త్వరలో కొత్త స్టాంపుల చట్టం!


Sun,June 16, 2019 03:27 AM

Soon the new stamp act!

-ఇప్పటికీ కొనసాగుతున్న 1899, 1908 నాటి చట్టాలు
-అక్రమార్కులకు ఆయుధంగా చట్టంలోని లొసుగులు
-సమగ్ర చట్టానికి ముసాయిదా రూపొందించిన అధికారులు
-మూలనపడిన ముసాయిదా దుమ్ము దులుపాలని నిర్ణయం

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాలంచెల్లిన రెవెన్యూ చట్టాలను మార్చి ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో బ్రిటిష్ వారసత్వంగా వచ్చిన స్టాంపుల చట్టంపై రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు. పాత చట్టాల్లోని లోపాలను సవరించి సమగ్ర చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని అధికారులు గుర్తించారు. 1899లో రూపుదిద్దుకున్న ఇండియన్ స్టాంప్స్ యాక్ట్, 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను అనుసరించే ఇప్పటికీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ చట్టంలోని లోపాలను ఆసరా చేసుకుని కొందరు ప్రభుత్వ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసి అవినీతికి పాల్పడుతున్నారు. కూకట్‌పల్లి, మియాపూర్, బాలానగర్‌లో భారీఎత్తున వెలుగుచూసిన అక్రమాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మార్కెట్ విలువలను మదింపుచేయడంలో రిజిస్ట్రేషన్ అధికారులకు ఉన్న విచక్షణాధికారం వల్ల బడాబాబులు బాగుపడి సర్కార్ ఖజానాకు గండిపడుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్ రాష్ర్టాలు ఇప్పటికే కొత్త చట్టాలను రూపొందించుకొన్నాయి.

కొత్త చట్టం ప్రతిపాదనపై దృష్టి

పాత చట్టంలోని లోపాలను సవరించి సమగ్ర చట్టాన్ని రూపొందించాలని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తొలినాళ్లలోనే సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుత జాయింట్ కమిషనర్ వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలోని కమిటీ రూపొందించిన కొత్త చట్టం ముసాయిదాలో అక్రమాల నివారణకు కొన్ని కఠిన నిబంధనలను చేర్చారు. స్టాంప్ డ్యూటీని తగ్గించేందుకు విలువను తక్కువ చేసి చూపడం, బ్యాంకు రుణం కోసం ఎక్కువ చేసి చూపడానికి ఉన్నతాధికారులు తమ విచక్షణ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని నివారించేందుకు బ్యాంకుల సహకారం తీసుకోవాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. మార్టిగేజ్ డీడ్, టైటిల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్ డీడ్, రిజిస్ట్రేషన్లపై రకరకాలుగా ఉన్న ఫీజులను హేతుబద్ధం చేయాలని, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ, డెవలప్‌మెంట్ ఆఫ్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ వంటి విధానాల్లో మార్పులు తేవాలని నిర్ణయించారు. ఆడిటర్ జనరల్ నిబంధనల్లోని అయోమయాన్ని తొలగించడం వంటి పలు అంశాలకు కొత్త చట్టంలో చోటిచ్చారు.

గతంలో ఈ దిశగా కొంత ప్రయత్నం జరిగినా ఉన్నతాధికారులు చట్టాన్ని ప్రభుత్వ ఆమోదానికి పంపకపోవడంతో ముసాయిదా మూలన పడింది. ఏడాదిపాటు శ్రమించి తెలంగాణ స్టాంపుల ముసాయిదా చట్టంను సిద్ధంచేసినా.. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా అది చట్టరూపం దాల్చలేదు. పూర్తిస్థాయి కమిషనర్, ఐజీగా బాధ్యతలు చేపట్టిన టీ చిరంజీవులు.. రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలను చేపట్టి పకడ్బందీగా అమలుచేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఈ క్రమంలో కొత్త చట్టం ప్రతిపాదనకు రూపమివ్వడంపై కూడా దృష్టి సారించినట్టు తెలిసింది.

2974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles