కృష్ణమ్మ పరవళ్లు

Tue,September 10, 2019 03:53 AM

-ఎగువ నుంచి ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద
-శ్రీశైలం ఆరు గేట్లు, సాగర్ 8 క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు విడుదల
-ఉగ్రరూపం దాల్చిన తుంగభద్ర
-గోదావరిలో కొనసాగుతున్న ప్రవాహం

హైదరాబాద్/జోగుళాంబ గద్వాల/భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, నమస్తే తెలంగాణ/నందికొండ: కృష్ణాబేసిన్‌లో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఎగువ ప్రాంతాల్లోంచి భారీ వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి దాదాపు 1.98 లక్షల క్యూసెక్కు ల వరద ఆల్మట్టిలోకి వస్తుండగా.. 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నా రు. ఈ క్రమంలో నారాయణపుర జలాశయానికి 2.28 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. అధికారులు దాదాపు 2.42 లక్షల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతుండటంతో జూరాల జలాశయానికీ భారీగా వరద కొనసాగుతున్నది. మరోవైపు ఉజ్జయిని నుంచి కూడా 70 వేల క్యూసెక్కులకుపైగా భీమా ద్వారా ప్రధాన కృష్ణాలో కలుస్తున్నది. సోమవారం రాత్రి 9 గంటల సమయానికి జూరాలకు 2.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 3.02 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. అటు తుంగభద్ర ప్రాజెక్టు 28 స్పిల్‌వే గేట్లు ఎత్తి దిగువకు 96,546 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జూరాల, తుంగభద్రల ద్వారా కొనసాగుతున్న వరదతో శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో అంతకంతకూ పెరుగుతున్నది.

krishna-basin4
శ్రీశైలం జలాశయం వద్ద 3.72 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా అధికారులు 6 క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్‌కు భారీగా వరద పోటెత్తడంతో ప్రాజెక్టు అధికారులు రాత్రి 7:30 గంటల సమయంలో 8 క్రస్ట్‌గేట్ల నుంచి 63,288 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నా రు. శ్రీశైలం నుంచి వచ్చే ఇన్‌ఫ్లోపై ఆధారపడి సాగర్ క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుందని వారు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టుకు 39 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. దిగువకు 70వేల క్యూసెక్కుల వరకు వదులుతున్నారు. ఇక గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. సోమవారం పెరూరు దగ్గర 1.48 లక్షల క్యూసెక్కుల వరద నమోదయింది. ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 9,850 క్యూసెక్కులు వస్తుండగా, శ్రీరాజరాజేశ్వర జలాశయం ద్వారా లోయర్‌మానేరుకు 3,443 క్యూసెక్కుల నీరు వస్తున్నది.

krishna-basin3

భద్రాచలం వద్ద తగ్గుతున్న ప్రవాహం

ఆదివారం ఉగ్రరూపం దాల్చిన గోదావరి సోమవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద ఉదయం 8 గంటలకు 51 అడుగులు ఉన్న గోదావరి మధ్యాహ్నం 12 గంటలకు 50.2 అడుగులు, రాత్రి 11 గంటలకు 46.9 అడుగులకు చేరింది. 48 అడుగుల కంటే తక్కువగా గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కాగా, సోమవారం వరద పెరగడంతో తాలిపేరు రిజర్వాయర్ మూడు గేట్లు ఎత్తి 7,560 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులకు ప్రస్తుతం 406.1 అడుగులతో నిండుకుండను తలపిస్తున్నది.

krishna-basin2

రాష్ట్ర చరిత్రలో తొలిసారి అత్యధికంగా జలవిద్యుదుత్పత్తి

రాష్ట్ర జలవిద్యుత్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయింది. కృష్ణా నదికి వస్తున్న వరదలతో 32 ప్లాంట్ల ద్వారా 47.235 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తయింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రా జెక్టుల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఒకే రోజు 32 ప్లాంట్ల ద్వారా 47.235 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కావడం ఇదే తొలిసారని జెన్‌కో డైరెక్టర్ (హైడల్) తెలిపారు. రాష్ట్రంలో అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయడంపై సీఎం కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్ సరఫరా అధ్వానంగా ఉన్నప్పటికీ కేవలం ఆరు నెలల్లోనే పరిస్థితిని చక్కదిద్దారు. ఇటీవల విద్యుత్‌కు గణనీయమైన డిమాండ్ ఏర్పడినప్పటికీ ఎక్కడా కొరతలేకుండా చేయగలిగారు. కృష్ణా నది ద్వారా వస్తున్న నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి విద్యుదుత్పత్తి చేయడంతో రాష్ట్ర అవసరాలను తీర్చగలుగుతున్నారు.
projects

1216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles