కాళ్లరిగేలా తిరిగినా పట్టదా!


Mon,July 22, 2019 01:58 AM

Revenue Officers Huge Mistakes In Pattadar Passbook

-పైసలిచ్చినవారికే పనులు చేస్తారా?
-పాస్‌పుస్తకాల జారీలో రెవెన్యూ ఇష్టారాజ్యం
-సామాన్యులను రేపుమాపంటూ తిప్పుకొంటున్నరు
-పేరు మార్పు కోసం వికారాబాద్ రైతుల తిప్పలు

వికారాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ఒకవైపు భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతుల ఇబ్బందులు తొలగించి పాస్‌పుస్తకాలు అందించాలని ఆదేశిస్తుంటే రెవెన్యూ అధికారులు అందుకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, తప్పుడు పనులతో రికార్డుల్లో పేరుమార్పు జరుగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ తాసిల్దార్ కార్యాలయం చుట్టూ నిత్యం వందలమంది రైతులు భూ సమస్యలు పరిష్కరించాలని ప్రదక్షిణలు చేస్తున్నారు. వికారాబాద్ మండలం సిద్ధులూరు, ధన్నారం, కొటాలగూడ, పీరంపల్లి, గొట్టిముక్కల, పీలారం, పులుమద్ధి తదితర గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు ఉన్నాయి.

పరిష్కారం కోసం వీరంతా గత ఏడాది కాలంగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు సమస్యలు పరిష్కరించడంలో ఏమాత్రం శ్రద్ధచూపడం లేదు. ఎందుకు చేయడం లేదని గట్టిగా ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఏవో కారణాలు చెప్పి తప్పించుకొంటున్నారు. రేపు మాపు అంటూ ఏండ్లకుఏండ్లు కాలయాపన చేస్తున్నారు. అన్ని పత్రాలు సరిగా ఉన్నా పేర్లను ఆన్‌లైన్‌లో ఎక్కించి పాస్‌పుస్తకాలు జారీచేయడం లేదు. నిత్యం కలెక్టర్ సమావేశాలు ఏర్పాటుచేసి రైతుల సమస్యలను తీర్చాలని ఆదేశిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం రైతులను కార్యాలయం చుట్టూ తిప్పుకొంటున్నారని, అడిగినంత డబ్బు ముట్టజెప్పేవారికి మాత్రం గంటల వ్యవధిలోనే రికార్డుల్లో నమోదుచేసి, పాస్‌పుస్తకాలు చేతిలో పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

తమ్ముడికి పాస్‌బుక్ ఇచ్చి.. నాకు ఇయ్యలేదు


మధుసూదన్‌రెడ్డి, ధన్నారం, వికారాబాద్

వికారాబాద్ మండలం ధన్నారంలోని సర్వే నంబ ర్ 62లో మాకు 4 ఎకరాల పొలం ఉన్నది. ఇదే సర్వే నంబర్‌లో మా తమ్ముడికి పాస్‌బుక్ ఇచ్చారు. వివరాలు ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు వీఆర్వో సురేశ్ రూ. 500 కూడా తీసుకున్నా పనిచేయలేదు. డబ్బున్నవారికే ఇక్కడ పనులు చేస్తున్నారు. నిలదీస్తే పొలంపై కేసు ఉన్నదని బుకాయిస్తున్నారు. నా తమ్ముడి పొలంపై కూడా కేసు ఉంటే పాస్‌బుక్ ఎలా ఇచ్చారు? నాకు వెంటనే పాస్‌బుక్ ఇస్తే రైతుబంధు సహాయం అందుతుంది. రియల్‌ఎస్టేట్ వ్యాపారులు పొలాలు కొన్న వెంటనే ఆన్‌లైన్‌లో ఎక్కిస్తున్నారు. పైసలిస్తేనే అధికారులు పనులు చేస్తున్నారు.ఏడాదిగా తిరుగుతున్నా పనికాలేదు


కుర్వ కిస్టయ్య, ధన్నారం, వికారాబాద్

మాది వికారాబాద్ మండలం ధన్నారం. మా నాన్న బీరయ్య పేరున 12 ఎకరాల పొలం ఉన్నది. మేము ఐదుగురు అన్నదమ్ములం. ఒక్కొక్కరికీ 2 ఎకరాల చొప్పున ఏడాది కిందట పంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకొన్నాం. రికార్డుల్లో మా పేరుమీదికి మార్చేందుకు ఏడాదినుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పనిచేయడం లేదు. మాలాంటి నిరుపేద రైతులను నిత్యం కార్యాలయాల చుట్టూ తిప్పితే ఎలా బతుకాలి. అధికారులు వెంటనే స్పందించి న్యాయంచేయాలి.నెలాఖరులోగా సమస్యలు పరిష్కరిస్తాం


చిన్నప్పలనాయుడు, వికారాబాద్ తాసిల్దార్

ఈ నెలాఖరులోగా భూసమస్యలను పరిష్కరించి, రైతులందరికీ పాస్‌పుస్తకాలు అందేలా చర్యలు తీసుకొంటున్నాం. వికారాబాద్ మండలంలో 16 వేల ఖాతాలు ఉండగా 14,506 ఖాతాలకు పాస్‌పుస్తకాలు అందించాం. మిగిలినవి కూడా త్వరలో సరిచేసి అందేలా చర్యలు తీసుకొంటాం. రైతులు సిబ్బందికి డబ్బులు ఇవ్వకూడదు. పనులు చేయడానికి సిద్ధం గా ఉన్నాం. 1,700 ఖాతాలు భూవివాదాల కారణంగా అపరిష్కృతంగా ఉన్నా యి. అందులో 800 ఖాతాలను ఇప్పటికే సరిచేశాం. మిగితా ఖాతాలను కూడా ఈ నెలఖరులోగా సరిచేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చి, డిజిటల్ సంతకాలు చేసి రైతులకు పాస్‌పుస్తకాలు అందజేస్తాం.

137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles