చేయలేమంటూ చేతులెత్తేశారు


Wed,May 22, 2019 01:52 AM

Revenue officers Neglect Agricultural Land Registration

-1.33 ఎకరాలకు నమోదైంది 1.28 ఎకరాలే
-ఏడాదిగా తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు

అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన ఏనుగుల నర్సయ్యకు తన తండ్రి నుంచి వారసత్వంగా ఎకరం 33 గుంటల భూమి వచ్చిం ది. ఆ భూమిని 1994లో నర్సయ్య భార్య సుగుణమ్మ పేరు మీద అధికారులు పాస్‌పుస్తకంలో నమోదుచేశారు. సర్వేనంబర్ 193/ అ/3 ఎన్‌ఎస్పీలో 0.15 గుంటలు, 189/అ/ 1లో 1.18 గుంటలు.. మొత్తం 1.33 ఎకరాలు ఉన్నది. 2018లో భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం సుగుణమ్మ పాస్‌పుస్తకంలో 1.28 ఎకరాలు మాత్రమే నమోదుచేశారు. మరో 5 గుంటల భూమి రికార్డులోకి ఎక్కించలేదని సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి సైదారావు దృష్టికి తేగా.. చెక్కుల పంపిణీలో బిజీగా ఉన్నానని, పది రోజుల తర్వాత చూస్తానని చెప్పాడు. నెల రోజుల తర్వాత మళ్లీ వెళ్లి కలిస్తే పాత పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పి మరో నెలరోజులు తిప్పాడు. చివరకు 1994 నాటి రికార్డులు లభించడం లేదని, వెనుకటి రికార్డులకు వెళ్లి చూడలేమని చెప్తూ ఇప్పుడు ధరణి వెబ్‌సైట్‌లో సరిచేయడం కుదరదని చేతులెత్తేశాడు. ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వేచేయిస్తానని, భూమి తనది కాకపోతే ఎలాంటి శిక్షనైనా అనుభవిస్తానని సుగుణమ్మ కుమారుడు జానయ్య వేడుకున్నా ఫలితం లేకుండాపోయింది. 2019 ఫిబ్రవరిలో తమ భూమిని సరిచేయాలని మండల రెవెన్యూ అధికారికి ధరఖాస్తు పెట్టుకున్నా ఇప్పటివరకు న్యాయం జరుగలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

తిరిగి తిరిగి వేసారుతున్నాం


ఏనుగుల సుగుణమ్మ, బాధిత రైతు, త్రిపురవరం

మా భూమిని మాకు నమోదు చేయడానికి రెవెన్యూ అధికారులు చుక్కలు చూపిస్తున్నరు. ఏడాదిగా ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నరు. రెవెన్యూ అధికారులు ప్రతిసారీ పొంతన లేని సమాధానాలు చెప్తూ సమస్యను దాట వేస్తున్నరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.

సర్వే నంబర్లలో విస్తీర్ణం అంతవరకే ఉన్నది

ఏనుగుల నర్సయ్యకు వారసత్వంగా వచ్చిన భూమి మిగతా సోదరులకు పంచగా 1.28 గుంటలు మాత్రమే ఉన్నది. దాంతో రికార్డులో అదే నమోదుచేశాం. భూమి విస్తీర్ణం లేకుండా పాస్‌పుస్తకాల్లో భూమిని పెంచలేమని వారికి వివరించాం.
- సైదారావు, వీఆర్వో, త్రిపురవరం

655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles