స్టాంపుల సొమ్ము స్వాహా

Thu,January 24, 2019 03:43 AM

-ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో వెలుగుచూసిన మోసం
-అసిస్టెంట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ సహా ఐదుగురి సస్పెన్షన్
-ఐదేండ్లుగా రూ. 90 లక్షలు గోల్‌మాల్
-రూ. 12 లక్షలు రికవరీ చేసిన అధికారులు

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపుపేపర్లు విక్రయించగా వచ్చిన సొమ్మును ఖజానాకు జమచేయకుండా సొంతానికి వాడుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఐదేండ్లుగా దాదాపు రూ.90 లక్షలు స్వాహా అయినట్టు వెల్లడయింది. ఈ వ్యవహరంలో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనర్ చిరంజీవులు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్‌శాఖ కరీంనగర్ డీఐజీ ట్వింకల్ జాన్ ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, లక్సెట్టిపేట, భైంసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు అవసరమైన స్టాంపుపేపర్లను అమ్మగా వచ్చిన సొమ్మును 2014 నుంచి ఖజానాకు జమచేయడంలేదు. ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో ఈ విషయం బయటపడటంతో జిల్లా రిజిస్ట్ట్రార్ ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆడిట్‌లో జరిగిన రూ.78 లక్షలకు సంబంధించిన రికార్డులు సరిగా లేకపోవడంతో రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగులు ఇంతియాజ్‌తోపాటు కపిల్‌ను అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో కార్యాలయ ఉద్యోగుల హస్తం ఉందన్న అనుమానంతో లోతుగా విచారణ జరిపించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ.. కరీంనగర్ డీఐజీ ట్వింకల్‌జాన్‌ను నియమించింది.

బుధవారం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన జరిపిన విచారణలో జిల్లాలోని వివిధ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపుల అమ్మకాల ద్వారా వసూలైన సొమ్మును ట్రెజరీకి జమచేయకుండా సొంతానికి వాడుకున్నట్టు తేలింది. స్వాహాఅయిన సొత్తులో రూ.12 లక్షలను తిరిగి వసూలు చేశారు. ఇంత పెద్దమొత్తంలో కుంభకోణం జరిగినా పట్టించుకోలేదనే కారణంతో.. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆదిలాబాద్ అసిస్టెంట్ రిజిస్ట్ట్రార్ ఇమ్రాన్‌ఖాన్, సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, జూనియర్ అసిస్టెంట్ అరుణ్‌కుమార్, నిర్మల్ జిల్లా భైంసా సబ్‌రిజిస్ట్రార్ సాయినాథ్, లక్సెట్టిపేట ఎస్‌ఆర్‌వో మనోహర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా రిజిస్ట్రార్ జైవంత్‌ను విధుల నుంచి తప్పించి ఆయన స్థానంలో హైదరాబాద్‌కు చెందిన రిజిస్ట్ట్రార్ ఎం రవీందర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే పలువురు ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌లుగా కొనసాగడంతో పెద్దఎత్తునే కుంభకోణం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


221

2012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles