ఉద్యోగులకు న్యాయం చేస్తాం


Wed,June 12, 2019 02:52 AM

srinivas goud attends tgo meeting

-సీఎం కేసీఆర్‌తో సమావేశమవుదాం
-తెలంగాణ అధికారులు అంటే గర్వపడేలా పనిచేయాలి
-తప్పుదోవ పట్టించేవారిని నమ్మవద్దు
-టీజీవో కార్యవర్గ సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యోగుల సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, పురావస్తుశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యక్తంచేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై అన్ని సమస్యలపై కూలంకషంగా చర్చించి పరిష్కరించుకొందామని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో ఉద్యోగవర్గాలకు ఎలాంటి అన్యాయం జరుగదని స్పష్టంచేశారు. మంగళవారం టీజీవో భవన్‌లో జరిగిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కోటి ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ భుజస్కంధాలపై ఎత్తుకొన్నారని, ఆ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఇంతటి బృహత్తర కలల ప్రాజెక్టును పూర్తిచేసేందుకు దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాతనే మిగతా పాలనాపరమైన వ్యవహారాలు చూసేలా ఉన్నట్టు కనిపిస్తున్నారని అన్నారు.

త్వరలోనే సీఎం కేసీఆర్‌తో సమావేశమవుదామని మంత్రి హామీఇచ్చారు. స్వరాష్ట్రంలో అడగకముందే పీఆర్సీ, ఐఆర్‌తోపాటు ఇతర అవసరాలు గుర్తించి, తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సమైక్య పాలనలో ఉద్యోగులు తలవంచుకొని బతికేవారు కాగా, ఇప్పుడు సగౌరవంగా తలెత్తుకొని బతుకుతున్నారని చెప్పారు. ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉన్నదని, అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివారిని దగ్గరకు రానీయవద్దని, వారి మాటలను నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీవో సెంట్రల్ యూనియన్ ప్రతినిధులు విష్ణువర్ధన్‌రావు, సహదేవ్, రవీందర్‌కుమార్, రవీందర్‌రావు, అరుణ్‌కుమార్, సుజాత, వెంకటయ్య, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, లక్ష్మణ్‌గౌడ్, జగన్మోహన్‌రావు, పీఎస్ ఫణికుమార్, నవీనజ్యోతి, సావిత్రి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ మమత, సత్యనారాయణకే పగ్గాలు

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలిగా వీ మమత, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ మరో మూడేండ్లపాటు కొనసాగేలా ఏకగ్రీవంగా ఎన్నుకొంటూ చేసిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే శ్రీనివాస్‌గౌడ్‌కు క్యాబినెట్ మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం చేశారు. అనంతరం మమత, సత్యనారాయణకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నియామకపత్రాలు అందజేశారు.

1437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles