యాసంగికి 7.77 లక్షల టన్నుల యూరియా!

Thu,October 10, 2019 03:33 AM

-సరఫరా కోసం కేంద్రానికి మంత్రి నిరంజన్‌రెడ్డి వినతి
-అక్టోబర్‌లో కేటాయించిన యూరియాను 20లోగా పంపాలని విజ్ఞప్తి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యాసంగి సీజన్‌లో రైతుల అవసరాలు తీర్చడానికి 7.77 లక్షల టన్నుల యూరియాను కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి సదానంద గౌడను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది వానకాలం సీజన్ ఆలస్యమైందని.. ఆ తర్వాత వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాగునీటి ప్రాజెక్టులు నిండి సాగువిస్తీర్ణం పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని వివరించారు. వరి, ఇతర ప్రధాన పంటలు సాధారణం కం టే.. 132 శాతం వరకు సాగు నమోదయినట్లు చెప్పారు. యాసంగిలో ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నదన్నారు. ప్రాజెక్టులు, చెరువులు బాగా నిండటంతో యాసంగి సీజన్‌లో ఎరువుల వినియోగం మరింత ఎక్కువగా ఉండవచ్చని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గతంలో విజ్ఞప్తి చేసిన మేరకు 7.7 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కోరారు. దీంతోపాటు అక్టోబర్ నెలకు కేటాయించిన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఈనెల 20 లోగా పంపించాలని విజ్ఞప్తిచేశారు. సెప్టెంబర్ నెలకు సరిపడా ఎరువులను సరఫరాచేసినందుకు కేంద్రమంత్రికి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 7.7 లక్షల టన్నుల యూరియా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం స్పందించి ఇప్పటివరకు ఏడు లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. దిగుమతి చేసుకొన్న యూరియా కాకుండా.. స్థానికంగా తయారైన యూరియా సరఫరాచేయాలని మంత్రి కేంద్ర మంత్రి సదానందగౌడను కోరారు.

2020 నాటికి రామగుండం ట్రయల్న్ ప్రారంభం: కేంద్రమంత్రి సదానందగౌడ

మార్చి 2020 వరకు రామగుండం ఎరువుల కర్మాగారం ట్రయల్న్ అవుతుందని.. ఆ తర్వాత వానకాలం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు అక్కడి నుంచే ఎరువులు సరఫరా చేస్తామని కేంద్రమంత్రి సదానందగౌడ హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రప్రభుత్వం ఎరువులను సరఫరాచేసేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. కేంద్రమంత్రిని కలిసినవారిలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, అదనపు సంచాలకుడు విజయ్‌కుమార్ ఉన్నారు.

328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles