పీహెచ్‌సీల్లో 24 గంటల వైద్యం!


Sun,August 25, 2019 02:26 AM

Rs 70 Crore Accommodation to phc and community health centers

-గ్రామీణ వైద్యసేవల పటిష్ఠతపై ప్రభుత్వం దృష్టి
-రూ.70 కోట్లతో పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో వసతులు
-రోగనిర్ధారణ పరీక్షలకు అనువైన ల్యాబ్‌ల ఏర్పాటు
-ప్రణాళికలు రూపొందించిన వైద్య, ఆరోగ్యశాఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పీహెచ్‌సీల పరిధిలో 24 గంటల వైద్యం అందించడంపై కూడా దృష్టిపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విస్తరించేందుకు రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (సీహెచ్‌సీ) సౌకర్యాలు కల్పించనున్నది. రూ.70 కోట్ల నిధులతో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను అభివృద్ధిపరిచేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ వైద్యంరంగంలో అనేక వినూత్న మార్పులు తీసుకొచ్చారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సర్కారు దవాఖానల ఆధునీకరణ, సేవల విస్తరణ వంటి అనేక నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి.

కేసీఆర్ కిట్, డయాలసిస్ కేంద్రాలు వంటివి నిరుపేదలకు వైద్యసేవలను మరింత దగ్గర చేశాయి. ఇప్పుడు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా వైద్యసేవలు పొందేందుకు అవకాశం కలుగనున్నది. రాష్ట్రంలో మొత్తం 636 పీహెచ్‌సీల్లో 3,908 బెడ్లు, 41 సీహెచ్‌సీల్లో 1,186 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో తొలుత మంచినీటి కొరత తీర్చగలిగితే రోగులకు అవస్థ తొలగడంతోపాటు పరిశుభ్రత కూడా మెరుగుపడుతుందని వైద్యశాఖ భావిస్తున్నది. మెరుగైన వైద్య అందించడంతోపాటు రక్తం, మూత్ర పరీక్షలు వంటివి జరిపి రోగనిర్ధారణ చేసుకునేందుకు వీలుగా ల్యాబ్‌లను ఏర్పాటుచేయాలని చూస్తున్నది. ఇప్పటికే కొన్నికేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. పీహెచ్‌సీలకు కావాల్సిన మందులు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి 12 అంశాలను నిర్ధారించుకుని వసతులు కల్పించేందుకు రూ.70 కోట్లు వినియోగించనున్నారు.

ప్రధానంగా చేపట్టే చర్యలు

-ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడం, మందులను అందుబాటులో ఉంచడం.
-అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు రోగనిర్ధారణ పరీక్షలకు అనువైన ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురావడం
-దవాఖానల్లో నిత్యం కొత్త బెడ్‌షీట్లు మార్చడం, రోగులకు ఉచితంగా మందులు అందించడం వంటివి అమలుచేయనున్నారు.

1089
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles