంబంధమని నిలదీశారు.

రేవంత్‌రెడ్డి చెప్తున్న అభ్యర్థి పేరు తనకే కాదు.. ఆ ప్రాంత నేత, మాజీ మంత్రి జానారెడ్డికి కూడా తెలియదన్నారు. పార్టీలోకి మధ్యలో వచ్చినవాళ్ల సలహాలు అవసరంలేదంటూ ఘాటుగా స్పందించారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఇతర జిల్లాల నాయకులు వేలుపెడితే సహించేదిలేదని రేవంత్‌నుద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు. 1986 నుంచి తాను కాంగ్రెస్‌లో ఉన్నానని, పార్టీలు మారలేదని, ఇతర పార్టీలనుంచి రాలేదన్నారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గా పద్మావతిని కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. అభ్యర్థిపై తాను, ఉత్తమ్, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి తదితరులు ఇప్పటికే నిర్ణయానికి వచ్చామని అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి తనకు ఎవరూ పోటీకాదన్నారు. కొత్త గా వచ్చినవారికి పార్టీపై ఏమి ప్రేమ ఉంటుందని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇదెలా ఉన్నా.. పద్మావతి అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తున్నది. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం.

హుజూర్‌నగర్‌లో రేవంత్ దిష్టిబొమ్మ దహనం

హుజూర్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దహనంచేశారు. తమ జిల్లాకు సంబంధం లేని వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదంటూ కార్యకర్తలు నినాదాలుచేస్తూ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ను, టీపీసీసీ చీఫ్‌ను ప్రజల్లో చులకనచేస్తే సహించబోమని రేవంత్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. పద్మావతి పోటీ విషయంలో ఉత్తమ్‌కు ఎంపీ కోమటిరెడ్డి మద్దతు పలుకుతున్నా.. హుజూర్‌నగర్‌లోని పార్టీ శ్రేణులు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వ్యతిరేకంగా కూడా ప్రకటనలు చేస్తుండటం విశేషం. హుజూర్‌నగర్‌కు కోమటిరెడ్డి సోదరులకు సంబంధమే లేదని, వారు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. హుజూర్‌నగర్ నుంచి పద్మావతిరెడ్డి పోటీచేస్తారని మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు ఉద్దేశపూర్వకంగా ఉత్తమ్‌పై విమర్శలు చేస్తున్నారని, వారిని సహించేదిలేదని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నారని, టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీరివల్లనే తెలంగాణలో పార్టీ ఓటమిపాలైందన్నారు.

రేవంత్.. ఓ కోవర్టు

పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి కొందరి మెప్పుకోసం కోవర్టుగా పనిచేస్తున్నట్టున్నదని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు డు చెవిటి వెంకన్నయాదవ్ అనుమానం వ్యక్తంచేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెడ్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజూర్‌నగర్‌కు కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పేరును ఉత్తమ్ ప్రకటించడానికి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికి, పరువు పొగొట్టుకు న్న ఆయన.. తమ నేత గురించి మాట్లాడేదేందని నిలదీశారు. కాంగ్రెస్ గెలుపుకోసం కష్టపడే తమ నేత ఉత్తమ్‌ను విమర్శించేస్థాయి.. వలసవచ్చిన రేవంత్‌కు లేదన్నారు. టీడీపీలో చేసినవిధంగా చిల్లర రాజకీయాలు ఇక్కడ నడువవని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు అంజద్‌అలీ, కోతి గోపాల్‌రెడ్డి, ధరావత్ వీరన్ననాయక్, కెక్కిరేణి శ్రీనివాస్, కొండపల్లి సాగర్‌రెడ్డి, దుశ్చర్ల మంజుల, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles