తాత్కాలిక సీజేగా ఆర్‌ఎస్ చౌహాన్!


Sun,January 13, 2019 01:57 AM

SC recommends transfer of Telangana HC CJ to Calcutta HC

-రాధాకృష్ణన్ బదిలీ నేపథ్యంలో అత్యంత సీనియర్‌గా ఉన్న చౌహాన్‌కు అవకాశం
-అధికారికంగా వెలువడాల్సి ఉన్న ఉత్తర్వులు
-తెలంగాణ సీజేగా ప్రమాణంచేసిన పది రోజులకే రాధాకృష్ణన్ బదిలీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నియమితులయ్యే అవకాశమున్నది. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల్లో చౌహాన్ అత్యంత సీనియర్ జడ్జి. తెలంగాణ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీచేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియార్టీ విషయంలో రాధాకృష్ణన్ తర్వాత రెండోస్థానంలో ఉన్న జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ తాత్కాలిక సీజేగా వ్యవహరించే అవకాశం ఉన్నది. అయితే, అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది. ఛత్తీస్‌గఢ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన రాధాకృష్ణన్ నిరుడు జూలైలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జనవరి ఒకటి నుంచి ఉమ్మడి హైకోర్టు విడిపోవడంతో జస్టిస్ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించారు. కానీ, పదిరోజులు మాత్రమే ఆయన ఈ పదవిలో కొనసాగడం.. కలకత్తా హైకోర్టు సీజేగా బదిలీకావడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జస్టిస్ చౌహాన్ నేపథ్యం..

రాజస్థాన్‌కు చెందిన జస్టిస్ చౌహాన్ 1983లో ఢిల్లీ వర్సిటీ నుంచి న్యాయవాదపట్టా పొందారు. అదే ఏడాది రాజస్థాన్ బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదైన చౌహాన్.. ఆ రాష్ట్ర హైకోర్టులో పదేండ్లపాటు ప్రాక్టీస్‌చేశారు. 2005 జూన్ 13న రాజస్థాన్ హైకో ర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు, 2018లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తర్వాత తెలంగాణకు ఆప్షన్ ఇవ్వడంతో హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. సీనియార్టీ విషయంలో ఆయన రెండోస్థానంలో ఉన్నారు.

1159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles