అన్ని జిల్లాల్లో విత్తన మేళాలు


Sat,May 25, 2019 02:52 AM

Seeds Mela Starts In Prof Jayashankar University

-వచ్చే ఏడాదినుంచి నిర్వహణకు చర్యలు
-ఎన్నికల కోడ్ ముగిశాక రుణమాఫీ అమలు
-విత్తన మేళా-2019లో మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వచ్చే ఏడాదినుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విత్తన మేళాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం ఆవరణలో విత్తన మేళా-2019ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా, వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వీ ప్రవీణ్‌రావు, పరిశోధన సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్, విత్తన అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ కే కేశవులు తదితరులు పాల్గొన్నారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ వంటి ఎన్నో పథకాలను అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రతి ఎకరానికి నీరు అందించాలని కాళేశ్వరం, పాలమూరు వంటి ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నారని చెప్పారు.

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించడానికి 30-40 ఏండ్లు తీసుకొనేవని కానీ, కేసీఆర్ మూడేండ్లలోనే ప్రాజక్టుల్లో నీళ్లు దూకిస్తున్నారని అన్నారు. ఈ నెల 27న ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే రుణమాఫీ ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. యువత సైతం వ్యవసాయం వైపు ఆకర్షితులయ్యేలా ప్రణాళికలు అమలుచేస్తామన్నారు. మార్కెట్ పరిస్థితులను బట్టి రైతులు అన్ని పంటలు పండించాలని సూచించారు. సూచనలు చేసేందుకు కొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, విదేశాలకు ఎగుమతి చేసేందుకు నాణ్యమైన ఉత్పత్తులను పండించేలా రైతులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా సేంద్రీయ సాగుచేస్తున్న రైతుల వివరాల్ని సేకరించాలని ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావుకు మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానంచేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ఏ అవసరమొచ్చినా ఫోన్ చేయాలని, లేదంటే ఎస్‌ఎంఎస్ చేసినా స్పందిస్తానని నిరంజన్‌రెడ్డి తెలిపారు.

ఉపకులపతి పదవీకాలం పొడిగింపు

వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వీ ప్రవీణ్‌రావు పనితీరు చాలా బాగుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రవీణ్‌రావు పనితీరును మెచ్చుకొని ఉపకులపతిగా మరో మూడేండ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారని ప్రకటించారు. ఆయన పదవీకాలం జూలైతో ముగుస్తున్నా వ్యవసాయ సీజన్, ఉపకులపతి పనితీరును దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే పొడిగింపు నిర్ణయం తీసుకొన్నారని చెప్పారు. వరి, మక్కజొన్న, అపరాలలో అతిత్వరలో మరో ఎనిమిది కొత్త వంగడాల్ని విడుదల చేయనున్నట్టు ఉపకులపతి ప్రవీణ్‌రావు ప్రకటించారు. శుక్రవారం విత్తనమేళా అయిపోయినప్పటికీ శనివారం నుంచే రాష్ట్రంలోని అన్ని పరిశోధనాస్థానాల్లో రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వర్సిటీ తరఫున త్వరలోనే మళ్లీ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. విత్తన మేళాలో వివిధ రకాల విత్తనాలకు సంబంధించి 24 స్టాళ్లను ఏర్పాటుచేయగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 మంది రైతుల హాజరయ్యారు. ప్రిన్సిపల్ శాస్త్రవేత్త దామోదర్‌రాజు తదితరులు విత్తనాల గురించి రైతులకు అవగాహన కల్పించారు.

1707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles