ఆక్రమణదార్లకే వత్తాసు!


Wed,May 22, 2019 01:52 AM

Revenue Officers Playing With Old Man Farmer For Land Registration

-జాయింట్ కలెక్టర్, కోర్టు తేల్చిచెప్పినా నాన్చుతున్న అధికారులు
-పాస్‌పుస్తకం కోసం 19 ఏండ్లుగా సిద్దిపేట జిల్లా చేర్యాల రైతు ఎదురుచూపులు
-అక్రమ కాస్తుదార్లకు వత్తాసు.. కొనుగోలు దార్లుగా నమోదు
-కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చి న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితుడు చిత్తారి

చేర్యాల, నమస్తే తెలంగాణ: కాసుల కోసం కక్కుర్తి పడి ఆక్రమణదారుకు వత్తాసు పలుకుతున్నారు రెవెన్యూ అధికారులు. పేద వృద్ధ రైతు సుమారు రెండు దశాబ్దాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ తన గోడువెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు, కోర్టు రైతుకు అనుకూలంగా తేల్చిచెప్పినా స్థానిక రెవెన్యూ అధికారులు ఏండ్లుగా నాన్చుతూ రైతును మనోవేదనకు గురిచేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది లీలలతో రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అక్రమంగా కాస్తుచేస్తున్న వారిని కొనుగోలుదార్లుగా పేర్కొంటూ కాస్తుఖానాలో వారి పేర్లు నమోదుచేయడంతో న్యాయం కోసం సిద్దిపేట్ట జిల్లా చేర్యాల పట్టణానికిచెందిన కొంపెల్లి చిత్తారి అలుపెరుగని పోరాటంచేస్తున్నారు. రైతు చిత్తారికి చేర్యాల శివారు బండపల్లిలో సర్వే నంబర్ 1060బీలో 8.11 ఎకరాల భూమి ఉన్నది. చిత్తారి ఎలాంటి ఇబ్బంది లేకుండా 25 ఏండ్లుగా కాస్తుచేస్తున్నారు.

ఈ భూమి చుట్టూ ఉన్న రైతులు నలుగురు చిత్తారి జాగాపై టెనెన్సీ ఉన్నదని, సదరు రైతును భూమిపైకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితుడు రెవెన్యూ ఉన్నతాధికారులకు తనగోడు చెప్పుకొన్నాడు. జాయింట్ కలెక్టర్ స్వయంగా స్పందించి విచారణ జరిపి చిత్తారి భూమిపై ఎలాంటి టెనెన్సీ లేదని తీర్పు ఇచ్చారు. తన వ్యవసాయ భూమి 50బీ కింద పట్టా అయిందని, ఆక్రమణదారులు భూమిపై నుంచి వెళ్లకపోవడంతో వారిపై కోర్టులో కేసు వేశాడు. 2001లో కోర్టు భూమి సమస్య పరిష్కారానికి బేలీఫ్‌ను నియమించడంతో, కోర్టు ఆర్డర్‌తో బేలిఫ్ ఆ భూమి వద్దకు వచ్చి పంచనామా నిర్వహించి సాక్షుల ఎదుట చిత్తారికి భూమిని అప్పగించారు. ఈ సమయంలో ఆక్రమణదారులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంచేయలేదు. కాస్తు కాలం నుంచి భూమి ఆక్రమణదారుల పేర్లు తొలిగించి తనకు వెంటనే పాస్‌పుస్తకాలు ఇవ్వాలని బాధితుడు అర్జీ పెట్టుకున్నారు. దరఖాస్తు పెట్టుకొని 19 ఏండ్లు అవుతున్నా ఇప్పటివరకు ఖాస్తు ఖానా నుంచి వారి పేర్లు తొలిగించలేదు. రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు వంతపాడుతూ.. కాస్తుచేస్తేనే పాస్‌పుస్తకాలు ఇస్తామని, రికార్డుల్లో పేర్లు ఎక్కిస్తామనిచెప్తున్నారు. ఎలాంటి అధికారం లేకుండా అక్రమంగా కాస్తుచేస్తున్న వారి పేర్లను రికార్డుల నుంచి తొలిగించి, సరిచేసి కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చి న్యాయం చేయాలని బాధితుడు అధికారులను వేడుకుంటున్నారు.

న్యాయం చేస్తాం: నాగరాజుగౌడ్, తాసిల్దార్, చేర్యాల

రైతు చిత్తారికి సంబంధించి వ్యవసాయ భూమి విషయంలో సమగ్ర విచారణ జరిపి న్యాయంచేస్తాం. అన్ని వర్గాల రైతులకు న్యాయంచేయడమే మా లక్ష్యం. మొన్నటి వరకు మల్లన్నసాగర్ చెక్కుల పంపిణీలో ఉన్నందున ఇప్పుడు భూమి రికార్డులను అధ్యనం చేసి చిత్తారికి న్యాయంచేస్తాం.

222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles