పరిహారం ఇయ్యరు.. పాస్‌బుక్ అందదు!


Mon,August 19, 2019 02:39 AM

Sudhakar Reddy Meets Dharmaganta

-కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి తీసుకొని పరేషాన్ చేస్తున్నరు
-భూమి దున్నుకోండని చెప్పిన ప్రాజెక్టు అధికారులు
-పరిహారం ఇచ్చామని దాటవేస్తున్న రెవెన్యూ సిబ్బంది
-సాగుచేసుకొంటున్నా పాస్‌బుక్ లేదు
-ధర్మగంటను ఆశ్రయించిన సిద్దిపేట జిల్లావాసి సుధాకర్‌రెడ్డి

అది ఐదు దశాబ్దాల కింద ప్రభుత్వం లావుణి పట్టా కింద ఇచ్చిన భూమి. కొన్నేండ్ల కింద కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధికారులు ఆ భూమిని సేకరించారు. ఇందుకు పరిహారాన్ని కూడా ప్రభుత్వం మంజూరుచేసింది. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం పరిహారాన్ని అసలు యజమానికి అందివ్వలేదు. సదరు భూమి తనదేనని భూ యజమాని అడిగితే.. ఎంజాయ్‌మెంట్ సర్వేచేసి కాస్తులో ఉన్నవారికి పరిహారం ఇచ్చామని సమాధానమిచ్చారు. ప్రాజెక్టు అధికారులను అడిగితే ఆ భూమిని వాడుకోలేదని, వృథాగానే ఉన్నదని, దానిని దున్నుకోండి అని చెప్పారు. బాధితుడు భూమిని సాగుచేసుకొంటున్నా రెవెన్యూ అధికారులు మాత్రం కొత్త పాస్‌పుస్తకం మంజూరుచేయకుండా సతాయిస్తున్నారు. దీంతో రెండు విడుతల రైతుబంధు సాయం కోల్పోయానని, తనకు న్యాయంచేయాలని సిద్దిపేట మండలం ఎన్‌సాన్‌పల్లికి చెందిన రైతు పబ్బతి సుధాకర్‌రెడ్డి ధర్మగంటను ఆశ్రయించారు.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలంలోని ఎన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన పబ్బతి సుధాకర్‌రెడ్డికి ప్రభుత్వం 1967లో సర్వే నంబర్ 730/8లో లావుణీ పట్టా కింద ఐదెకరాల భూమిని కేటాయించింది. అప్పటి రెవెన్యూ అధికారులు సుధాకర్‌రెడ్డి పేరిట పాస్‌పుస్తకం కూడా మంజూరుచేశారు. పహాణీలో, ఆర్వోఆర్‌లోనూ అతని పేరిట భూరికార్డులు నమోదుచేశారు. అప్పటినుంచి సుధాకర్‌రెడ్డి ఆ భూమిని సాగుచేసుకొంటున్నారు. అయితే కొన్నేండ్ల కింద ఇక్కడ ఈ ఐదెకరాలతోపాటు మరికొంత భూమిని ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా టన్నెల్ నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పరిహారాన్ని కూడా ప్రభుత్వం మంజూరుచేసింది. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం బాధిత రైతుకు పరిహారం ఇవ్వలేదు.

ఈ విషయమై బాధిత రైతు రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే.. ఎంజాయ్‌మెంట్ సర్వేచేసి కాస్తులో ఉన్నవారికి పరిహారం ఎప్పుడో ఇచ్చామని చెప్పారు. సుధాకర్‌రెడ్డితోపాటు మరికొంత మందికి మినహా ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చినవారందరికీ పరిహారం అందజేశారు. పరిహారం కోసం బాధితుడు సుధాకర్‌రెడ్డి రెవెన్యూ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక.. ప్రాజెక్టు అధికారులకు ఫిర్యాదుచేశారు. వారు మీ భూమిని ప్రాజెక్టు కోసం తీసుకొన్నది వాస్తవమే. కానీ దానిని ప్రాజెక్టు కోసం వాడుకోలేదు. ప్రాజెక్టు కోసం తీసుకొన్న భూమిలో ఇంకా 16 ఎకరాలు ఖాళీగానే ఉన్నది. దానిని మీరు తిరిగి స్వాధీనంచేసుకొని సాగుచేసుకోండి అని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆర్డర్‌ను తాసిల్దార్‌కు పంపించామని తెలిపారు. ఇదే విషయాన్ని బాధితుడు తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రాజెక్టు అధికారుల నుంచి తమకు ఎలాంటి ఆర్డర్ అందలేదని దాటవేస్తున్నారు. అలాగని నష్టపరిహారం కూడా ఇవ్వలేదని సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టు అధికారుల సూచన మేరకు భూమిని సాగుచేసుకొంటున్నా.. రెవెన్యూ అధికారులు కొత్త పాస్‌పుస్తకం మంజూరు చేయకపోవడంతో ఇప్పటికే రెండు విడుతల రైతుబంధు సాయం కోల్పోయానని బాధితుడు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.
Dharmaganta
ఎలాంటి ఆర్డర్ రాలేదు
కాళేశ్వరం ప్రాజెక్టు కింద పోయింది మొత్తం వంద ఎకరాలు. ఆ భూమిని రికార్డులో కూడా కొట్టేశారు. పరిహారం అందనివారికి, ఉపయోగించని భూమిని బాధితులకు తిరిగివ్వాలని.. ప్రాజెక్టు అధికారుల నుంచి మాకేమీ ఆర్డర్లు రాలేదు. ప్రాజెక్టు కార్యాలయం నుంచి రాతపూర్వకమైన ఆర్డర్ వస్తే సమస్యను పరిష్కరిస్తాం. ఇటీవల తాసిల్దార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో సర్వేచేశాం. నేను వచ్చి ఐదు నెలలే అవుతున్నది. అంతకుముందే ఆ భూమిని రికార్డుల్లో కొట్టేశారు. వారికి పాస్‌బుక్ రాకుండా మేం ఆపిందేమీ లేదు.
- బాలనర్సయ్య, వీఆర్వో

ప్రాజెక్టు కోసం భూమి తీసుకోకుంటే పాస్‌బుక్ ఇస్తాం
సుధాకర్‌రెడ్డి ఫిర్యాదుచేస్తున్న భూమికి పరిహారం చెల్లించాం. కానీ కాస్తులో ఇతరులు ఉన్నారట. ఎంజాయ్‌మెంట్ సర్వే ప్రకారం అప్పుడు కాస్తులో ఉన్నవారికి పరిహారం ఇచ్చారు. ఎంజాయ్‌మెంట్ సర్వే రికార్డులు తెప్పించుకొని, పరిహారం ఇచ్చే సమయంలో కాస్తులో ఎవరున్నారో పరిశీలిస్తాం. అప్పుడు సుధాకర్‌రెడ్డే కాస్తులో ఉంటే పరిహారం ఇప్పిస్తాం. సుధాకర్‌రెడ్డికి సంబంధించిన ఎంత భూమికి పరిహారం వచ్చిందో తెలియదు. రికార్డులు పరిశీలించిన తర్వాతే వారికి ఏమైనా చేయగలుతాం. ఆ భూమి వాస్తవానికి సుధాకర్‌రెడ్డిదే అయితే, ఆ భూమి ప్రాజెక్టు కింద పోకపోతే పాస్‌పుస్తకం మంజూరుచేస్తాం. ప్రాజెక్టు అధికారుల నుంచి పరిహారం చెల్లింపులకు సంబంధించిన రికార్డులు ఇంకా మా వద్దకు రాలేదు. - విజయ్‌సాగర్, సిద్దిపేట తాసిల్దార్

1035
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles