ఆర్కైవ్స్ తరలింపుపై తర్జనభర్జన


Fri,July 12, 2019 01:39 AM

Shifting ancient documents poses a challenge

- సచివాలయంలో 20 లక్షల పురాతన డాక్యుమెంట్లు
- నిజాంకాలంనాటి పర్సనల్ కలెక్షన్లు..
- 1665 నాటి డాక్యుమెంట్లూ ఉన్నాయి
- ఆర్కైవ్స్‌లో భద్రంగా 1883 నాటి ఢిల్లీ గెజిట్


హైదరాబాద్,నమస్తే తెలంగాణ: ఇరవై లక్షల పురాతన డాక్యుమెంట్లు, 1665 సంవత్సరం నాటి పత్రాలు, నిజాం కాలం నాటి వ్యక్తిగత కలెక్షన్లు, 1883 నాటి ఢిల్లీ గెజిట్‌లాంటి ఎన్నో విలువైన డాక్యుమెంట్లు తెలంగాణ సచివాలయంలోని ఆర్కైవ్స్‌లో భద్రంగా ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయం తరలింపు నేపథ్యంలో ఆర్కైవ్స్ తరలింపుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. విలువైన చారిత్రక ఆధారాలు మిస్ కాకుండా ఎలా తరలించాలన్నదానిపై చర్చిస్తున్నారు. సచివాలయంలోని ఆర్కైవ్స్‌లో పురాతన డాక్యుమెంట్లు, 1960 నుంచి1980 వరకు నడిచిన సెక్రటేరియట్ డాక్యుమెంట్లు ఉన్నాయి. రాజుల కాలం నాటి రాజపత్రాలు, ఆనాటి ప్రముఖుల వ్యక్తిగత కలెక్షన్లు కూడా ఉండడం విశేషం. 1665-1667 కు చెందిన ఇంగ్లిష్ ఫ్యాక్టరీస్ ఇండియా స్టేటస్ రిపోర్ట్, 1736-1761 లలో ప్రైవేట్ డెయిరీ ఆఫ్ ఆనందరంగపిళ్లైకి చెందిన డాక్యుమెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా 1883 నాటి ఢిల్లీ గెజిట్‌ను ఇక్కడి ఆర్కైవ్స్‌లో భద్రపరిచారు.

1880 నుంచి గెజిట్స్ ఉన్నాయి. బ్రిటిష్ పాలకుల పబ్లికేషన్లు, 1869 మాన్యువల్ విశాఖపట్నం జిల్లా స్టేటస్ రిపోర్ట్, 1882-83 నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ సెన్సెక్స్ రిపోర్ట్, 1892 హిస్సార్ జిల్లా గెజిట్, 1883 అంబాలా, రోహ్‌తక్, కర్నాల్ జిల్లాల గెజిట్లు కూడా ఉన్నాయి. ఒకరి గెజిట్లు మరొకరికి ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉన్నట్టు దీనిని బట్టి అర్థమవుతున్నది. ఈ పురాతనమైన డాక్యుమెంట్లను కదిలిస్తే చెడిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. పాతకాలం కాగితాలు కొన్ని పిండిగా అవుతున్నాయి. వీటిని తరలించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్కైవ్స్ అధికారులు అంటున్నారు. తమకు అధికారికంగా సమాచారం వచ్చాక తరలింపుపై చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు.

69
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles