మన అడవులు సురక్షితమేనా?


Mon,August 26, 2019 01:37 AM

Satellite surveillance on Telangana forests

-తెలంగాణ అడవులపై ఉపగ్రహ నిఘా
-అగ్నిప్రమాదాల నివారణకు ఎస్సెమ్మెస్ అలర్ట్‌లు
-మానవ తప్పిదాలతో మన అడవుల్లో అగ్నిప్రమాదాలు
-జీపీఎస్‌ను వినియోగించేందుకు ముమ్మర ఏర్పాట్లు
-అమెజాన్ కార్చిచ్చుతో అలర్ట్ ప్రకటించిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో అగ్నిప్రమాదాలు అతి పెద్ద సమస్యగా తయారయ్యాయి. అకస్మాత్తుగా చెలరేగుతున్న మంటలు అత్యంత విలువైన అటవీ సంపదను బుగ్గిపాలు చేయడమే కాకుండా.. పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దక్షిణ అమెరికా బేసిన్‌లోని అత్యంత విశాలమైన అమెజాన్ అడవుల్లో రగిలిన మంటలు కార్చిచ్చుగా మారి పలు దేశాలను గడగడలాడిస్తున్నాయి. కొన్ని రోజులుగా అమెజాన్ అడవిలో కొనసాగుతున్న మంటలు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో మన దేశంలోని అడవులపై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అలర్ట్ ప్రకటించింది.

వాస్తవానికి తెలంగాణతోపాటు మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆకురాల్చే అడవులు ఉన్నాయి. చెట్టు, చెట్టుకు మధ్య కొంత అంతరం ఉండటం వల్ల గ్రౌండ్‌ఫైర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విధమైన ప్రమాదాలను గుర్తించిన వెంటనే ఆర్పడానికి వీలుంటుంది. అయితే క్రౌన్‌ఫైర్ ప్రమాదాలను నిలువరించాలంటే ఏకంగా హెలికాప్టర్లనే వినియోగించాల్సి ఉంటుంది. తెలంగాణతోపాటు మన దేశంలోని చాలా అడవులు విదేశాల్లో కన్నా కొంత సురక్షితమేనని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇటీవలి కాలంలో మానవ ప్రమేయాలు, తప్పిదాల వల్ల అగ్ని ప్రమాదాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.

గ్రౌండ్‌ఫైర్ తప్పిదాలే ఎక్కువ

అడవుల్లో అగ్నిప్రమాదాలు గ్రౌండ్‌ఫైర్, క్రౌన్‌ఫైర్ అనే రకాలుగా ఉంటాయి. ఎక్కువగా జరిగే గ్రౌండ్‌ఫైర్ ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. పశువుల కాపరులు బీడీ, చుట్ట కాల్చి పడేయటం వల్ల ఎండిపోయిన ఆకులకు అంటుకొని మంటలు ఎగిసిపడటం ఒక కారణమైతే.. తునికాకు టెండర్లు దక్కించుకొన్న కొందరు కాంట్రాక్టర్లు పెద్ద సైజులో నాణ్యమైన తునికాకు రావడానికి గ్రౌండ్‌ఫైర్‌కు పాల్పడుతుంటారు. అడవుల మీదుగా వెళ్లే పర్యాటకులు, స్థానికులు వంట తయారీకోసం మంటలు రాజేసి ఆర్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. మన రాష్ట్రంలో చాలా అరుదుగా చెట్ల కొమ్మలు రాజుకొని క్రౌన్‌ఫైర్ చెలరేగడం చూడొచ్చు.

ప్రత్యేక బృందాలతో ప్రమాదాల నివారణ

వాస్తవానికి రాష్ట్రంలో జనవరి నుంచి జూన్ వరకు అడవుల్లో తరుచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకొంటాయి. అగ్నిప్రమాదాల నివారణకు తెలంగాణ అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్సీ)తో కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నది. ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. 2019 సంవత్సరాన్ని రాష్ట్ర అటవీశాఖ ఫ్రీ ఫైర్ ఇయర్‌గా ప్రకటించింది. అడవుల రక్షణకు దాదాపు 2,500 మందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను పూర్తిస్థాయిలో వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేసింది. ఎన్‌ఆర్‌ఎస్‌ఏ సహకారంతో అటవీ సిబ్బందికి సాంకేతిక పరమైన శిక్షణ ఇస్తున్నారు. ఎండాకాలంలో ఎక్కువగా ఆకస్మిక మంటలు రగులుకొనే అవకాశాలు ఉంటాయి.

రకరకాల కారణాలతో లక్షల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతవుతుంటాయి. ఫలితంగా అపారమైన వనసంపద బుగ్గిపాలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2004 నుంచి దాదాపు 14 వేల అటవీ అగ్నిప్రమాదాలు సంభవించినట్టు రికార్డులు చెప్తున్నాయి. జీపీఎస్ ద్వారా అగ్రిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించి వెంటనే మంటలు ఆర్పేందుకు అటవీశాఖ చర్యలు తీసుకొంటున్నది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అగ్నిప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. అత్యాధునిక సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించి ఘటనాస్థలానికి చేరుకుని ప్రత్యేక బృందాలు మంటలు ఆర్పగలిగారు.

951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles