నిజామాబాద్‌లో అభివృద్ధి కొనసాగిస్తాం


Fri,February 22, 2019 02:13 AM

sun foundation md kaveri maran meets with mp kavitha

-ప్రభుత్వ, సీఎస్‌ఆర్ నిధులు వినియోగిస్తాం: ఎంపీ కవిత
-సన్ ఫౌండేషన్ ఎండీ కావేరి మారన్‌తో భేటీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఐదేండ్లలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తన ఎంపీ లాడ్స్ నిధులు రూ.5 కోట్లతోపాటు కార్పొరేట్ సంస్థల విరాళాలు, సీఎస్‌ఆర్ నిధులను వెచ్చించామని చెప్పారు. వాటిని కొనసాగిస్తామన్నారు. సన్ టీవీ నెట్‌వర్క్, సన్ ఫౌండేషన్ ఎండీ కావేరి మారన్ గురువారం హైదరాబాద్‌లో ఎంపీ కవితతో భేటీ అయ్యారు. ఫౌండేషన్ దత్తత గ్రామం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ నిజామాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తేవడానికి అన్ని విధాలుగా కృషి చేశానన్నారు. సామాజిక బాధ్యత నిధుల (సీఎస్‌ఆర్) కింద బీహెచ్‌ఈఎల్, సింగరేణి నుంచి నిధులు సేకరించామన్నారు. సన్ నెట్‌వర్క్ రూ.1.5 కోట్లు ఇచ్చిందని చెప్పారు.

ఈ నిధులతో పోతంగల్‌లో స్కూల్ కాంప్లెక్స్ , లైబ్రరీ, ఫంక్షన్ హాల్, చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణంలో ఉన్నాయని, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇవన్నీ వేసవిలోగా పూర్తవుతాయన్నారు. గత ఏడాది నవంబర్ 8 నుంచి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానల్లో రోగుల బంధువుల కోసం ఇబ్బంది పడకుండా సొంతంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ లైబ్రరీలోనూ భోజనం పెడుతున్నామని చెప్పారు. ఇకపై ఈ బాధ్యతను సన్ నెట్‌వర్క్ చూసుకుంటుందని, ఈ ఏడాది అందించనున్న రూ.1.5 కోట్ల నిధులను ఈ కార్యక్రమానికి వినియోగించాలని కోరారన్నారు. ఈ సందర్భంగా సన్ ఫౌండేషన్ ఎండీ కావేరి మారన్, జెమిని కిరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సొంతంగా కిచెన్ నిర్మించి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగేలా అప్పగిస్తామన్నారు.

399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles