40 ఏండ్ల్లుగా సాగుచేస్తున్నా భూమికి పట్టాలేదు..


Thu,May 16, 2019 02:37 AM

rythu bandhu loss over revenue officers neglect

-భూ యజమానికి కాకుండా వేరొకరి పేరుతో పట్టాజారీ
-ఒంటరి మహిళపై కనికరం చూపని రెవెన్యూ అధికారులు
-అధికారుల పొరపాట్లతో అందని రైతుబంధు సాయం

కారేపల్లి రూరల్: వారు భర్తను కోల్పోయిన ఒంటరి మహిళలు. వారసత్వంగా వచ్చిన భర్త భూములను ఒకరు 40 ఏండ్లుగా, మరొకరు పదేండ్లుగా సాగుచేసుకుంటున్నారు. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా భర్తవాటాగా వచ్చిన భూములను తమ పేరున పట్టాచేయాలని అధికారులు దరఖాస్తుచేసుకున్నారు. అయితే, వీరికి తెలియకుండా వేరొకరి పేరున పట్టాచేసిన అధికారులు అర్హులకు అన్యాయం చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పేరుపల్లి రెవెన్యూ పరిధిలోని సూర్యాతండాలో జరిగింది. సూర్యాతండాకు చెందిన మాలోత్ బిక్కి భర్త సూర్య పదేండ్ల క్రితం మృతిచెందారు. ఆయన వాటాకు వారసత్వంగా వచ్చిన సర్వే నంబర్ 99/117అ4లో ఉన్న 20 గుంటల భూమిని 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా భర్తవాటాగా వచ్చిన భూమిని తమ పేరున పట్టాచేయాలని మాలోత్ బిక్కి అధికారులకు దరఖాస్తు చేసింది. భూమిని రెండేండ్ల క్రితం సూర్య సోదరుడైన మాలోత్ రాంసింగ్ బిక్కికి తెలియకుండా పట్టా చేయించుకున్నారు.

రెవెన్యూ అధికారులు భూమి ఎవరి స్వాధీనంలో ఉందనే విషయాన్ని విచారించకుండానే పట్టాచేశారు. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల రైతుబంధు సాయం బిక్కి పొందలేకపోతున్నది. రైతుబంధు డబ్బులు కూడా రాంసింగ్ తీసుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని బిక్కి కులపెద్దలకు చెప్పగా.. వారసత్వంగా రావల్సిన 20 గుంటల భూమికి హక్కు కల్పించేలా రాంసింగ్‌తో దస్తావేజును రాయించి బిక్కికి అప్పగించారు. ఆ దస్తావేజును తీసుకుని సాదాబైనామాలో బిక్కి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసింది. ఏడాది నుంచి ఆ ఒంటరి మహిళను తిప్పించుకుంటున్నారే గానీ.. భూమికి పట్టా మాత్రం చేయడం లేదు. వీఆర్వోను అనేకమార్లు కలిసినా కానీ పనిచేయడంలేదని బిక్కి వాపోతున్నది. ఉన్న కొద్దిభూమికి హక్కు కల్పించాలని కోరుతున్నది.

సమస్యలను పరిష్కరిస్తాం:సురేందర్, పేరుపల్లి వీఆర్వో

సూర్యాతండాకు చెందిన మాలోత్ బిక్కి, భూక్యా బుజ్జిల రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా. పూర్తిస్థాయి పరిశీలన జరిపి సమస్యను తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్తా. భూమికి సంబంధం లేనివారు పట్టాదారు సాస్‌పుస్తకం పొందితే దాన్ని రద్దుచేయించడానికి నివేదికను అధికారులకు సమర్పిస్తా. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన జరిపి ఎవరినీ ఇబ్బంది పెట్టకుండానే పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేపిస్తాం.


భూక్యా బుజ్జి

మరొకరి పేరుతో పట్టా

సూర్యాతండాకు చెందిన మరో ఒంటరి మహిళ భూక్యా బుజ్జి భూమిని కూడా రెవెన్యూ అధికారులు మరొకరి పేరున పట్టా చేశారు. బుజ్జి కూడా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవనం సాగిస్తున్నది. తన భర్తకు వారసత్వంగా వచ్చిన సర్వే నంబర్ 99/75లో 12 గుంటల భూమిని పదేండ్లుగా సాగుచేసుకుంటున్నది. ఆ భూమిని తులిస్యా పేరుతో పట్టాచేశారు. రైతుబంధు సాయం రాకపోవడంతో విషయం బంధువులకు చెప్పగా.. వారసత్వపు వాటాపత్రాన్ని తులిస్యాతో బుజ్జికి రాయించి ఇచ్చారు. ఆ పత్రాన్ని వీఆర్వోకు చూపించి, సాదాబైనామాలో పట్టా చేయమని పలుమార్లు వేడుకున్నా పట్టించుకోలేదని బుజ్జి ఆవేదన వ్యక్తం చేస్తున్నది.

929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles