ఉపాధి హామీలో అవార్డుల పండుగ


Tue,September 11, 2018 01:38 AM

Six Employment Guarantee Awards for telangana

-తెలంగాణకు ఆరు ఉపాధి హామీ అవార్డులు
-నేడు ఢిల్లీలో అందుకోనున్న అధికారులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉపాధి హామీ పథకం కూలీలకు చేతినిండా పని కల్పించిన తెలంగాణ రాష్ర్టానికి అవార్డుల పంట పండింది. ఈ ఆర్థిక సంవత్సరం కేంద్రం విధించిన టార్గెట్‌లో మొదటి ఆరు నెలల్లోనే 95 శాతం లక్ష్యాన్ని సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణ, కూలీలకు పని కల్పించడంలో ముందంజలో నిలిచిన రాష్ర్టానికి మొత్తం ఆరు అవార్డులు దక్కాయి. పారదర్శకత, నిధులు వెచ్చించడం, రికార్డుల నిర్వహణలో రెండు అవార్డులు దక్కాయి. ఉపాధి నిధుల వినియోగంలో కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెండు అవార్డులు వచ్చాయి. సిద్దిపేట జిల్లా ఇబ్రంహీంపూర్ గ్రామం ఉపాధి పనుల్లో ఉత్తమ పంచాయతీగా ఎన్నికైంది. ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించడంలో సంగారెడ్డి డివిజన్‌లోని మక్తాలకా్ష్మపూర్ పోస్టుమాస్టర్‌కు ఉత్తమ అవార్డు వచ్చింది. ఈ అవార్డులను మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు అందుకోనున్నారు.

మరిన్ని పనిరోజుల కోసం లేఖ

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 23.4 లక్షల కుటుంబాల్లోని 39.1 లక్షల కూలీలకు ఉపాధి పనులు కల్పించారు. రాష్ర్టానికి 10 కోట్ల పనిరోజులు టార్గెట్ ఉండగా.. ఇప్పటివరకు 9.56 కోట్ల పనిరోజులు కల్పించారు. మొత్తం 95.6 శాతంగా కేంద్రం రికార్డుల్లో నమోదైంది. ఒక్కోకూలీకి సగటున రోజుకు రూ.143.12 చొప్పున వేతనం అందింది. ఆర్థికసంవత్సరం ఆరునెలలు ఉండగానే ఈ రికార్డును సాధించిన రాష్ట్రంగా తెలంగాణ ముందువరుసలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనిరోజుల టార్గెట్ పూర్తి కావస్తుండటంతో.. మరిన్ని కోట్ల పనిరోజులు అదనంగా ఇవ్వాలని కోరుతూ గ్రామీణాభివృద్ధిశాఖ కేంద్రానికి లేఖ రాసింది.

గ్రామీణాభివృద్ధిశాఖకు రూర్బన్ అవార్డు

రూర్బన్ పథకం అమలులో ముందంజలో ఉన్న తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖకు కేంద్రం అవార్డు ప్రకటించింది. గ్రామాల్లో పట్టణ వసతులు కల్పించే లక్ష్యంతో శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం కింద కేంద్రం అందిస్తున్న ఆర్థికసాయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న రాష్ర్టాల్లో మూడోస్థానంలో నిలిచిన తెలంగాణ ఈ అవార్డుకు ఎంపికయింది. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, స్పెషల్ కమిషనర్ ఆశా ఈ అవార్డును అందుకోనున్నారు.

సున్నపురాయి నిక్షేపాలకు మూడు అవార్డులు

ఖనిజ పర్యావరణం, మినరల్ కన్వర్షన్ కౌన్సిల్(ఎంఈఎంసీ) అందించే అవార్డుల్లో రాష్ట్రానికి చెందిన సున్నపురాయి నిల్వలకు మూడు అవార్డులు దక్కాయని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ మల్సూరు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈఎంసీ హైదరాబాద్ రీజియన్ 2017-18గాను మంచిర్యాల జిల్లా దేవాపూర్ సున్నపురాయి నిక్షేపానికి మూడు అవార్డులను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ బ్యూరోఆఫ్‌మైన్స్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ఎంపిక జరిగింది. పునరుద్ధరణ, పునరావాసం నిర్వహణ విభాగంలో మొదటి, వ్యర్థాల డంపింగ్ నిర్వహణలో రెండోస్థానం దక్కగా.. ఓవరాల్ ప్రైజ్ కూడా దేవాపూర్ సున్నపురాయి నిక్షేపానికి దక్కింది. త్వరలో అవార్డులు అందించనున్నారు.

పోచంపల్లి అర్బన్ బ్యాంక్‌కు రెండు జాతీయ అవార్డులు

భూదాన్ పోచంపల్లి: కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకు ఏటా బ్యాంకింగ్ ప్రాటియర్స్ ముంబైవారు అందించే ప్రతిష్ఠాత్మకమైన రెండు జాతీయ అవార్డులు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి అర్బన్ బ్యాంకుకు వచ్చాయని ఆ బ్యాంకు సీఈవో సీత శ్రీనివాస్ చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ 2017-18 సంవత్సరానికి గాను బెస్ట్ ఎన్పీఏ మేనేజ్‌మెంట్, బెస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ అవార్డులు లభించాయని తెలిపారు. ఈ అవార్డులను ఆదివారం ఢిల్లీలో కోఆపరేటివ్ బ్యాంకు సమ్మేళనం-2018లో చైర్మన్ చిట్టిప్రోలు శ్రీనివాస్‌తోపాటు పాలకవర్గం సభ్యులు అందుకున్నారని చెప్పారు. వరుసగా ఏడుసార్లు వివిధ క్యాటగిరీల్లో ఈ అవార్డులను పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంకు కైవసం చేసుకున్నదని వివరించారు.

కూలీలకు పని కల్పించడంలో రాజీలేదు

ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకు న్నాం. కూలీలకు చేతినిండా పనికల్పించడంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ కార్యాలయాల నిర్మాణాలను పూర్తిచేస్తున్నాం. కూలీల వేతనాల విడుదలలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. కూలీలకు పని కల్పించడంలో చేసిన కృషికి అవార్డులు దక్కాయి.
-మంత్రి జూపల్లి కృష్ణారావు

946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles