కాళేశ్వర శ్రీరాంసాగరం!

Wed,December 4, 2019 02:51 AM

-చరిత్రలో మొదటిసారి పూర్తి ఆయకట్టుకు సాగునీరు
-వానకాలం ముగిసినా నిండుకుండలా జలాశయం
-శ్రీరాంసాగర్‌కు జీవంపోసిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
-తెలంగాణ గడ్డపై ఇప్పటికీ నీటినిల్వలు 200 టీఎంసీల పైమాటే
-కాళేశ్వరం, పునర్జీవ పథకంతో వచ్చేఏడాది భారీ వినియోగం

శ్రీరాంసాగర్.. ఆరు దశాబ్దాల్లో నాటి పాలకులు గోదావరిపై తెలంగాణకు విదిల్చిన ఏకైక ప్రాజెక్టు. పేరుకు పద్నాలుగు లక్షల ఆయకట్టు ఉన్నా ఏనాడూ ఐదారు లక్షలకు మించి పారింది లేదు. కాల్వల్లో 3-4 వేల క్యూసెక్కుల ప్రవాహం పోయిందీ లేదు. కానీ, ప్రాజెక్టు చరిత్రలో ఈ ఏడాది తొలిసారి పద్నాలుగు లక్షల ఎకరాల పూర్తి ఆయకట్టుకు సాగునీరందింది. వానకాలం సీజన్ ముగిసినా జలాశయం నేటికీ నిండుకుండలా ఉన్నది. ఒకవేళ నిల్వలు తగ్గినా మళ్లీ జీవంపోసేందుకు శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం సిద్ధంగా ఉన్నది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వల్లనే ఇదంతా సాధ్యమయిందని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం శ్రీరాంసాగర్ చరిత్రను మార్చింది. ప్రాజెక్టు అలంకారప్రాయం కాదు.. ఆయకట్టును ఆకుపచ్చ మాగాణంగా మార్చే వరప్రదాయిని అని నిరూపించింది. తెలంగాణ ఏర్పడేనాటికి ఎస్సారెస్పీ సాగునీటి నిర్వహణ సక్రమంగా ఉండేది కాదు. ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుందో.. నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో.. ఎంత ఆయకట్టుకు నీరందుతుందో.. ఏదీ తెలియని పరిస్థితి. కానీ, తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత ప్రాజెక్టు సాగునీటి నిర్వహణపై దృష్టిసారించింది. ఎగువ నుంచి వచ్చే వరదతో సాధ్యమైనంత మేరకు ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ఏర్పాట్లు చేసింది. ఒకవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను పరుగులు పెట్టిస్తూనే.. మరోవైపు ఎస్సారెస్పీ కాల్వల్ని బాగుచేసింది. ఎగువనుంచి చుక్కనీరు రాకున్నా ఆయకట్టుకు ఢోకాలేకుండా ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్నీ సిద్ధం చేసింది. ఈ బహుముఖ వ్యూహం వల్ల ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. సాధారణంగా ఎగువనుంచి శ్రీరాంసాగర్‌కు భారీ ఎత్తున వరద వచ్చినా 90 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. ఆ నీటిని సాగుకు విడుదల చేస్తే మళ్లీ వచ్చే ఏడాది ఎగువ నుంచి వరద వచ్చేవరకు ఎదురు చూడాల్సి వచ్చేది.

రాత మార్చిన కాళేశ్వరం..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం శ్రీరాంసాగర్ ఆయకట్టు దశను మార్చివేసింది. ఎగువనుంచి చుక్కనీరులేని సమయంలో కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీటిని శ్రీరాజరాజేశ్వర జలాశయం.. ఆపై లోయర్‌మానేరు, తద్వారా ఎల్‌ఎండీ దిగువన ఉన్న ఆయకట్టుకు సాగునీరందింది. గోదావరి ఎగువనుంచి వరద మొదలవడంతో ఎస్సారెస్పీ జలాశయాన్ని నింపి ఎల్‌ఎండీ ఎగువన ఉన్న ఆయకట్టుకు నీరందించారు. యాసంగిలోనూ ఎస్సారెస్పీపై భారా న్ని మోపకుండా.. కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీటిని ఎల్‌ఎండీ దిగువన ఉన్న ఆయకట్టుకు పుష్కలంగా అందిస్తున్నారు. ఎల్‌ఎండీ ఎగువనున్న ఆయకట్టుకు మాత్రమే శ్రీరాంసాగర్‌లోని జలాలను వాడుతున్నారు. దీంతో మంగళవారానికి కూడా శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 90.31 టీఎంసీలకుగాను 89.76 టీఎంసీలు ఉన్నాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం అందుబాటులోకి రావడంతో జలాశయం ఖాళీ అయినా కాళేశ్వరం నుంచి నీటిని తరలించే ఆస్కారం ఏర్పడింది.

మొదలైన కాళేశ్వర శకం

గతంలో గోదావరిలో పుష్కలమైన ఇన్‌ఫ్లోలు ఉన్నప్పటికీ నీటినిల్వగానీ, వినియోగంగానీ 90-100 టీఎంసీలకు మించకపోయేది. కానీ ఇప్పుడు వానకాలం సీజన్ ముగిసి.. యాసంగి పంటలు విస్తారంగా సాగవుతున్నా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికిప్పుడు శ్రీరాంసాగర్‌లో దాదాపు 90 టీఎంసీలు, శ్రీరాజరాజేశ్వర జలాశయంలో 20.01 టీఎంసీల నిల్వ ఉన్నది. లోయర్‌మానేరులో 18, కడెంలో 7.37, ఎల్లంపల్లిలో 16.14 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. లక్ష్మీ బరాజ్‌లో 4.50, సరస్వతి బరాజ్‌లో 7.60, పార్వతి బరాజ్‌లో 5.70 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. అన్ని ప్రాజెక్టుల పరిధుల్ల్లో చెరువులనూ నింపడంతో మరో 40-50 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. మధ్యతరహా ప్రాజెక్టులను పరిగణలోనికి తీసుకుంటే నీటినిల్వ పరిమాణం 200 టీఎంసీలు పైగానే ఉన్నది. అయితే మంజీరాకు ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో సింగూరు, నిజాంసాగర్‌లో ఆశించిన స్థాయి లో నీటినిల్వలు లేవు. వచ్చే రెండేండ్లలో వీటికీ పునర్జీవం కల్పించడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరిన్ని రిజర్వాయర్లు అందుబాటులోకి రానున్నాయి. దీం తో తెలంగాణ గడ్డపై గోదావరిజలాలను ఒడిసిపట్టే సామర్థ్యం మరింతగా పెరుగనున్నది.

3555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles