హైదరాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల తయారీ


Wed,February 20, 2019 02:28 AM

Safran Aircraft to set up Rs 290 cr plant in Hyderabad

-పరిశ్రమను ప్రారంభించనున్న సఫ్రాన్ సంస్థ
-ఈ ఏడాది ప్రారంభం.. వచ్చే ఏడాదికి ఉత్పత్తి
-హైదరాబాద్‌లో కొత్త ప్లాంటు గొప్ప అవకాశం
-సఫ్రాన్ సీఈవో ఫిలిప్ పెటిట్‌కోలిన్
-సఫ్రాన్ పెట్టుబడి ఉత్సాహాన్నిచ్చింది: కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక పరిశ్రమలకు కేంద్రబిందువైన హైదరాబాద్ నగరంలో మరో పరిశ్రమ ప్రారంభంకానుంది. గతంలో ఎయిర్ ఇండియా షో కోసం హైదరాబాద్‌లో పర్యటించిన సఫ్రాన్ సంస్థ సీఈవో ఫిలిప్ పెటిట్‌కోలిన్, సీఎం కేసీఆర్‌తో సమావేశమై వెల్లడించినట్టుగానే లీప్ టర్బోఫ్యాన్ ఇంజిన్ విడిభాగాలను తయారుచేసే పరిశ్రమను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. సఫ్రాన్ సంస్థ రూ.288 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ప్రారంభించనున్నట్టు పెటిట్‌కోలిన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో పరిశ్రమను నెలకొల్పుతుండగా, అందులో 8 వేల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని వర్క్‌షాపులకు కేటాయించినట్టు పేర్కొన్నారు. 2019 జూన్‌లో పరిశ్రమ నిర్మాణం ప్రారంభమవుతుందని, 2020 నాటికి ఇంజిన్ విడిభాగాల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ పరిశ్రమ పూర్తయ్యేలోపు 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటుచేయడం గొప్ప అవకాశమని పెటిట్‌కోలిన్ అభిప్రాయపడ్డారు. తమ పెట్టుబడి, శిక్షణ కార్యక్రమాలతో భారతదేశ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. హైదరాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడంపై గత భేటీ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారని గుర్తుచేశారు. ఏరోస్పేస్ పారిశ్రామికరంగంపై తెలంగాణ దృష్టి సారించిందని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు.

2023 నాటికి పరిశ్రమ స్థిరమైన వృద్ధి తో 15 వేల భాగాలను పంపిణీ చేయగలదని ధీమా వ్యక్తంచేశారు. తమ సంస్థ ఈ ఏడాది 1800 ఇంజిన్లను సరఫరా చేస్తున్నదని, ఈ సంఖ్య 2020 వరకు రెండువేలకు పెరుగుతుందని పెటిట్‌కోలిన్ తెలిపారు. లీప్ ఇంజిన్ వైమానికరంగంలో అత్యంత వేగంగా అమ్ముడయ్యేదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ సరఫరాను వేగవంతం చేసుకోవడంలో భాగంగానే భారతదేశంలో ఈ పరిశ్రమను నెలకొల్పుతున్నట్టు తెలిపారు. సఫ్రాన్ సంస్థ భారతదేశంలో 65 ఏండ్లుగా పనిచేస్తున్నదని, ఏడు పరిశ్రమల్లో 600 మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. సఫ్రాన్ ఎలక్ట్రానిక్ అండ్ పవర్ కర్మాగారాన్ని ప్రారంభించి లీప్ ఇంజిన్స్, రాఫెల్ ఫైటర్ ఎలక్ట్రికల్ వైరింగ్ ఇంటర్‌కనెక్షన్ సిస్టం తయారుచేయనున్నట్టు 2018లో ప్రకటించామని తెలిపారు. ఈ పరిశ్రమను కూడా హైదరాబాద్‌లోనే నెలకొల్పామని, ఈ ఏడాదిలోనే నిర్మాణం పూర్తవుతుందని, దీని ద్వారా 250 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్, సఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ భాగస్వామ్యంతో తెలంగాణలో టెక్నీషియన్లు, 19 మంది ఉపాధ్యాయులను గుర్తించి, శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల తయారీ పరిశ్రమను నెలకొల్పడంతో స్థానికంగా తమ సంస్థ విస్తరిస్తున్నదని తెలిపారు.

SAFRAN2

సఫ్రాన్ పెట్టుబడి ఉత్సాహాన్నిచ్చింది: కేటీఆర్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సఫ్రా న్ సంస్థ ముందుకురావడం చాలా ఉత్సాహాన్నిచ్చిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ట్విటర్‌లో తెలిపారు. సఫ్రాన్ సంస్థ ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ. 36 మిలియన్ యూరోస్ పెట్టుబడితో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ ప్లాంట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నది అని పేర్కొన్నారు.

2428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles