పుప్పాలగూడ విజయం

Wed,October 23, 2019 03:07 AM

-ఆ 148 ఎకరాలు ప్రభుత్వానివే
-పుప్పాలగూడ భూములపై సుప్రీంకోర్టు తీర్పు
-ముగిసిన కాందిశీకుల నాటకం
-దశాబ్దాల నాటి అక్రమాలకు తెర
-ఎప్పటికప్పుడు కేసుపై సీఎం కేసీఆర్ సమీక్ష
-రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ అధికారుల కృషి
-ప్రభుత్వ స్వాధీనంలోనే భూమి
- హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలకు చేరువలో..

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ:రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని వివాదాస్పద భూములన్నీ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుతో ఈ భూములపై దశాబ్దాలుగా సాగిన అక్రమాలకు తెరపడింది. దాదాపు ఐదువేల కోట్ల రూపాయలకుపైగా విలువచేసే 148.30 ఎకరాల భూమి ప్రభుత్వపరమైంది. ఉమ్మడి రాష్ట్రంలో సాగిన అక్రమాల చిట్టాను.. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వం దుమ్ముదులిపింది. అంగుళం భూమి కూడా అక్రమార్కుల పాలుకావద్దన్న గట్టి నిర్ణయంతో ఉన్న సీఎం కేసీఆర్.. అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తూ చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో అప్పటిదాకా కబ్జాల్లో ఉన్న భూమి.. ప్రభుత్వ స్వాధీనం అవుతున్నది. ఈ క్రమంలోనే పుప్పాలగూడ భూమి కేసులో సీఎం ఎప్పటికప్పుడు సమీక్షించడం, దానికి రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ అధికారులు కృషి తోడుకావటంతో అత్యంత ఖరీదైన భూమి ప్రభుత్వానికి దక్కింది.

ఐటీ కంపెనీలకు చేరువలో..
పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 301 నుంచి 308 వరకు, 324 నుంచి 331 వరకు 148.30 ఎకరాల భూములున్నాయి. అవన్నీ హైటెక్‌సిటీ, సైబర్ గేట్‌వే, పలు ఐటీ కంపెనీలకు అత్యంత సమీపంలో ఉన్నవే. వీటి ధర బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పలికే అవకాశం ఉన్నది. అంటే ప్రస్తుతం ప్రభుత్వం రూ.5 వేల కోట్లకు పైగా విలువ కలిగిన భూములపై విజయం సాధించిందన్న మాటే! అప్పనంగా, అక్రమంగా కేటాయించిన భూములపై సీరియస్‌గా దృష్టిసారించిన సీఎం కేసీఆర్.. పుప్పాలగూడ భూములపై హక్కులు సాధించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు చేశారు. సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఏజీ, డీజీలు రెవెన్యూ అధికారులతో కలిసి రిపోర్టులు రూపొందించి కోర్టుకు సమర్పించారు. ఫలితం గా సర్కారుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

కేటాయించినా సరిపోలేదని..

దేశవిభజన సందర్భంగా ఆస్తులు కోల్పోయి పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థుల (కాందిశీకులు)కు పరిహారం చెల్లించడానికి కేంద్రం నిర్వాసితుల (పరిహారం, పునరావాసం) (డీపీసీఆర్) చట్టం- 1954, నిర్వాసితుల భూమి పాలన చట్టం- 1950 తీసుకువచ్చింది. వీటిప్రకారం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో పశ్చిమ పాకిస్థాన్ నుంచి వచ్చిన పరశురాం రామచంద్‌మలాని అనే వ్యక్తికి 1952లోనే బాటసింగారం, బోయినపల్లి గ్రామాల్లో 323.10 ఎకరాలను కేటాయించారు. తర్వాత ఆయన దాన్ని అమ్మేశారు. 1988లో చనిపోయారు. 13 ఏండ్ల తర్వాత పరశురాం రామచంద్ మలానీ వారసులుగా చెప్పుకొన్నవారు పాకిస్థాన్‌లో ఆయన వదిలేసుకున్న భూమికి సరిసమానమైన భూమి ఇవ్వలేదని, మళ్లీ తమకు హైదరాబాద్ జిల్లాలోనే 200 ఎకరాలను కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆ మేరకు ఎస్‌ఈపీ 3/19/2001, తేదీ. 26.2.2003 ఉత్తర్వుల ప్రకారం పుప్పాలగూడలో 148.30 ఎకరాలను కేటాయించారు. నిజానికి పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులకు అక్కడ కోల్పోయిన భూమికి సరిపడా భూమి మాత్రమే ఇవ్వాలి. కానీ భారత ప్రభుత్వం మలానీకి దాదాపు నాలుగింతలు.. అంటే 323.10 ఎకరాలు కేటాయించడం విశేషం. అయినా కేటాయించిన భూమి సరిపోదంటూ వారసులు దరఖాస్తు చేసుకోగానే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరి పెద్దల జోక్యంతో రెవెన్యూ అధికారులు పుప్పాలగూడలో భూములు కేటాయించారు. మలానీ మృతి చెందిన తర్వాత హక్కుల బదలాయించాలని ఆయన వారసులు ప్రభుత్వాన్ని కోరారు. దీనికి అనుకూలంగా 2003 ఫిబ్రవరి 26న సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీచేసింది. కేటాయింపులను సమర్థిస్తూ 2006 జూన్ 28న రెవెన్యూ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. వాటిని సవాలుచేస్తూ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. అసలైన నిర్వాసితుడు 1988లో మృతిచెందారని, మలానీ వారసులమంటున్నవారు అందుకు ఆధారాలను చూపించడం లేదని పేర్కొన్నది. వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పరశురాం వారసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సదరు భూమి ప్రభుత్వానికే చెందుతుందని తుదితీర్పును వెలువరించినట్లు రాజేంద్రనగర్ ఆర్డీవో కే చంద్రకళ నమస్తే తెలంగాణకు చెప్పారు. ఈ భూమిని గతంలోనే హెచ్‌ఎండీఏకు కేటాయించారు.

కేటాయించిందే ఎక్కువ

వాస్తవానికి మలానీకి పాకిస్థాన్‌లో పోగొట్టుకున్న భూమికి నాలుగురెట్లు అధికంగా కేటాయించారు. దానిని కొంతకాలం అనుభవించి, ఆ తర్వాత అమ్మేసుకున్నారు. కానీ.. దాదాపు 34 ఏండ్ల తర్వాత ఆయన వారసులమని, సరిపడా భూమి కేటాయించలేదని కొందరు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం, ఆ వెంటనే అదృశ్యశక్తుల మాయాజాలంతో అప్పటి రెవెన్యూ అధికారులు చకచకా ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. పైగా కేంద్ర ప్రభుత్వం ఈ కేటాయింపులు చేయాల్సి ఉన్నా.. సీసీఎల్‌ఏ ద్వారా చేశారు. కోల్పోయిన దానికి సమానంగానో, అంతకు ఇన్ని రెట్లుగానో ఇవ్వాలని చట్టంలో ఎక్కడాలేదని అధికారులు చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శేషాద్రి, రజత్‌కుమార్, రఘునందన్‌రావు హయాంలో కేటాయింపులను రద్దుచేశారు. ఆ తర్వాత హైకోర్టులోనూ వాదనలు వినిపించి విజయం సాధించారు. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కూడా ఆ కేసు పూర్వాపరాలను వెలికితీసి అన్ని ఆధారాలను కలెక్టర్ హరీశ్, ఆర్డీవో కే చంద్రకళ సమర్పించారు.

క్రయ విక్రయాలు

పుప్పాలగూడలో సర్వే నం.310, 311, 318 నుంచి 323, 337 భూములపై వివాదం ఉన్నదని తెలిసీ కొందరు తక్కువధరకు వస్తున్నాయని కొనుగోలుచేశారు. మరికొందరు అత్యుత్సాహంతో ఏమవుతుందిలే అని కొన్నారు. అక్రమాలకు చట్టబద్ధత సాధించేందుకు కొందరు ప్రయత్నాలు చేశారు. ఆయాస్థలాల్లో ఎలాంటి లేఅవుట్లు లేవు. కానీ గ్రామపంచాయతీ అనుమతులు తీసుకున్నట్లు పత్రాలు తయారు చేసుకున్నారని సమాచారం. గతంలో హైకోర్టు తీర్పు వెలువడిననాటినుంచే అధికారులు తదుపరి అక్రమాలు సాగకుండా పకడ్బందీ కార్యాచరణను అమలుచేశారు. దాంతో సరికొత్త నిర్మాణాలు ఏవీ రాలేదు.

సీఎం కృత నిశ్చయంతోనే విజయం

పుప్పాలగూడ భూములపై సుప్రీంకోర్టులోనూ విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ కేసులో సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు, కృతనిశ్చయం ఫలితాన్నిచ్చాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రఘునందన్‌రావు ఎంతో కృషిచేశారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారుల సూచనలు తీసుకున్నాం. హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ అధికారుల కృషి కూడా ఉన్నది. ప్రధాన ప్రాంతంలో ఉన్న అత్యంత ఖరీదైన భూమిని కాపాడటం తృప్తిగా ఉన్నది.
- హరీశ్, కలెక్టర్, రంగారెడ్డి జిల్లా

బంజారాభవన్ నుంచే మొదలైంది

నేను హైదరాబాద్‌జిల్లాలో ఉన్నప్పుడే బంజారాభవన్ స్థలంపై ఇదే వివాదం ఉన్నది. సీఎం కేసీఆర్ బంజారాభవన్‌కు స్థలం కేటాయించాలనుకున్నప్పుడు ఈ కేసు విషయం చెప్పాం. అప్పుడే ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నాలుగెకరాల కేసు గెలిచాం. ఇప్పుడు 148.30 ఎకరాలపైన. సీఎం సీరియస్‌గా తీసుకోవడం వల్లే చేయగలిగాం. ఏజీ, డీజీలు, హెచ్‌ఎండీఏ అధికారులు సహకరించారు. అక్రమాలకు తెరపడింది. ప్రభుత్వ సహకారంతో మిగతా కేసుల్లోనూ విజయం సాధిస్తాం.
- కే చంద్రకళ, ఆర్డీవో, రాజేంద్రనగర్

2942
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles