సమ్మెపై నేడు తుది నిర్ణయం

Wed,November 20, 2019 02:31 AM

-జేఏసీకే బాధ్యత అప్పగించిన యూనియన్లు
-మీడియాతో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

నమస్తే తెలంగాణ, హైదరాబాద్/ మన్సూరాబాద్: సమ్మె కొనసాగింపుపై బుధవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు టీఎంయూ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. హైకోర్టు తీర్పు కాపీ అంది, దానిపై సమీక్ష జరిపేవరకు సమ్మెను యథాతథంగా కొనసాగించనున్నట్టు తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీలోని వివిధ యూనియన్ల ఉద్యోగులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకున్నామని, ఆ సమావేశాల్లో సమ్మెను కొనసాగించాలని ఉద్యోగులు కోరారని తెలిపారు. ఎల్బీనగర్ చింతలకుంటలోని హిమగిరిగార్డెన్‌లో మంగళవారం రాత్రి మీడియా సమావేశంలో ఆర్టీసీ జేఏసీలోని ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులతో కలిసి అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. టీఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్ల నాయకులు సుదీర్ఘంగా జరిపిన సమీక్షల అనంతరం తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను ఆర్టీసీ జేఏసీకి అప్పగించారని తెలిపారు. కోర్టు తీర్పును సమీక్షించిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి, సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ పాల్గొన్నారు.

సమ్మెను కొనసాగించాలా? వద్దా!

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో సమ్మెను కొనసాగించడమా? విరమించడమా? అనే అంశంపై కార్మికసంఘాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. మంగళవారం ఎల్బీనగర్ చింతలకుంటలోని హిమగిరిగార్డెన్‌లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేంద్ర కమిటీ సమావేశమైంది. సమ్మె కొనసాగింపు అంశంపై వివిధ డిపోల కార్యదర్శుల అభిప్రాయాలను సేకరించారు. సమ్మెను కొనసాగించడం వల్ల ఎలాంటి లాభం లేదని, ఇప్పటికే కార్మికుల చేతిలో నుంచి సమ్మె అంశం చేజారిందని పలువురు డిపో కార్యదర్శులు నాయకత్వానికి నిర్మొహమాటంగా వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

సమ్మెను ఉపసంహరించి బేషరతుగా ఉద్యోగాల్లో చేరితే ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందేమోనన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తంచేశారని సమాచారం. సమ్మె కొనసాగింపుపై డిపో కార్యదర్శుల అభిప్రాయాలు తీసుకోవడంపై కొందరు కార్మికులు అసంతృప్తి వ్యక్తంచేశారు. కార్యదర్శులు సంఘం పెద్దల కనుచూపుల్లో నడిచేవారని, వారి అభిప్రాయాలు సేకరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు వ్యాఖ్యానించారు. ప్రతి డిపోలో సమావేశాన్ని ఏర్పాటుచేసి కార్మికుల అభిప్రాయాలు తీసుకుంటే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. గత 46 రోజులుగా యూనియన్ పెద్దలు చెప్పిన విధంగానే సమ్మెలో పాల్గొన్నామని.. భవిష్యత్తులోనూ వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిపో కార్యదర్శుల్లో అధికులు చెప్పినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి, నేతలు బీవీ రెడ్డి, మారయ్య, ఎల్ రమేశ్, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles