24 గంటలు.. 33 ప్రసవాలు


Thu,July 12, 2018 07:16 AM

Siddipet Doctor successfully performs 33 deliveries within 24 hours

- సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో రికార్డు
-17 మందికి నార్మల్.. 16 మందికి సిజేరియన్లు
-17 మంది ఆడబిడ్డలు, 16 మంది మగబిడ్డల జననం
-తల్లీబిడ్డలంతా ఆరోగ్యంగా ఉన్నారన్న వైద్యాధికారులు
-కేసీఆర్ కిట్లతో సర్కారు దవాఖానల్లో పెరుగుతున్న ప్రసవాలు
-జిల్లాలో 13 నెలల్లో 12,035 డెలివరీలు.. బాలింతలకు రూ.10 కోట్ల ఆర్థికసాయం

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: 24 గంటల్లో 33 ప్రసవాలు.. 17 సాధారణ ప్రసవాలు, 16 సిజేరియన్లు .. ఒక ప్రభుత్వ దవాఖాన సృష్టించిన రికార్డు ఇది. తల్లీ పిల్లలు అంతా క్షేమం.. అందరి ముఖాల్లోనూ ఆనందం. కొంతకాలం క్రితం వరకు ఇలాంటి వార్త ఊహించడమే విడ్డూరంగా అనిపించేది. ఇప్పుడు అబ్బురంగా కనిపిస్తున్నది. సిద్దిపేట దవాఖాన సాధించిన విజయమిది. స్వపరిపాలనలో తెలంగాణ వైద్యరంగానికి పూర్వవైభవం వచ్చిన సందర్భమిది. సర్కారు దవాఖానలంటేనే జంకే రోజుల నుంచి.. పోతే అక్కడికే వెళ్లాలనే రోజులను తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణకు లభించిన ఫలితమిది. కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి, కేసీఆర్ కిట్లు అందించి.. అత్యాధునిక వైద్యాన్ని సామాన్యుల చెంతకు తెచ్చిన ప్రభుత్వ ఘనత ఇది. ఒక్క రోజే.. 33 ప్రసవాలను విజయవంతంగా నిర్వహించడం వంటి అసాధారణ రికార్డును సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన వైద్యులు సాధించారు. ఇది ప్రభుత్వ వైద్యంపై, ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు కలిగిన అపార నమ్మకానికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్.. సూపర్ హిట్
అయింది.

కార్పొరేట్ స్థాయి వసతులతో ఆకట్టుకుంటున్న సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్నది. మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో 33 ప్రసవాలు జరిగాయి. ఇందులో 17 సాధారణ ప్రసవాలు కాగా, 16 సిజేరియన్లు ఉన్నాయి. సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన చరిత్రలో ఇది సరికొత్త రికార్డని వైద్యాధికారులు తెలిపారు. 33 ప్రసవాల్లో 17 మంది ఆడబిడ్డలు, 16 మంది మగబిడ్డలు పుట్టారని, తల్లీ బిడ్డలంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. సర్కారు దవాఖానల్లో ప్రసవించిన వారందరికీ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను అందజేస్తున్నది. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12 వేలు ఆర్థికసాయం చేస్తున్నది. సిద్దిపేటలో ప్రభుత్వ దవాఖానతోపాటు గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, నంగునూరు సీహెచ్‌సీలు, పలు పీహెచ్‌సీలున్నాయి. జూన్ 2017 నుంచి 2018 జూలై 10 వరకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 12,035 ప్రసవాలు జరిగాయి. ఇందులో 5,247 సాధారణ ప్రసవాలు కాగా, 6,788 సిజేరియన్లు. వీటిలో 10,343 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేసినట్టు వైద్యశాఖ అధికారులు చెప్పారు. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా బాలింతలకు ఆర్థికసాయం కింద రూ.10 కోట్లను ప్రభుత్వం వారిఖాతాల్లో జమచేసింది.
KCRKIT1

జూన్ 2017 నుంచి 2018 జూలై 10 వరకు జరిగిన ప్రసవాలు

-సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో 5,997 ప్రసవాలు జరిగాయి. ఇందులో 2,010 సాధారణ ప్రసవాలు కాగా, 3,987 సిజేరియన్లు. ఇప్పటివరకు 5,223 కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
-గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో 3,998 ప్రసవాలు జరిగాయి. ఇందులో 1,952 నార్మల్‌కాగా, 2,046 సిజేరియన్. 3,480 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించారు.
-దుబ్బాకలో 852 డెలివరీలు జరుగగా, ఇందులో 240 నార్మల్, 612 సిజేరియన్. 730 కేసీఆర్ కిట్లను అందజేశారు.
-చేర్యాలలో 187 ప్రసవాలు జరుగగా.. అందులో 55 సాధారణం కాగా, 132 సిజేరియన్. మొత్తం 160 కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు.
-నంగునూరులో 29 డెలివరీలు కాగా.. 18 నార్మల్, 11 సిజేరియన్. 21 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు.
-జిల్లాలోని వివిధ పీహెచ్‌సీల్లో 972 ప్రసవాలు జరుగగా, 739 కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.

5370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles