12 రోజుల్లో పీఆర్సీ నివేదిక ఇవ్వండి

Mon,November 11, 2019 01:24 AM

-కమిషన్‌ను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉద్యోగుల వేతన సవరణపై నిర్ణయం తీసుకోవడంకోసం పది పన్నెండు రోజుల్లో నివేదికను సమర్పించాలని పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగుల వేతనాలను సవరించడానికి 2018 మే నెలలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ చైర్మన్‌గా, ఉమామహేశ్వర్‌రావు, మహ్మద్ అలీ రఫత్ సభ్యులుగా ప్రభుత్వం పీఆర్సీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. వేతనాల సవరణపై లోతైన అధ్యయనం చేయాల్సిరావడంతో కమిషన్ గడువును పెంచుతూ వచ్చారు. పే రివిజన్ కమిషన్.. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుంచి నివేదికలు తీసుకొన్నది. ఆయా సంఘాలు, శాఖలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు స్వీకరించింది. ఇతర రాష్ర్టాల్లోని పరిస్థితులపై అధ్యయనంచేసింది. ఈ క్రమంలో పది పన్నెండు రోజుల్లో నివేదికను ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించింది.

సమగ్రంగా నివేదిక రూపకల్పన

ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని ప్రభుత్వం కృషిచేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇస్తున్న తొలి పీఆర్సీ ఇదే అవుతుంది. 2014లో రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగవర్గాలకు న్యాయంచేసే విధంగా సీఎం కేసీఆర్ 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పీఆర్సీ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో వేసిందే. దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఈ స్థాయిలో ఫిట్‌మెంట్ ఇవ్వలేదు. భారీఎత్తున ఫిట్‌మెంట్ ఇవ్వడంద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పకనే చెప్పింది. 2018లో వేతన సవరణకోసం బిశ్వాల్ నాయకత్వంలో ఏర్పాటుచేసిన కమిషన్ తన నివేదికను సమగ్రంగా రూపొందించేందుకు పెద్దఎత్తున అధ్యయనం చేసింది.

ఆయా శాఖల అధిపతులతో చర్చలు జరిపిన తర్వాత.. జిల్లాల పునర్విభజన చేసిన నేపథ్యంలో 33 జిల్లాల అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్యాడర్.. ఖాళీలకు సంబంధించిన సమాచారం కూడా సేకరించింది. మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ర్టాల్లో అమలులో ఉన్న పీఆర్సీ విధానాన్ని అధ్యయనంచేసింది. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన ఏడో వేతన సవరణ సిఫారసులనూ అధ్యయనం చేసింది. ప్రస్తుతం రూపొందించే నివేదిక భవిష్యత్‌లో వేయబోయే పీఆర్సీలకు ప్రామాణికంగా ఉండేలా సిద్ధంచేస్తున్నట్లు సమాచారం. తాజా ఆదేశాల మేరకు గడువులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి చర్యలు తీసుకొంటున్నది.

298
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles