రైతుబంధు పంపిణీకి రెడీ


Wed,May 22, 2019 02:19 AM

rythu bandhu distribution begins

-ఎన్నికల కోడ్ ముగియగానే ఆన్‌లైన్‌లో నేరుగా డబ్బు జమ
-ఎకరాకు రూ.5 వేల సాయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పథకం అమలుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతున్నది. అవసరమైన నిధులు సిద్ధంగా ఉంచినట్టు ఆర్థికశాఖ ప్రకటించింది. ఎన్నికల కోడ్ ముగియగానే.. ఈ నెల చివరివారం నుంచి జూన్ మొదటివారంలోగా రైతుబంధు సొమ్మును ఆన్‌లైన్ పద్ధతిలో ఆయా రైతుల బ్యాంకుఖాతాల్లో జమచేస్తామని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతుల వివరాలు, బ్యాంకుఖాతాలు, కొత్తవారి నమోదు తదితర వివరాలను చేర్చే విషయంలోనూ వ్యవసాయశాఖకు దిశానిర్ధేశం చేశారు. వానకాలం సీజన్‌లో రైతుబంధు పథకం కింద రైతులకు రూ.6వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. తొలకరి వర్షాలు కురిసేనాటికి, సాగు మొదలుకు ముందు రైతులందరికీ పెట్టుబడిసాయం అందజేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉన్నది. గతేడాది ప్రభుత్వం ఒక్కోసీజన్‌కు రైతుకు ఎకరానికి రూ.నాలుగువేల చొప్పున ఇచ్చింది. ఈసారి దానిని రూ.ఐదువేలకు పెంచిన సంగతి తెలిసిందే.

యాసంగిలో రానివారికి కూడా..

2018-19 ఆర్థిక సంవత్సరంలో రైతుబంధు ప్రారంభమైంది. వానకాలం, యాసంగి సీజన్‌లలో రెండు విడుతలుగా రైతులకు సాయం అందజేశారు. గత వానకాలంలో 51.50 లక్షల మంది రైతులకు రూ.5,260.94 కోట్లు ఇచ్చారు. యాసంగిలో 49.03 లక్షల మంది రైతులకు రూ.5,244.26 కోట్లు అందజేశారు. మొత్తంగా రూ.10,505.20 కోట్లు ఇచ్చినట్లయింది. యాసంగిలో కొందరు రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో సొమ్ము అందలేదు. ఆర్థిక, ట్రెజరీశాఖల మధ్య సమన్వయ లోపమో మరో కారణమో తెలియదు కానీ చాలామంది రైతులకు యాసంగి రైతుబంధు డబ్బులుపడినట్టు వారి మొబైల్‌ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లాయి. కానీ బ్యాంకుల్లో సొమ్ము పడలేదు. దీంతో వ్యవసాయశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. కొందరి సమస్య పరిష్కరమైనా ఇంకొందరికి డబ్బు చేరలేదు. వారికి త్వరలో డబ్బులువేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి స్పందిస్తూ.. అటువంటివారు కొందరే ఉన్నట్టు తేలిందన్నారు. ఇంకా డబ్బు అందనివారికి త్వరలోనే జమచేయిస్తామని ఆయన మంగళవారం వెల్లడించారు.

గతేడాది వానకాలంలో రైతుబంధు సొమ్మును ప్రభుత్వం చెక్కుల రూపేణా అందజేసింది. యాసంగిలోనూ అలాగేచేయాలని భావించి, ఆ మేరకు చెక్కులనూ ముద్రించారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లడం, కోడ్ ప్రభావంతో చెక్కుల పంపిణీని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. రైతుల బ్యాంకుఖాతాలోనే డబ్బులు జమచేయాలని సూచించింది. ఆ మేరకు రైతుల బ్యాంకుఖాతాలను వ్యవసాయశాఖ సేకరించి రైతులకు సొమ్ము బదిలీచేసింది. రానున్న వానకాలంలోనూ రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాలోనే నేరుగా ఆన్‌లైన్ పద్ధతిలో జమచేయాలని సర్కారు నిర్ణయించినట్టు సమాచారం.

9586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles