కృష్ణమ్మ గలగల


Wed,September 11, 2019 03:51 AM

Srisailam Dam 6 Gates Opened Due To Heavy Floods

-ఎగువ నుంచి దిగువ వరకు గేట్లెత్తిన ప్రాజెక్టులు
-ఈ సీజన్‌లో రెండోసారి వరద ఉధృతి
-పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండల్లా జలాశయాలు
-శ్రీశైలం ఆరు.. సాగర్ 24 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
-సాగర్‌కు నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో
-అంతే మొత్తంలో దిగువకు
-తుంగభద్ర నుంచి నిలకడగా వరద
-గోదావరిలోనూ కొనసాగుతున్న ప్రవాహం

హైదరాబాద్/నాగర్‌కర్నూల్ ప్రతినిధి/ జోగుళాంబ గద్వాలజిల్లా ప్రతినిధి/ భద్రాద్రి కొత్తిగూడెం ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ నందికొండ: ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నెలరోజుల్లో రెండోసారి ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లెత్తారు. జూరాలకు ఎగువన నారాయణపుర నుంచి భారీ ఇన్‌ఫ్లోలు వచ్చి చేరుతున్నాయి. అక్కడి నుంచి విడుదలవుతున్న జలాలకు తుంగభద్ర నీళ్లు తోడవడంతో ఐదు రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువ నుంచి తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు అప్పర్ తుంగ, భద్ర నదులకు వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అప్పర్ తుంగ, భద్ర ప్రాజెక్టుల నుంచి తుంగభద్ర జలాశయానికి వరద జలాలను విడుదల చేస్తున్నారు. మంగళవారం టీబీ డ్యాం నుంచి 71,728 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2.77లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 63 వేల క్యూసెక్కుల జలాలు శ్రీశైలానికి చేరుతుండటంతో ప్రాజెక్టు గరిష్ఠ మట్టం 885 అడుగులకుగాను 884 అడుగులకు చేరుకున్నది.

krishna-basin2
సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జలాశయం 4 గేట్లు ఎత్తిన అధికారులు.. రాత్రికి మరో రెండు గేట్లు ఎత్తి మొత్తం ఆరుగేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు సుమారు 3.19 లక్షల క్యూసెక్కులను విడుదలచేస్తున్నారు. దీనితో పాటు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రం ద్వారా 29,498 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ సీజన్‌లో భారీ వరదతో శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇప్పటివరకు 680 టీఎంసీల వరకు జలాలు చేరాయి. శ్రీశైలం నుంచి చేరుకున్న జలాలతో నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. మంగళవారం ఎన్నెస్పీ అధికారులు ప్రాజెక్టు 24 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 3,59,352 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. శ్రీశైలం నుంచి 4,13,239 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా క్రస్ట్‌గేట్లతోపాటు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, ఎడమ, కుడి, వరద, ఎస్సెల్బీసీ కాల్వల ద్వారా అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతలలోనూ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

krishna-basin3

ఆల్మట్టికి వరద తగ్గుముఖం

ఎగువ నుంచి ఆల్మట్టికి వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం 1.80 లక్షల క్యూసెక్కుల వరద నమోదు కాగా.. సాయంత్రం ఆరు గంటల సమయానికి 1.35 లక్షలకు తగ్గింది. దీంతో కర్ణాటక అధికారులు రిజర్వాయర్‌లో నిల్వలను పెంచుతూ అవుట్‌ఫ్లోను భారీగా తగ్గించారు. సాయంత్రం ఆరు గంటలకు 45 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదయింది. రెండు లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో ఉన్న నారాయణపుర జలాశయానికి కూడా సాయంత్రానికి 80 వేల క్యూసెక్కులకు తగ్గింది. అయితే, ఎగువన వరద తగ్గుముఖం పట్టినప్పటికీ బేసిన్‌లో దిగువన ప్రాజెక్టులకు మరో నాలుగైదురోజుల వరకు ఇన్‌ఫ్లోలు భారీగానే ఉండే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. గోదావరిలోనూ వరద ఉధృతి భారీగానే కొనసాగుతున్నది.శ్రీరాంసాగర్‌కు 9,850 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి లోయర్‌మానేరుకు జలాల తరలింపు కొనసాగుతున్నది.

సాయంత్రం ఆరు గంటల సమయానికి లోయర్‌మానేరుకు ఇన్‌ఫ్లో 2,892 క్యూసెక్కులుగా ఉన్నది. భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నది. మంగళవారం సాయం త్రం 4 గంటలకు 40.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్నది. తాలిపేరు ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి 6,050 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు చేరుతున్నది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 406.4 అడుగులుగా ఉన్నది. ఎగువ నుంచి మరింత నీరువచ్చి చేరే అవకాశం ఉండటంతో రాత్రికి గేట్లు ఎత్తవచ్చని అధికారులు తెలిపారు. పేరూరు గ్రామం దగ్గర గోదావరి 12.35 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. ధవళేశ్వరం దగ్గర ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలు 13.22 లక్షల క్యూసెక్కుల స్థాయిలో ఉన్నాయి.
projects

2757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles