శ్రీరాంసాగర్‌తో సిరులు

Tue,February 19, 2019 03:27 AM

-కాకతీయ కాల్వ మరమ్మతులపై సర్కారు దృష్టి
-రూ.వెయ్యి కోట్లతో చురుగ్గా సాగుతున్న పనులు
-జూన్ నుంచి పూర్తి ఆయకట్టుకు నీరందించేలా చర్యలు

కే ప్రకాశ్‌రావు, కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వచ్చే వానకాలం (ఖరీఫ్) సీజన్ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సిరులు కురిపించనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నిర్ధారిత ఆయకట్టు మొత్తానికి సాగునీరిచ్చేందుకు అధికార యంత్రాంగం శరవేగంగా పనులు చేస్తున్నది. ఐదు దశాబ్దాల చరిత్రలో నాలుగైదు లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి సాగునీరివ్వని ఈ ప్రాజెక్టు.. వచ్చే వర్షాకాలం సీజన్ నుంచి 14లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరందించి రికార్డు సృష్టించే అవకాశం ఉన్నది.

పట్టించుకోని నాటి పాలకులు

1970లో 112 టీఎంసీల సామర్థ్యంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు స్టేజీ-1 కింద పూర్వ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 9,68,640 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఇందులో సు న్నా నుంచి 146 కి.మీ. వరకు (ఎగువ ఎల్‌ఎండీ) పరిధిలో 4,62,920 ఎకరాలు, 146 నుంచి 284 కి.మీ. (దిగువ ఎల్‌ఎండీ) పరిధిలో 5.05 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. స్టేజీ- 2 కింద 284 నుంచి 346 కి.మీ. పరిధిలో ఉన్న 3.98 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని నిశ్చయించారు. ప్రాజెక్టు విషయంలో సమైక్య పాలకులు ఆదినుంచి నిర్లక్ష్యం చూపారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా మహారాష్ట్ర సర్కారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న గోదావరిపై భారీ చెక్‌డ్యాంలు, బరాజ్‌లు నిర్మించింది. దీంతో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతూ వచ్చింది. వాస్తవానికి కాకతీయకాల్వ సామ ర్థ్యం 8500 క్యూసెక్కులు. ఆ సామర్థ్యంతో నీటిని విడుదలచేస్తేనే చివరి ఆయకట్టుకు నీరు వెళ్తుంది. కానీ, నాటి పాలకులు 4వేల క్యూసెక్కులకు మించి నీరు విడుదలచేయలేదు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో పనుల్లో వేగం

స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇటీవల శ్రీరాంసాగర్‌పై సమీక్షించిన ఆయన.. కాళేశ్వ రం ఎత్తిపోతలను జూన్‌నాటికి పూర్తిచేసి.. ఆ జలాలను మధ్యమానేరు ప్రాజెక్టుకు తరలించాలని ఆదేశించారు. వచ్చే వానకాలం పంట నుంచి శ్రీరాంసాగర్ స్టేజీ-1, 2తో పాటు అనుసంధానంగా ఉన్న 14.40 లక్షల ఎకరాలకు సాగునీరందించే దిశగా పనుల్లో వేగం పుంజుకున్నది. ప్రాజెక్టు కాకతీయ కాల్వ ఆధునీకరణకు సైతం శ్రీకారం చుట్టారు. కాల్వ సామర్థ్యం మేరకు నీళ్లివ్వాలంటే యాభై శాతానికిపైగా పాడైన కెనాల్‌ను బాగుచేయాలని అధికారులు ప్రభుత్వం దృష్టికితెచ్చారు. ఆమేరకు రిటైర్డు, ప్రస్తుత ఇంజినీర్లతో కలిపి ప్రభుత్వం గతంలో ఒక కమిటీని నియమించింది. కాల్వలను సందర్శించిన కమిటీ.. చేపట్టాల్సిన ఆధునీకరణ పనులపై నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా ప్రభుత్వం రూ.వెయ్యికోట్లతో పనులు చేపట్టింది. కాకతీయకాల్వ 0 నుంచి 146 కి.మీ. వరకు రూ.వంద కోట్లతో, 146 నుంచి 284వరకు రూ.774 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో కొన్ని పనులు పూర్తికాగా, మిగిలినవి మేలోపు పూర్తిచేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సర్కారు చర్యలతో సాగునీరు

కాళేశ్వరం నీటిని వరదకాల్వ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎత్తిపోసే ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో వర్షాలు లేక గోదావరి ఎగువ నుంచి ఎస్పారెస్పీకి నీరు రాకపోయినా.. పునర్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్‌కు యాభై టీఎంసీల నీటిని పంపింగ్ చేసి సాగు నీరివ్వనున్నారు. శ్రీరాంసాగర్ స్టేజీ-1 కింద గతంలో నాలుగైదు లక్షల ఎకరాలకు మించి సాగునీరివ్వలేదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన చర్యల వల్ల 2016-17లో వానకాలంలో 2లక్షలు, రబీలో 4.71 లక్షలు మొత్తం కలిపి 6.71 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. స్టేజీ -1 కింద 2016-17లో 68.75 శాతం భూములకు నీరందించినట్టు అధికారులు చెప్తున్నారు. వచ్చే వానకాలంలో ప్రాజెక్టు పరిధిలోని స్టేజీ-1, 2 పరిధిలోని పూర్తిఆయకట్టుకు సాగునీరందే అవకాశాలు ఉన్నాయి.

sri-ram-sagar2

మే నాటికి అన్ని పనులూ పూర్తిచేస్తాం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కా ల్వల ఆధునీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తు న్నాం. వచ్చే వానకాలం నుంచి నిర్ధారిత ఆయకట్టుకు నీరందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏప్రిల్, మే చివరినాటికి అన్ని పనులు పూర్తిచేసి నిర్ధారిత ఆయకట్టుకు నీరందిస్తాం.
- శంకర్, ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్

3120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles