ఆయకట్టు కాల్వ కబ్జా.. రైతుబాటకు అడ్డుగోడ!


Thu,May 23, 2019 01:49 AM

Revenue Officers Neglect For Land Registration

-ఫిర్యాదు చేసినా ఏడాదిగా చలనంలేదు
-ప్రాథేయపడినా కనికరించని అధికారులు
-ఇరిగేషన్‌శాఖ సర్వే ఆదేశాలూ బేఖాతరు
-రైతులు సొంత పొలాలకు వెళ్లలేని దుస్థితి
-ఎంతోకొంత చెల్లించి కొనుగోలుకు యత్నాలు

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ: ఆయకట్టు కాల్వలు కబ్జా అయ్యాయని రైతులు ఫిర్యాదు చేసి ఏడాది గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదు. రైతుల బాటకు అడ్డంగా గోడకట్టారని మొరపెట్టుకున్నా పెడచెవిన పెట్టారు. నీరందే దారిలేక భూములు బీడువారినా వారిలో చలనం లేదు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న ఇరిగేషన్ అధికారులు కాల్వల కబ్జాపై సర్వే చేయాలని ఆదేశిస్తూ లేఖరాసినా ఖాతరుచేయని తీరుతో ఎవరికి చెప్పుకొంటే తమ బాధతీరుతుందోనని కనిపించిన అధికారి చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆయకట్టు పొలాలకు నీరందించే కాల్వలు, వాటి కింది రైతుల బాటలను ఓ రైస్‌మిల్లు యాజమాని ఆక్రమించి చుట్టూ గోడకట్టడంతో 15 మంది రైతులు అల్లాడుతున్నారు. కబ్జాదారు నుంచి కాల్వకు విముక్తి కల్పించాలని, తమ పంటపొలాలకు నీరుపారేలా చూడాలని తిరిగి తిరిగి విసిగి వేసారిన శేరిగూడ గ్రామానికి చెందిన రైతు మొద్దు జంగారెడ్డి చివరికి ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయంలో 2018 ఆగస్టు 25న ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు చేయడమే కాకుండా తాను చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి న్యాయం చేయాలని కార్యాలయం చుట్టూ తిరిగారు. అధికారులు స్పందించకపోవడంతో ఆయన రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై అక్కడి అధికారులూ స్పందించకపోవడంతో ఆయన ఇరిగేషన్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ అధికారులు వాస్తవం తెలుసుకున్నారు. ఆయకట్టు కాల్వ కబ్జా అయినట్టు రైతులు ఫిర్యాదు చేశారని, దీని ఆధారంగా సర్వే నిర్వహిస్తే ఆయకట్టు కాల్వ కబ్జా అయినట్టు తెలుస్తుందని, జాయింట్ సర్వే నిర్వహించాలని డిప్యూటీ ఈఈ స్వయంగా 2019 జనవరి 19న ఇబ్రహీంపట్నం తాసిల్దార్‌ను కోరుతూ లేఖరాశారు. రైతు ఫిర్యాదుపైన కానీ, ఇరిగేషన్ అధికారుల లేఖపైనకానీ.. రెవెన్యూ అధికారులు స్పందించలేదు. తమ పొలాలకు నీరొచ్చే పంటకాల్వ కబ్జా అయిందని, కబ్జాచేసిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించారని, కనీసం వీఆర్వోనైనా పంపించి పనులు నిలిపివేయాలని కోరినా.. పట్టించుకోవడం లేదు. కాల్వలు యథేచ్ఛగా కబ్జా చేసిన పూర్తి ఆధారాలు అందజేసినా వారిలో స్పందనలేదని రైతులు వాపోతున్నారు.

రైతుల భూములకు వెళ్లే దారిలేదు

ఇబ్రహీంపట్నం పెద్దచెరువు కింద 1,200 ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. నిజాం పాలనలో ఈ చెరువు నిర్మించి ఆయకట్టుకు నీరందించే కాల్వలను నిర్మించారు. ఈ కాల్వల్లో పారే నీటి ద్వారానే ఇబ్రహీంపట్నం, శేరిగూడ, ఉప్పరిగూడ గ్రామాల రైతుల భూములకు సాగునీరు చేరుతుంది. శేరిగూడ పంచాయతీ పరిధిలోని 236, 237, 238, 249, 251 సర్వే నంబర్లలోని భూముల చివరి ఆయకట్టు రైతులకు నీరందించే కాల్వ గ్రామ నక్షలో కూడా స్పష్టంగా కనిపిస్తుందని రైతులు తెలిపారు. ఈ కాల్వ భూమిని రైస్‌మిల్లు యాజమాన్యం కొనుగోలు చేసి, చుట్టూ ప్రహరీని నిర్మించింది. రైతులు వెళ్లడానికి దారిలేకుండాపోయింది. భవిష్యత్తులో చెరువులోకి నీరువచ్చి కాల్వల ద్వారా పొలాలకు పారాలన్నా ప్రహరీ అడ్డంకిగా మారింది. సాగునీరు కూడా పారకుండా కాల్వను మూసివేశారని ఆయకట్టు చివరి రైతులు వాపోతున్నారు. కాల్వపై నిర్మించిన గోడను వెంటనే తొలిగించి కాల్వను యథావిధిగా చేస్తేనే సాగునీరు వచ్చే అవకాశాలుంటాయని, అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. రైస్‌మిల్లు యాజమాన్యం రోడ్డు మార్గాన్ని మూసివేశాక.. కాల్వకింది భూములను కూడా ఎంతోకొంత చెల్లించి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని, విధిలేక ఆయకట్టు చివరిరైతులు తక్కువ ధరకే భూములు అమ్ముకునే పరిస్థితిని తీసుకువచ్చారని రైతులు వాపోతున్నారు.

న్యాయం చేస్తాం

శేరిగూడ గ్రామంలో ఆయకట్టు కాల్వ కబ్జాకు గురైనట్టు ఫిర్యాదు అందింది. సర్వేయర్‌ను, వీఆర్వోను పంపించి వెంటనే సర్వే చేయిస్తాం. ఆయకట్టు కాల్వ చుట్టూ ప్రహరీ నిర్మిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. కాల్వ మూసివేయడం నేరమే.. ఆయకట్టు చివరి రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తాం.
-వెంకటేశ్వర్లు, తాసిల్దార్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా

గ్రామ నక్షలోని కాల్వ మాయం చేశారు


మొద్దు జంగారెడ్డి, రైతు

శేరిగూడ గ్రామంలోని అనేకమంది రైతుల పంటపొలాలకు నీరందించే కాల్వ మాయమైంది. గోడకట్టి కాల్వను మూసివేయడంతో ఆయకట్టు చివరి రైతులకు నీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. కాల్వవెంట ఆయకట్టు కిందిపొలాలకు గతంలో వెళ్లేవాళ్లం, ప్రస్తుతం ఉన్న కాల్వ కూడా మాయంచేయడంతో పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై ఏడాది కిందట ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకుంటే సర్వే జరిపించాలని లేఖ రాసినా రెవెన్యూ అధికారులు స్పందించడంలేదు. నిజాం కాలంలో నిర్మించిన ఆయకట్టు కాల్వను కబ్జాల చెరనుంచి విడిపించి చివరిరైతులకు మేలుచేయాలి.సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పది..


గౌష్‌ఖురేషి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్, మెదక్

రెవెన్యూశాఖలో మార్పులు చేసేందుకు కొత్తచట్టం తేవాలనే సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పది. గ్రామాల్లో భూసమస్యలతో కొట్టుమిట్టడుతున్న పేదలకు దేశంలో ఎక్కడాలేని విధంగా రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వరంలా ప్రవేశపెట్టారు. ఏండ్ల తరబడి తాసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసిపోయిన బాధితులకు ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయం గొప్ప ఊరటనిస్తుంది.


సామాన్యుడికి చేరువయ్యేలా చర్యలు


గోపీ, పీజీ విద్యార్థి

అవినీతి నిర్మూలన కోసం సీఎం కేసీఆర్ చేపడుతున్న చర్యలు సామాన్య ప్రజల్లో భరోసాను పెంచుతున్నాయి. వ్యవస్థలు అవినీతిమయమై సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవినీతిరహిత వ్యవస్థలు రావాలని ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నెరవేర్చేదిశగా సీఎం కేసీఆర్ వ్యవస్థల ప్రక్షాళన చేయాలనుకోవడం సంతోషకరమైన విషయం. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారు.
రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చాలి


ప్రభాకర్‌రెడ్డి, పులుమామిడి

రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చాలి. ఎందుకంటే నేడు నమోదవుతున్న కేసుల్లో సగం భూములకు సంబంధించినవే ఎక్కువ. అధికారులుచేస్తున్న తప్పిదాలు ప్రాణాలమీదకు తెస్తున్నాయి. రికార్డుల్లో ఉంటే కబ్జాలో రాయరు. కబ్జాలో ఉంటే రికార్డుల్లో ఉండదు. ఒక సర్వే నంబర్‌లో కబ్జా ఉంటే మరో సర్వే నంబర్‌లో పట్టా ఉంటుంది. ఈ విధానంతో భూమి యజమానుల మధ్య కక్షలు పెరిగి ఘర్షణలకు దారితీస్తున్నాయి. దీంతో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ నష్టపోతున్నారు. అధికారులు నిజాయితీగా వ్యవహరించి ఉంటే ఈ సమస్యలు ఉత్పన్నం కావు. ఇలాంటి సమస్యలు రాకుండా రెవెన్యూ వ్యవస్థలో మార్పు తీసుకు రావాలి.
- ప్రభాకర్‌రెడ్డి, పులుమామిడి, నవాబుపేట మండలం, వికారాబాద్ జిల్లా

159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles