రైతుబీమా పొడిగింపు!


Mon,July 22, 2019 06:57 AM

Rythu bheema extension

-2019-20 ప్రీమియం చెల్లింపుపై ఎంఓయూ సిద్ధం చేయండి
-ఎల్‌ఐసీకి వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి లేఖ
-ఆగస్టు 13తో ముగియనున్న 2018-19 ప్రీమియం గడువు
-13,172 మంది రైతుకుటుంబాలకు 658 కోట్ల చెల్లింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే.. ఆ కుటుంబాన్ని ఆదుకొనేందుకు తెలంగాణ ప్రభు త్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం మరో ఏడాది పొడిగింపునకు వ్యవసాయశాఖ కసరత్తు మొదలుపెట్టింది. 2019-20 సంవత్సరం ప్రీమియం చెల్లింపుపై ఎంవోయూను సిద్ధంచేసి పంపాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ మేనేజర్‌కు లేఖ రాశారు. 2018-19 సంవత్సరం రైతుబీమా ప్రీమియానికి సంబంధించి ఎల్‌ఐసీతో వ్యవసాయశాఖ చేసుకున్న ఒప్పందం ఆగస్టు 13వ తేదీతో ముగియనున్నది. మరో ఏడాది పొడిగింపునకు సంబంధించి ప్రీమియం రేటు ఎల్‌ఐసీ కొంతమేర పెంచే అవశాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. గతేడాది ఆగస్టులో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తన జీవితంలో చేస్తున్న అతి గొప్ప పని రైతుబీమా పథకమని చెప్పారు. 2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. దీనిప్రకారం 18 ఏండ్ల నుంచి 60 ఏండ్లలోపు పట్టాదారు రైతులు 30.05 లక్షల మంది బీమా పరిధిలోకి వచ్చారు.

ఒక్కొక్క రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,271.50 చొప్పున ప్రీమియం చెల్లించింది. ఈ మేరకు ఎల్‌ఐసీతో ఏడాదికి ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఇందుకుగాను వ్యవసాయశాఖ ఎల్‌ఐసీకి రూ.681.45 కోట్లు చెల్లించింది. ఈ పథకం ఒప్పందం ప్రకారం కొత్తగా పట్టాదారులైన రైతుల్ని కూడా బీమా పరిధిలో చేర్చుకుంటారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. మరణించిన రైతు కుటుంబానికి ఎల్‌ఐసీ రూ.5 లక్షల బీమా చెల్లించడం మాత్రమే చేస్తుంది. అర్హులైన రైతుల నమోదు, వారు మరణిస్తే అం దుకు సంబంధించిన ధ్రువపత్రాలన్నింటినీ క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారులే సంబంధిత పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. రైతుబీమా పథకం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో మృతిచెందిన 13,172 మంది రైతుల కుటుంబాలకు రూ. 658.60 కోట్లు పరిహారం ఇచ్చారు. ఇందులో ఎకరం నుంచి రెండెకరాలలోపు ఉన్న చిన్న, మధ్య తరగతి రైతులు 91 శాతం మంది ఉన్నారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలకు చెందినవారే 83 శాతం మంది ఉన్నారు. కాగా, ఎల్‌ఐసీకి ప్రభుత్వం నుంచి ప్రీమియం రూపేణా రూ. 681.45 కోట్లు చెల్లించగా.. ఇప్పటివరకు ఎల్‌ఐసీ పరిహారం కింద రైతు కుటుంబాలకు అందించిన మొత్తం రూ. 658.60 కోట్లుగా ఉన్నది.

2115
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles