ఆసరాలో రెవెన్యూ చేతివాటం


Sat,September 14, 2019 02:58 AM

Revenue Officers Taking bribe For Aasara pensions

-పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో గోల్‌మాల్
-ప్రమాణాలు పాటించకుండా అనర్హులకు సంక్షేమ పథకాలు
-చార్మినార్ మండలంలో వెలుగుచూసిన కుంభకోణం
-పొరుగు మండలం లబ్ధిదారులంటూ పక్కదారి పట్టించే యత్నం
-తండ్రి చనిపోయినా.. కుమారుడికి వృద్ధాప్య పెన్షన్
-సైబర్‌క్రైం పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికలో కొందరు రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఫలితంగా సంక్షేమ ఫలాలు అనర్హులకు చేరుతున్నాయి. హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ప్రాథమిక దర్యాప్తులోనే ఇందుకు సంబంధించిన అనేక ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం రెండు మండలాలకు సంబంధించిన పెన్షన్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు, అక్కడ వెల్లడవుతున్న సమాచారంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అవతకవకలు రాష్ట్రవ్యాప్తంగా జరిగే అవకాశాలున్నాయనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. చార్మినార్ ప్రాంతంలో నెలకు దాదాపు రూ.50 వేలకుపైగా కిరాయి వచ్చే మూడంతస్థుల భవనం కలిగి ఉన్న వారు కూడా పెన్షన్ల లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియనే గందరగోళంగా ఉండటం, క్షేత్రస్థాయి లో వీఆర్వోలు ఇచ్చే నివేదికపైనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుండటంతో కొన్నిచోట్ల వీఆర్వోలు సొంతంగానే జాబితాను తయారు చేసినట్టు తెలుస్తున్నది.

ఇదీ ఆసరా పెన్షన్ల స్కాం!

చార్మినార్ మండలంలో 9,016 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. పెన్షన్ల సర్వర్లలో వీరిలోనుంచి కొంత మంది పేర్లు తొలగించి 255 మంది కొత్తవారిని చేర్పించారు. తాసిల్దార్ వద్ద ఉండే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయాల్లో 255 మంది బ్యాంకు ఖాతాలను అసలైన లబ్ధిదారుల జాబితాలో కలిపేశారు. దీంతో కొందరు లబ్ధిదారులకు పెన్షన్లు రాకపోవడం, మరికొందరు కొత్తవారికి పెన్షన్లు రావడం ప్రారంభమయ్యింది. పెన్షన్లు ఆగిపోయినవారిలో కొందరు మే నెల లో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేయడం తో శాఖాపరమైన దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో 255 మంది కొత్త బ్యాంకు ఖాతాలకు ఈ ఏడాది మే, జూన్ నెలల పెన్షన్ డబ్బు లు వెళ్లినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని నిర్ధారించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఉన్నతాధికారులు ఆయా ఖాతాలపై ఆరా తీశా రు.

255 మంది లబ్ధిదారుల ఖాతాలను 63 బ్యాంకుల్లో తెరిచారని, ఇందులో హైదరాబాద్‌లో 61, మహబూబ్‌నగర్ జిల్లాలో 2 ఖాతాలున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ కలెక్టరేట్ అధికారుల ఫిర్యాదుమేరకు సైబర్‌క్రైం విభా గం ఈ స్కాంపై దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తులో 255 ఖాతాలు నకిలీవి కావని, పక్కనే ఉన్న బండ్లగూడ మండల లబ్ధిదారుల పేర్లు చార్మినార్ మండలంలో కలిశాయని, ఇక్కడ స్కాం జరుగలేదని కిందిస్థాయి రెవె న్యూ సిబ్బంది పోలీసులకు వివరణ ఇచ్చారు. పక్క మండల లబ్ధిదారులే కావడంతో ఈ కేసు కు అంత ప్రాధాన్యం లేదంటూ, ఈ విషయా న్ని తేలికగా తీసుకోండంటూ పోలీసులకు తేల్చిచెప్పారు. ఈ కేసు దర్యాప్తులో రెవెన్యూ సిబ్బంది సహకరించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని భావించిన సైబర్‌క్రైం పోలీస్‌లు.. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గురించి ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపా రు. 255 మందిలో 50 ఖాతాలను ఇప్పటివరకు ఇంటింటికీ వెళ్లి పరిశీలించగా, మొత్తం నకిలీవేనని తేలింది. అనర్హులకు, రెవెన్యూ సిబ్బందికి తెలిసే ఈ స్కాం జరుగుతున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కొందరు రెవెన్యూ సిబ్బంది మధ్యవర్తుల సాయంతో లబ్ధిదారులను ఎంపికచేయడం, నెలనెలా వచ్చేదాంట్లో తలా కొంత పంచుకొంటున్నట్టు సమాచారం.

సంబంధిత పత్రాలను పరిశీలించలేదు!

పెన్షన్ కోసం లబ్ధిదారులు మీ సేవలో సంబంధిత పత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు మండల కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఆయా ప్రాంతాల్లోని వీఆర్వోలు ఇంటింటికీ వెళ్లి పరిశీలించి.. నివేదికను ఆర్‌ఐ(రెవెన్యూ ఇన్‌స్పెక్టర్)కి పరిశీలన కోసం ఇవ్వాలి. అనంతరం తాసిల్ద్దార్ పరిశీలనకు వెళ్తుంది. ఆ తర్వాత కంప్యూటర్‌లో ఫీడ్‌చేసి, కలెక్టరేట్‌లోని పెన్షన్ విభాగానికి పంపిస్తారు. అక్కడినుంచి సెర్ప్‌లో ఆమోదం అనంతరం.. లబ్ధిదారుల ఖాతాలోకి నెలవారీగా డబ్బులు జమవుతాయి. కానీ అర్హత లేని వారిని కూడా వీఆర్వోలు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఇందుకు ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.500 వసూలు చేస్తున్నట్టు తెలిసింది. అంటే 255 మంది నుంచి ప్రతినెలా రూ.1,27,500 వసూలుచేసి క్షేత్రస్థాయిలో సిబ్బంది పంచుకొంటున్నట్టు సమాచారం. కొన్ని సందర్భాల్లో కొందరు ఉన్నతాధికారులకు కూడా వాటాలు వెళ్తున్నట్టు తెలిసింది.

క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం

పెన్షన్లలో కుంభకోణాలు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలుతున్న ది. లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయి సిబ్బం ది సరైన ప్రమాణాలు పాటించకపోవడం, దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహించడం, నకిలీ లబ్ధిదారులతో చేతులు కలిపి ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు. వీఆర్వోలపైనే ఆర్‌ఐలు, తాసిల్దార్లు ఆధారపడుతున్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపికలో వీఆర్వోలే ప్రధానమవుతున్నారు. ప్రభు త్వం ప్రతి పేదవాడికి అండగా ఉండాలని తొమ్మిది రకాల ఆసరా పెన్షన్లను అందజేస్తున్నది. 39,41,976 మంది లబ్ధిదారులు ఈ పెన్షన్లను ప్రతి నెలా పొందుతున్నారు. ప్రభు త్వ ఆశయానికి తగ్గట్టుగా పనిచేయాల్సిన రెవెన్యూ సిబ్బంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం అనర్హులను ఎంపిక చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు పూర్తిస్థాయిలో ఈ కేసు దర్యాప్తుచేస్తే మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

దర్యాప్తులో తేలిన కొన్ని అంశాలు!

-ఫాతిమా అనే పేరుతో వృద్ధాప్య పింఛన్ జమవుతున్నది. అయితే పేరు ఫాతిమా ఉన్నా.. ఫొటో మాత్రం ఎనిమిదేండ్ల బాలుడిది ఆధార్‌కార్డుపై ఉన్నా వీఆర్వో గుర్తించలేదు.
-వితంతు పెన్షన్ లబ్ధిదారుల్లో భర్త ఉన్నవారిని ఎంపికచేశారు.
-మూడు బంగ్లాలున్నవారిని కూడా లబ్ధిదారుగా చేర్చారు.
-విచారణలో వీరెవరూ కూడా తమ ముఖాలను పోలీసులకు చూపించలేదు. తామే లబ్ధిదారులమంటూ నమ్మించే ప్రయత్నంచేశారు. అయితే వారంతా అనర్హులేనని పోలీసులు తేల్చారు.
-తండ్రి చనిపోయినా కొన్ని నెలలుగా అతడి కుమారుడు వృద్ధాప్య పెన్షన్‌ను డ్రా చేస్తున్నాడు.

1450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles