చట్టసభల కంప్యూటరీకరణపై స్పీకర్ల కమిటీ

Thu,October 10, 2019 02:29 AM

-ఏడుగురు సభ్యులతో ఏర్పాటుచేసిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా
-సభ్యుడిగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-కమిటీ చైర్మన్‌గా అసోం స్పీకర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: చట్టసభల కంప్యూటరీకరణపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఏడుగురు అసెంబ్లీ స్పీకర్లతో కమిటీని నియమించారు. ఈ కమిటీలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్థానం కల్పించారు. అసోం స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో.. పోచారంతోపాటు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, పాండిచ్చేరి స్పీకర్లు సభ్యులుగా ఉన్నారు. కమిటీ త్వరలో ఢిల్లీలో లేదా అసోంలో సమావేశమవుతుందని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు తెలిపారు. ఇప్పటికే అన్ని చట్టసభల కంప్యూటరీకరణ జరిగినప్పటికీ ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ఈ కమిటీ నివేదిక దోహదం చేయనున్నది. శాసనసభల పనితీరును ఏ విధంగా మెరుగుపర్చవచ్చు, సభ్యులకు ఏవిధంగా మెరుగైన సేవలు అందించవచ్చు అనే అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేయనున్నది. దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని రూపొందించేందుకు ఈ కమిటీ తగిన సలహాలు, సూచనలు ఇవ్వనున్నది. ఈ సూచనలను అన్ని రాష్ర్టాల అసెంబ్లీలతోపాటు, పార్లమెంట్ ఉభయసభల్లోనూ అమలుచేయనున్నారు. సభ్యులకు ప్రశ్నలకు సమాధానాలు, చర్చలు, సభ్యులకు అవసరమైన సమాచారాన్ని మొత్తాన్ని ఐటీ ద్వారా అందించడంతో వారి సమయాన్ని ఆదా చేయవచ్చని నిర్ణయించారు. కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి అసెంబ్లీ ప్రత్యక్షప్రసారాలు, బులెటిన్ విడుదల, ప్రశ్నలకు సమాధానాలు తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్నారు.

70
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles