వారసత్వ సంపదకు పూర్వవైభవం

Mon,November 6, 2017 01:42 AM

హెరిటేజ్ సర్యూట్‌లో భాగంగా రూ.99.42 కోట్లు కేటాయింపు
ఇప్పటికే కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

QUTUB-SHAH-TOMBS
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఐదు శతాబ్దాల హైదరాబాద్ వారసత్వ సంపదలో మణిపూసల్లాంటి నిర్మాణాలకు పూర్వ వైభవం రానున్నది. ఇండో - ఇస్లామిక్ నిర్మాణశైలితోపాటు ఫ్రెంచ్ నిర్మాణశైలికి ప్రతిబింబాలుగా నిలిచి పర్యాటకులను, పరిశోధకులను ఆకట్టుకుంటున్న పురాతన సమాధులను పరిరక్షించేందుకు పర్యాటక, పురావస్తు శాఖ నడుం బిగించాయి. ఇప్పటికే కుతుబ్‌షాహీ టూంబ్స్‌లో సగానికిపైగా నిర్మాణాలను పురావస్తుశాఖ అధికారులు పునరుద్ధరించారు. పాయిగా టూంబ్స్ పునరుద్ధరణకు చేపట్టాల్సిన మరమ్మతులపై అధ్యయనం చేశారు. ఈ చర్యలకు ఊతమిస్తూ కేంద్ర పర్యాటకశాఖ హెరిటేజ్ సర్యూట్ పథకం కింద రూ. 99.42 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కుతుబ్‌షాహీ, పాయిగా టూంబ్స్‌తోపాటు రేమండ్ టూంబ్స్, హయత్ బక్షీ మసీదును పునరుద్ధరించనున్నారు.

కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్

ఇస్లామిక్ శైలిలో మినార్లు.. ఎత్తయిన గోపురాల భారతీయ శైలి జతచేసి కుతుబ్‌షాహీలు రూపొందించిన ఆధునిక నిర్మాణశైలికి ప్రతీకలు కుతుబ్‌మినార్ టూంబ్స్. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఇప్పుడవి పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఆగాఖాన్ ట్రస్ట్, అమెరికా కల్చరల్ ఫండ్ సహకారంతో రాష్ట్ర పురావస్తు శాఖ ఇప్పటికే బడీబౌలి, టూంబ్స్‌తోపాటు ఇతర నిర్మాణాలను పునరుద్ధరించాయి. ఇప్పుడు రూ.82.43 కోట్లు విడుదలయ్యాయి.

పాయిగా టూంబ్స్‌కు రూ.4.1 కోట్లు

కుతుబ్‌షాహీల తర్వాత హైదరాబాద్‌లో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టినది పాయిగా వంశస్థులే. ఫలక్‌నుమా ప్యాలెస్, బషీర్‌బాగ్ ప్యాలెస్ వంటి నిర్మాణాలతోపాటు వారి సమాధులకు సైతం అత్యంత సున్నితమైన నిర్మాణ కౌశలాన్ని జోడించారు. ప్రపంచ దేశాల్లోని విశ్వవిద్యాలయాలన్నీ ఇస్లామిక్ శైలిని వివరించేటప్పుడు పాయిగా టూంబ్స్‌ను ప్రస్తావిస్తాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ కట్టడాల పునరుద్ధరణకు రూ.4.1 కోట్లు విడుదలయ్యాయి.

ఫ్రెంచ్ శైలిలో రేమండ్ టూంబ్స్

నిజాం సైన్యానికి జనరల్ హోదాలో సేవలందించి 1798లో మరణించిన మైకేల్ మేరీ రేమండ్ సమాధిని నిజాం ప్రభుత్వం మలక్‌పేట సమీపంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించింది. ఇవి ఫ్రెంచ్ శైలిలో ఏడు మీటర్ల ఎత్తుతో ఉన్నాయి. 2001 అక్టోబర్‌లో వచ్చిన వరదలతో కొంత ధ్వంసం కాగా 2003లో తాత్కాలిక మరమ్మతులు చేశారు. పూర్తిస్థాయి పునరుద్ధరణకు ఇప్పుడు రూ.4.2 కోట్లు మంజూరయ్యాయి.

మూడున్నర శతాబ్దాల హయత్ బక్షీ మసీదు

హయత్‌నగర్‌లోని హయత్ బక్షీ బేగం సమాధిని 1672లో నిర్మించారు. కుతుబ్‌షాహీల కాలంలో యాత్రికుల విడిది కోసం నిర్మించిన ఈ మసీదు సరాయి తరహాలో రెండు ఎత్తయిన మినార్లను కలిగి ఉంటుంది. అందమైన నిర్మాణ కౌశలానికి ప్రతీకగా ఉన్న ఈ సమాధిని కాపాడేందుకు రూ.2.18 కోట్లు విడుదలయ్యాయి. మసీదులోని శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించి, పరిరక్షణ చర్యలు చేపట్టనున్నారు.

1540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles