అయోధ్య తీర్పు నేపథ్యంలో అలర్ట్!

Sat,November 9, 2019 01:44 AM

-రాష్ట్రవ్యాప్తంగా సున్నిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన పోలీసులు
-మతపెద్దలతో శాంతి సమావేశాలు
-సోషల్ మీడియాలో వందంతులు డిలీట్ చేయండి
-నమస్తే తెలంగాణతో శాంతిభద్రతల అదనపు డీజీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అయోధ్య స్థలవివాదంపై శనివారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టంచేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఘటనలు జరిగిన ప్రాంతాల్లో నిఘా మరింత పెంచినట్టు తెలిసింది. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా రెండు వర్గాలవారు కట్టుబడి ఉండాలని, శాంతియుత వాతావరణం కోసం కృషిచేయాలని కోరుతూ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పలుమార్లు ఇరువర్గాల పెద్దలతో వేర్వేరుగా, ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మిగిలిన ప్రాంతాల్లోనూ సమావేశాలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్రబలగాలు అందుబాటులో లేనప్పటికీ రాష్ట్ర బలగాలతోనే బందోబస్తు నిర్వహించేలా పోలీసులు ప్రణాళికలు రూపొందించారు. ఎలాంటి విజయోత్సవాలకు, ఖండన ర్యాలీలకు అనుమతిలేదని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. పూర్తి అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ కమిషనర్లకు సైతం ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది.

వదంతులతో జాగ్రత్త

home-minister1
అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సోషల్‌మీడియాపై పూర్తిస్థాయిలో నిఘా పెడుతున్నాం. తమకు వచ్చే వదంతులకు సంబంధించిన, ఇతరులను కించపర్చేలా ఉన్న పోస్టులను ఎవ్వరూ ఫార్వర్డ్ చేయొద్దు. అలాంటివి వస్తే వెంటనే డిలీట్ చేయండి. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్టుచేసేవారిపైనా చట్టప్రకారం కఠినచర్యలు ఉంటాయి. శాంతియుత వాతావరణం ఉండేలా మతపెద్దలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నాం. సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటుచేస్తున్నాం.
- జితేందర్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ

864
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles