మరో గొలుసుకట్టు కంపెనీ గుట్టురట్టు


Thu,September 12, 2019 02:13 AM

Serfa Company MD Bucky Srinivasa Reddy arrested

- సెర్ఫా కంపెనీ ఎండీ బక్కి శ్రీనివాస్‌రెడ్డి అరెస్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ పేరుతో ప్రజలను ముంచుతున్న సెర్ఫా మనీ సర్క్యులేషన్ కంపెనీ గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టుచేశారు. సెర్ఫా కంపెనీ ఎండీ బక్కి శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం అరెస్టుచేశారు. కూకట్‌పల్లిలోని కంపెనీ కార్యాలయం నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని విశాఖకు చెందిన బక్కి శ్రీనివాస్‌రెడ్డి బీఎస్సీ కంప్యూటర్స్ చదివి రూ.13 లక్షల పెట్టబడితో క్యూనెట్ గొలుసుకట్టు కంపెనీలో చేరాడు. ఆ అనుభవంతో 2018లో విశాఖ కేంద్రంగా సెర్ఫా కంపెనీని ప్రారంభించాడు. కూకట్‌పల్లిలో కూడా బ్రాంచ్ ఏర్పాటుచేశాడు. ఐదు వేలమంది సభ్యులను చేర్చుకొని దందా సాగిస్తున్నాడు. సభ్యుడు మొదట రూ.12 వేలు చెల్లించి మరో ఇద్దరిని చేర్పించాలి. మొదటి వ్యక్తికి వెయ్యి నుంచి రెండువేల వరకు కమీషన్ ఇస్తాడు. రూ.12 వేలు చెల్లించి సెర్ఫా కంపెనీకి చెందిన వాచీలు, కాస్మోటిక్స్, విహారయాత్రల ప్యాకేజీలు కొనుగోలు చేయడంతోపాటు కొత్త సభ్యులను కూడా చేర్పించాలి.

ఇలా ఈ కంపెనీలో చేరి మోసపోయానని గుర్తించిన కన్నెకంటి తులసి ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టుచేసినట్టు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. తెలంగాణ, ఏపీ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులతోపాటు కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. ఈ కంపెనీ సభ్యులు ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, గృహిణులను లక్ష్యంగా చేసుకొన్నారని పోలీసులు వెల్లడించారు.

335
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles