పదిరోజులు కస్టడీకి ఇవ్వండి

Tue,December 3, 2019 04:21 AM

- దిశ నిందితుల కస్టడీ కోరుతూ షాద్‌నగర్‌ కోర్టులో పోలీసుల పిటిషన్‌
- విచారణను నేటికి వాయిదావేసిన న్యాయమూర్తి
- దిశ నిందితులకు సహకరించం: షాద్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌
- కృష్ణానదిలో దిశ అస్థికలు నిమజ్జనం
- సూర్యాపేటలో విద్యార్థుల భారీర్యాలీ

హైదరాబాద్‌/షాద్‌నగర్‌, నమస్తే తెలంగాణ, బొడ్రాయిబజార్‌ (సూర్యాపేట): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ షాద్‌నగర్‌ సోమవారం షాద్‌నగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దిశ హత్యకేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను విచారించేందుకు పదిరోజులు కస్టడీకి అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి కస్టడీపై తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. ఇన్‌చార్జి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అందుబాటులో లేకపోవడంతో విచారణను వాయిదావేసినట్టు తెలిసింది. నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ విషయం తెలుసుకున్న ప్రజలు, మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున కోర్టు ఆవరణకు చేరుకున్నారు. మంగళవారం నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించవచ్చని తెలుస్తున్నది. దిశ నిందితులకు ఎట్టి పరిస్థితిల్లోనూ న్యాయసహాయం అందించబోమని షాద్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ తీర్మానం చేసింది. సోమవారం కోర్టు ఆవరణలో సమావేశమైన న్యాయవాదులు ఈ మేరకు తీర్మానం చేసినట్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నడికూడ సత్యనారాయణయాదవ్‌, ఉపాధ్యక్షుడు చెట్ల శంకర్‌, మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మహిళలు, యువతులపై లైంగికదాడి, హత్య కేసుల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా చట్టాలను మరింత కఠినం చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
Suryapet-Students1

కఠినచట్టాలు తీసుకురావాలి: హైకోర్టు న్యాయవాదులు

మహిళలపై లైంగికదాడులను అరికట్టేందుకు కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు న్యాయవాదులు పేర్కొన్నారు. షాద్‌నగర్‌, వరంగల్‌ ఘటనలను నిరసిస్తూ న్యాయవాదులు సోమవారం హైకోర్టు మదీనా రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. నిందితులకు తక్షణమే ఉరిశిక్ష వేసేలా చట్టానికి సవరణలు చేయాలని హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి సుంకరి జనార్దన్‌గౌడ్‌, న్యాయవాదులు శారద, రామారావు డిమాండ్‌ చేశారు. మహిళలపై లైంగికదాడి, ఇతర అకృత్యాల కేసుల్లో నేర పరిశోధన, శిక్షల తీరు ఆశాజనకంగా లేవని, దీంతో దాడులు పెరిగిపోతున్నాయని భారతీయ న్యాయవాదుల సంఘం (ఐఏఎల్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్‌ పేర్కొన్నారు. పదింట తొమ్మిది కేసుల్లో నిందితులకు శిక్ష పడటంలేదని తెలిపారు. ఐఏఎల్‌ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌ అమృత ఎస్టేట్స్‌ వద్ద కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. శంషాబాద్‌, వరంగల్‌లో లైంగిక దాడుల నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సూర్యాపేటలో ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డు నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ వరకు సుమారు ఆరువేల మంది విద్యార్థినులు పెద్దఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ‘సేవ్‌ గర్ల్స్‌.. సేవ్‌ ఇండియా’, ‘నిందితులకు ఉరే..సరి’ అంటూ నినదించారు.
Suryapet-Students5

స్పందించేముందు వాస్తవాలు గ్రహించాలి

- రేఖాశర్మను ట్విట్టర్‌లో కోరిన మంత్రి కేటీఆర్‌
ఏదైనా ఒక విషయంపై స్పందించేముందు పూర్తిగా వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో సూచించారు. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు టీఆర్పీ కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. దిశ ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ట్వీట్‌ చేసిన జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మకు మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ ద్వారా సమాధానమిచ్చారు. ‘మీరు చాలా ముఖ్యమైన పదవిలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ చేయని వ్యాఖ్యలపై స్పందించేముందు వాస్తవాలు గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.
Suryapet-Students2

దిశ అస్థికలు నిమజ్జనం

దుండగుల చేతిలో హత్యకు గురైన దిశ అస్థికలను ఆమె తండ్రి, బంధువులు సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. అనంతరం దిశ తండ్రి మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి ఏ ఆడబిడ్డకూ రాకూడదని కన్నీళ్లు పెట్టుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
Suryapet-Students3
Suryapet-Students4

1718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles