కోర్టు ఉత్తర్వులు బేఖాతరు


Sat,August 17, 2019 02:50 AM

Revenue Officers Huge Mistakes In Pattadar Passbook

-ఒక సర్వే నంబర్ భూమికి బదులు మరోచోట కేటాయింపు
-హైకోర్టు మొట్టికాయలు వేసినా మారని రెవెన్యూ అధికారులు
-కోర్టు ఆదేశాలతో కేటాయింపు రద్దు.. మళ్లీ పునరుద్ధరణ
-ధర్మగంటను ఆశ్రయించిన భువనగిరి బాధితురాలు

రెవెన్యూ అధికారులు అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. న్యాయం చేయాల్సిన అధికారులే కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తున్నారు. భూ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నా పట్టనట్టు రికార్డుల్లో మార్పులు చేశారు. బాధితులు న్యాయం చేయాలని కాళ్లరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో భువనగిరి పట్టణానికి చెందిన బాధితురాలు రత్న శ్రీవాణి చివరికి ధర్మగంటను ఆశ్రయించారు.

భువనగిరి టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన రత్న శ్రీవాణి మండలంలోని బొమ్మాయిపల్లి పరిధిలోని సర్వే నంబర్ 10/2లో రెండెకరాల భూమిని కూరం నర్సయ్య అనే వ్యక్తి వద్ద 2001లో కొని వ్యవసాయం చేసున్నారు. 2002లో నల్లగొండలోని ఏపీఎస్‌ఎఫ్‌సీలో సదరు భూమిని చూపించి టాటా లైట్ వాహనం కొన్నారు. 28-01-2019లో ఆ భూమిలో నుంచి రిలయన్స్ గ్యాస్ పైప్‌లైన్ వెళ్లగా నష్టపరిహారాన్ని సైతం పొందారు. భూరికార్డుల ప్రక్షాళనలో సదరు రెండెకరాల భూమికి 1-బీని సైతం రెవెన్యూ అధికారులు రత్న శ్రీవాణికి అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నది. 18-12-2017న పాదరాజు సరోజినీదేవి అనే మహిళ సర్వే నంబర్ 10లో తనకు ఎకరం భూమి ఉన్నదని పిటిషన్ వేశారు. తాసిల్దార్ సర్వే నంబర్ 10కి బదులుగా 19-01-2018న 10/2లోని రత్న శ్రీవాణికి చెందిన రెండెకరాల్లోనుంచి ఎకరం భూమిని కేటాయించేందుకు చుట్టు పక్కల రైతులకు నోటీసులు అందజేశారు. దీంతో బాధితురాలు ఆర్డీవో కోర్టులో అప్పీలుచేశారు. అయినప్పటికీ న్యాయం జరుగకపోవడంతో 20-10-2018న జాయింట్ కలెక్టర్‌తోపాటు, భువనగిరి సివిల్ కోర్టును ఆశ్రయించారు.

సివిల్ కోర్టులో కేసు నడుస్తుండగానే జేసీ సర్వే నంబర్ 10/2లోని ఎకరం భూమిని సరోజినీదేవికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో న్యాయం కోసం బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. సివిల్ కోర్టులో కేసు విచారణలో ఉండగానే ఉత్తర్వులు ఎలా ఇస్తారని హైకోర్టు అధికారులకు మొట్టికాయలు వేసింది. సరోజినీదేవి కోరినట్టుగా సర్వే నంబర్ 10లో కాకుండా 10/2లో ఉన్న భూమిని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. కోర్టు ఆదేశం మేరకు ఆర్డీవో 26-06-2019న సరోజినీదేవికి జారీచేసిన పాస్‌పుస్తకం, ఆర్వోర్, 1-బీ, పహాణీ రద్దుచేశారు. రద్దు ఉత్తర్వులు ఇచ్చిన అదే ఆర్డీవో 3-08-2019న తిరిగి బాధితురాలు రత్న శ్రీవాణికి సంబంధించిన సర్వే నంబర్ 10/2లోని రెండెకరాల నుంచి ఎకరం సరోజినీదేవి పేరిట ఆన్‌లైన్‌లో నమోదుచేయాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఆర్డీవో పదే పదే ఉత్తర్వులిస్తూ ప్రత్యేకంగా చొరువ తీసుకోవడంలో ఆంతర్యమేమిటని బాధితురాలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయంచేయాలని కోరుతున్నారు.

150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles